అవును.. బాదేశారు

ABN , First Publish Date - 2020-09-19T09:21:04+05:30 IST

అవును.. బాదేశారు

అవును.. బాదేశారు

పెట్రోలు, డీజిల్‌ లీటర్‌పై రూ.1 సెస్‌

ఆర్డినెన్స్‌ జారీ చేసిన ప్రభుత్వం.. రోడ్ల అభివృద్ధి పేరిట బాదుడు

ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు.. ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’  


‘సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ, సొమ్ముల్లేవ్‌. కాబట్టి.. ఫీజులు, రుసుములు పెంచుతాం. సెస్సులూ వేస్తాం’... ఇదీ సర్కారు వారు జీవోల సాక్షిగా చెప్పిన మాట! సామాన్యుల బండి కదిలేందుకు వాడే ఇంధనంపై రహదారుల అభివృద్ధి పేరిట లీటరుకు రూపాయి సెస్సు వేశారు. బార్లపైనా అదనపు సుంకాలు, ఫీజులు వడ్డించారు.


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరోసారి పన్నుల మోత మోగింది. ఒక్కో లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం రూ.1 అదనపు భారం మోపింది. ఇప్పటికే వ్యాట్‌ కాకుండా అదనపు వ్యాట్‌ పేరుతో ఒక్కో లీటర్‌పై రూ.4 వసూలు చేస్తోంది. ఇప్పుడు ‘రోడ్ల అభివృద్ధి’ పేరిట కొత్త పన్నును అమల్లోకి తెస్తూ గవర్నర్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను శుక్రవారం జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ వెంటనే అమలులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు నెలల్లోనే రెండోసారి వాహనదారులపై భారం పడబోతోందని పేర్కొంటూ ‘మళ్లీ బాదుడు’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ధరల పెంపుపై ఈ నెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకోగా, దాన్ని ఇప్పుడు అమలులోకి తీసుకువచ్చింది.


కాగా, కొత్తగా విధించిన పన్ను ద్వారా వచ్చిన ఆదాయాన్ని కేవలం రోడ్ల అభివృద్ధి, మౌలిక సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించనున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌ భార్గవ ప్రకటించారు. ఈ పన్ను ద్వారా ఏడాదికి సుమారు రూ.500కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని, ఆ మొత్తాన్ని రోడ్ల అభివృద్ధి కోసం ‘రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు’ ఇస్తారని వివరించారు. లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని, కరోనాపై పోరాటంలో భాగంగా వైద్యసేవలకు అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోందని, అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి పెంచిందని తెలిపారు. ఈ మేరకు ఏపీ విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌ చట్టం-2005)కు సవరణలు చేసినట్లు తెలిపారు. 


తెలంగాణ కంటే ఎక్కువ: పక్క రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి ఈ ఉత్పత్తులపై అదనపు వ్యాట్‌ లీటర్‌కు రూ.2 మాత్రమే ఉండేది. సంక్షేమ పథకాల సాకుతో ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి లీటర్‌పై రూ.4 చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ మధ్య పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు సుమారు రూ.2 తేడా వస్తోంది. తాజాగా విధించిన సెస్‌ వల్ల మరో రూపాయి ఏపీ ప్రజలపై భారం పడింది. రాష్ట్రంలో కొత్తగా విధించిన పన్నుతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.87కు చేరగా, తమిళనాడులో రూ.84.21, కర్ణాటకలో రూ.83.78, యానాంలో రూ.81.26 మాత్రమే ఉంది. రాష్ట్రంలో లీటర్‌ డీజిల్‌ ధర రూ.81 కాగా, తమిళనాడులో రూ.77.04, కర్ణాటకలో రూ.76.25, యానాంలో రూ.76.50 ఉంది. పొరుగు రాష్ట్రాల్లో ధరల్లో తేడాలతో ఏపీలో సరుకు రవాణాపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2020-09-19T09:21:04+05:30 IST