బంకులు భద్రమేనా?

ABN , First Publish Date - 2022-05-24T05:17:21+05:30 IST

పెట్రోల్‌ బంకుల్లో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజుకోసారి పెరుగుతున్నా, పెట్రోల్‌ రేటులో 35 శాతం వరకు ట్యాక్సులు వసూలు చేస్తున్నా వసతులు కల్పించాల్సిన బాధ్యతను బంకుల అటు యాజమాన్యాలు, పెట్రోలియం కంపెనీలు కానీ.. ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. నాణ్యత, భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

బంకులు భద్రమేనా?

పెట్రోల్‌ బంకుల్లో నిబంధనలకు నీళ్లు


గజ్వేల్‌, మే 23: పెట్రోల్‌ బంకుల్లో నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజుకోసారి పెరుగుతున్నా, పెట్రోల్‌ రేటులో 35 శాతం వరకు ట్యాక్సులు వసూలు చేస్తున్నా వసతులు కల్పించాల్సిన బాధ్యతను బంకుల అటు యాజమాన్యాలు, పెట్రోలియం కంపెనీలు కానీ.. ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు. నాణ్యత, భద్రతా ప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. 


జిల్లాలో 300 బంకులు 

సిద్దిపేట జిల్లాలో 300 వరకు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రతీ పెట్రోల్‌బంకులో మరుగుదొడ్లు, మూత్రశాలలు అందుబాటులో ఉండాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి. విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి. కానీ ఈ సౌకర్యాలు ఎక్కడా కనిపించడం లేదు. మరుగుదొడ్లు ఉన్నా తాళం వేసి దర్శనమిస్తున్నాయి. గాలినింపే యంత్రాలు ఏర్పాటుచేసి వాహనాల్లో ఉచితంగా గాలి నింపాలి. కానీ 90 శాతం బంకుల్లో గాలి యంత్రాలను ఏర్పాటు చేయడం లేదు. 


నాణ్యత, భద్రతపై పట్టింపేది?

వాహనదారులకు పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యతపై అనుమానం వస్తే తక్షణమే నివృత్తి చేసే ఉపకరణాలు అందుబాటులో ఉండాలి. పెట్రోల్‌, డీజిల్‌ నాణ్యత నిర్దారణకు ఫిల్టర్‌ పేపర్‌, డెన్సిటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏ మాత్రం అనుమానం వచ్చినా పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలకు ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. నిబంధనలపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. బంకుల్లో భద్రతా చర్యలు కనిపించడం లేదు. అగ్నిప్రమాదాలు జరిగితే స్పందించడానికి బంకుల్లో నలుమూలలా ఇసుక బక్కెట్లు, అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ దాదాపు ప్రతీ బంకులో ఇవి అలంకారప్రాయంగానే దర్శమిస్తున్నాయి. ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు మచ్చుకు కూడా కనిపించడం లేదు. పెట్రోల్‌ పోసే సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడటం నిషేధం. కానీ బంకుల నిర్వాహకులు, సిబ్బందే సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ పెట్రోల్‌ పోస్తుంటారు. 


బంకుల్లో అందాల్సిన సేవలు

- వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపే యంత్రాలు ఏర్పాటు చేయాలి.

- ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.

- మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కన ఉన్న బంకుల్లో ఇది తప్పనిసరి.

- వాహనదారులకు తాగునీట సౌకర్యం కల్పించాలి.

- సలహాలు, సూచనల కోసం ఫిర్యాదులు పుస్తకం అందుబాటులో ఉంచాలి.

- బంకుల్లో పై సేవలన్నీ అందిస్తున్నట్టు సూచిక బోర్డులు ప్రదర్శించాలి

జిల్లాలో ఎక్కడా పెట్రోల్‌ బంకుల్లో ఇలాంటి సేవలు అందడం లేదు. నిరంతరం తనిఖీలు చేస్తూ నిబంధనలు అమలయ్యేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో బంకు యాజమాన్యాల ఇష్టారాజ్యం నడుస్తున్నది.

Updated Date - 2022-05-24T05:17:21+05:30 IST