మోయలేని పెట్రో భారం!

ABN , First Publish Date - 2021-10-19T05:36:34+05:30 IST

పెట్రో ధరలకు కళ్లెం పడడంలేదు... రోజురోజుకీ ఇందన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడికి కంటి మీద కునుకు కరవవుతోంది.

మోయలేని పెట్రో భారం!
పెట్రోల్‌ బంకు

రోజు రోజుకి పెరుగుతున్న ధరలు

పెట్రోలు రూ.112.19 డీజిల్‌ రూ.104.61

వినియోగదారుల ఆందోళన

(ఆంధ్రజ్యోతి, గుంటూరు)

పెట్రో ధరలకు కళ్లెం పడడంలేదు... రోజురోజుకీ ఇందన ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యుడికి కంటి మీద కునుకు కరవవుతోంది. నిత్యావసరాలతోపాటు పెట్రోలు, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ.112.19, డీజిల్‌ రూ.104.61కి చేరుకోవడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు.

- జిల్లాలో గత నెల 30వరకు పెట్రోలు ధర రూ.107.56 ఉండేది. అక్టోబరు ఒకటి నుంచి పదో తేదీ వరకు 8సార్లు పెట్రోలు,  డీజిల్‌ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు అన్ని వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇలాగే ధరలు పెరుగుతూ పోతే ద్విచక్రవాహనాలు, కార్లు, లారీల యజమానులపై అధికభారం పడుతుంది.  డీజిల్‌ ధర రవాణా రంగాన్ని కుదిపేస్తోంది.


గతేడాదితో పోలిస్తే కళ్లు తిరగాల్సిందే...

గతేడాది ఆరంభంలో కరోనాకు ముందు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు, నేటికి ఉన్న వ్యత్యాసం చూస్తే కళ్లు తిరగకమానవు. నొప్పి తెలియకుండా భారాలు మోపాలనుకున్నారేమే పాలకులు పెట్రోధరలను పైసల్లోనే పెంచుకుంటూ మెల్లగా లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సెంచరీ దాటించేశారు. కరోనాకారణంగా ఏడాదిన్నరగా ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత దెబ్బతీస్తున్నాయి. చమురు ధరలు పెరిగిన ప్రతిసారి నలిగిపోయేది మధ్యతరగతి వర్గాలే. ఇప్పటికే నిత్యావసరాలు మొదలుకుని అనేకధరలు కొండెక్కి కూర్చున్నాయి. సామాన్యులు ఏమీ కొనలేని స్థితిలో ఉన్నారు. 


కరోనాకు ముందు ప్రస్తుతం

డీజిల్‌ ధర రూ.69.92 డీజిల్‌ ధర రూ.104.61

పెట్రోల్‌ ధర రూ.76.05 పెట్రోల్‌ ధర రూ.112.19


సగటున రూ.30కిపైగా పెరిగిన ధరలు

డీజిల్‌, పెట్రోల్‌ ధరలు గత ఏడాదితో పోలిస్తే లీటర్‌కు సగటున రూ.30పైనే పెరిగాయి. రోజురోజుకు పెరుగుతున్నధరతో నెలవారి బడ్జెట్‌ తలకిందులవుతోంది. వివిధ పనులపై రోజుకు కనీసం 60-70 కిలోమీటర్లు బండిపై ప్రయాణం చేయాల్సివస్తుంది. పెట్రోలు ధర రూ.80ఉన్నప్పుడు రోజుకి రూ.100 పెట్రోలు సరిపోయేది. ఇప్పుడు లీటరు రూ.110కి చేరింది ఇప్పుడు నెలకు అదనంగా రూ.1500 వెచ్చించాల్సివస్తోంది.  రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉండటంతో బండి మైలేజీ కూడా పడిపోతోంది. - ప్రసాద్‌, ప్రైవేటు ఉద్యోగి.


ఆదాయమంతా ఇంధనానికే

కరోనాతో రెండేళ్లు ఆర్థికంగా నష్టపోయాం. ఇప్పుడైనా ఆటో నడుపుదామంటే డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ప్రయాణికులు కూడా తగ్గిపోయారు. రోజుకు డీజిల్‌ ఖర్చే రూ.400దాకా అవుతోంది.  ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.102 దాటుతోంది. ఇదికాక పోలీసు చలనాలు ఇలా చాలా అవుతున్నాయి. బండి తియ్యాలంటేనే భయపడాల్సి వస్తోంది. - కోటేశ్వరరావు, ఆటో డ్రైవర్‌

పక్క రాష్ట్రంలో కంటే అధికం

పక్కనున్న తెలంగాణలో కంటే రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోలు  ధర ఇక్కడ ఎక్కువగా ఉంది. రోజుకు 24, 40, 30పైసలంటూ పెంచుకుంటూ పోతున్నారు. దీనికి ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు? గతంలో డిజిల్‌ ధర రూ.63కు చేరినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న నేతలు నాడు ప్రతిపక్ష నేతలుగా పాలకులకు గాజులు, చీరలు పంపారు. ఇప్పుడు ఆ నేతలు ఏమయ్యారు? బాదుడే బాదుడు అన్న నేతలు నేడు అధికారంలోకి వచ్చాక సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. డీజిల్‌రేట్లు పెరగటంతో సాధారణంగా రవాణా కిరాయిలు పెంచాల్సి వస్తుంది. దీని ప్రభావం సామాన్యుడిపై పడుతోంది.  -  ప్రదీప్‌, మిర్చి వ్యాపారి

Updated Date - 2021-10-19T05:36:34+05:30 IST