పెట్రో ధరలపై భగ్గు!

ABN , First Publish Date - 2021-02-27T04:40:05+05:30 IST

సామాన్య మానవుడిని అతలాకుతలం చేస్తున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని, వాటిపై ఎక్సైజ్‌ డ్యూటీని ఉపసంహరించుకోవాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్‌, వామపక్ష నాయకులు శుక్రవారం చేపట్టిన బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

పెట్రో ధరలపై భగ్గు!
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న లారీ ఓనర్ల అసోసియేషన్‌ నాయకులు

జిల్లావ్యాప్తంగా నిరసన జ్వాల

కలెక్టరేట్‌ ఎదుట లారీ యజమానుల ధర్నా

కదం తొక్కిన వామపక్ష నాయకులు


నెల్లూరు (హరనాథపురం), ఫిబ్రవరి 26 : సామాన్య మానవుడిని అతలాకుతలం చేస్తున్న పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలని, వాటిపై ఎక్సైజ్‌  డ్యూటీని ఉపసంహరించుకోవాలని కోరుతూ లారీ ఓనర్ల అసోసియేషన్‌, వామపక్ష నాయకులు శుక్రవారం చేపట్టిన బంద్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మొదట పెట్రోలు బంకుల నిర్వాహకులు కూడా ఈ బంద్‌లో పాల్గొంటారని అంతా భావించినా, వారు పాల్గొనలేదు. 


కలెక్టరేట్‌ ఎదుట ధర్నా


నెల్లూరు జిల్లా  లారీ ఓనర్ల అసోసియేషన్‌ నాయకులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా  ఆ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.గోపాల్‌నాయుడు మాట్లాడుతూ కొవిడ్‌ కారణంగా సంవత్సర కాలంగా లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిస్థాయి ఉత్పాదన చేయలేని స్థితుల్లో లోడింగ్స్‌ లేక కిరాయిలు పెరగలేదన్నారు. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం డీజిల్‌ ధరలను విపరీతంగా పెంచి భారం మోపుతోందని తెలిపారు. వాహన తుక్కు పాలసీని సమరించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి సంవత్సరం పెంచుతున్న టోల్‌గేట్లను నిలుపుదల చేయాలని, కాలం చెల్లిన టోల్‌గేట్లను తొలగించాలని, థర్డ్‌పార్టీ పాలసీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, వాహనాల నుంచి వసూలు చేసే గ్రీన్‌ టాక్సును నిలిపివేయాలని కోరారు. ఈ ధర్నాలో అ అసోసియేషన్‌  జిల్లా అధ్యక్షుడు వి.చిన్నారెడ్డి, కార్యదర్శి పీఎల్‌ నారాయణరావు, ట్రెజరర్‌ ఎస్‌కే ఖాధిర్‌ తదితరులు పాల్గొన్నారు. కావలిలో లారీ యజమానులు లారీకి తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.



వామపక్షాల ఆందోళన


పెట్రో ధరలను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా వామపక్ష నాయకులు ఆందోళన చేశారు. నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట తదితర ప్రాంతాలలో సీపీఐ, సీపీఎం నాయకులు జెండాలు చేతబట్టి కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-02-27T04:40:05+05:30 IST