జీఎస్‌టీలోకి పెట్రోల్‌, డీజిల్‌!

ABN , First Publish Date - 2021-09-15T08:56:05+05:30 IST

పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు,సేవల పన్ను (జీఎ్‌సటీ) చట్టంలో చేర్చే అవకాశం ఉంది.

జీఎస్‌టీలోకి పెట్రోల్‌, డీజిల్‌!

  • ఏటీఎఫ్‌, సహజ వాయువు,  ముడి చమురు సైతం..
  • 17న జీఎస్‌టీ మండలి భేటీలో పరిగణనలోకి తీసుకునే చాన్స్‌ 


న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌తో పాటు ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తు,సేవల పన్ను (జీఎ్‌సటీ) చట్టంలో చేర్చే అవకాశం ఉంది. ఈ నెల 17న జరగనున్న సమావేశంలో జీఎ్‌సటీ మండలి ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా పన్నులు విధిస్తున్నాయి. వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే గనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. కొవిడ్‌-19 అత్యవసరాలపై సుంకం ఊరటను మరికొంత కాలం కొనసాగించడంతో పాటు 2022 జూన్‌ తర్వాత కూడా పరిహార సుంకం కొనసాగింపు ప్రతిపాదనలను సైతం ఈ భేటీలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


ప్రస్తుతం దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నా యి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.26,  డీజిల్‌ రేటు రూ.96.69గా ఉంది. ఇంధన ధరల సెగ తగ్గాలంటే జీఎ్‌సటీలో చేర్చడమే పరిష్కారమన్న వాదన బలంగా వ్యక్తమవుతోంది. ఎందుకంటే, వీటిపై వినియోగదారులు పన్ను మీద పన్ను చెల్లించాల్సి వస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తి వ్యయంతో పాటు కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం మొత్తంపైన రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) వడ్డిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తులనుజీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చే విషయంపై నిర్ణయం తీసుకోవాలని జూన్‌లో కేరళ హైకోర్టు జీఎ్‌స టీ మండలిని కోరింది. ఈ నేపథ్యంలో మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాల జాబితాలో ఈ ప్రతిపాదనను సైతం చేర్చడం జరిగిందని అధికారి ఒకరు తెలిపారు.


కేంద్రం, రాష్ట్రాలకు చెందిన డజనుకు పైగా పన్నులను విలీనం చేస్తూ 2017 జూలై 1 నుంచి జీఎస్‌టీ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. అయితే, పెట్రోల్‌, డీజిల్‌, విమాన ఇంధనం (ఏటీఎఫ్‌), సహజ వాయువు, ముడి చమురును మాత్రం ఈ చట్టంలో చేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకివి ప్రధాన పన్ను ఆదాయ వనరులు కావడమే ఇందుకు ప్రధాన కారణం. జీఎస్‌టీ ఆదాయాన్ని కేంద్రం, రాష్ట్రాలు సమానంగా పంచుకుంటున్నాయి. కానీ, పెట్రో ఉత్పత్తులపైన మాత్రం వేర్వేరుగా పన్నులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై రూ.32.80, డీజిల్‌పై రూ.31.80 ఎక్సైజ్‌ సుంకం వసూలు చేస్తోంది. 

Updated Date - 2021-09-15T08:56:05+05:30 IST