Chennai: ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి...24 గంటల్లో మూడో ఘటన

ABN , First Publish Date - 2022-09-24T20:15:00+05:30 IST

ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న...

Chennai: ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి...24 గంటల్లో మూడో ఘటన

చెన్నై: ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై తమిళనాడులో పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త (RSS member) సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ (petrol bomb) విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో ఈ తరహా దాడులు జరగడం ఇది మూడోసారి. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో చెన్నైలో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.


కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని తాను అనుకున్నప్పటికీ అది కాదని తేలిందని చెప్పారు. వెంటనే మంటలు ఆర్పివేసి, పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. నిందితుడు ఫుటేజ్ లభించినట్టు చెప్పారు.


కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. దాడి ఘటన అనంతరం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


కేరళలోని కన్నూరులో సైతం ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై ఇదే తరహా దాడి జరిగింది. పీఎఫ్ఐ ఇచ్చిన బంద్ పిలుపు నేపథ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబ్ విసిరారు. దీనిపై దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2022-09-24T20:15:00+05:30 IST