Abn logo
Feb 23 2021 @ 01:02AM

పెట్రో వ్యూహం

వాహన ఇంధనాల ధరలకు పట్టపగ్గాలు లేకుండా ఉంది. ప్రజలు ఎంత నిట్టూరుస్తున్నా, ప్రతిపక్షాలు ఎంతగా విమర్శలు గుప్పిస్తున్నా, పెట్రోలు సెంచరీ కొట్టబోతోందన్న ఛలోక్తులు పేలుతున్నా, ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయమై కేంద్రప్రభుత్వం ఏ మాత్రం మొహమాటపడకపోగా, విమర్శకులపై ఎదురు విమర్శలు చేస్తున్నది. సాధారణంగా చమురు ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలతో ముడిపడి ఉంటాయి. కానీ, కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ ధరలు అతి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా ప్రత్యేక ఆదాయాన్ని సమకూర్చుకోవడం ఒక విధానంగా మారింది. దిగుమతి ధరలు తగ్గినప్పటికీ, ఆ తగ్గుదల వినియోగదారులకు చేరకుండా ఆ మేరకు పన్నులను సుంకాలను విధించడం ఒక ఆనవాయితీగా మారింది. ఇప్పుడు అంతర్జాతీయ ధరలు నిలకడగా ఉన్నప్పటికీ, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల మాత్రం నిత్యకృత్యం అయింది. 


పెట్రోలు మూల ధర 33.60 రూపాయిలు కాగా, హైదరాబాద్‌లో దానిపై కేంద్రపన్ను దాదాపు మూలధరతో సమానంగా 32.90, రాష్ట్రపన్ను 23.43 ఉన్నాయి. కేంద్రం విధించే ఎక్సైజ్‌సుంకం 32.90లో కేవలం బేసిక్ ఎక్సైజ్ సుంకం రూపాయి నలభై పైసలు మాత్రమే. బేసిక్ ఎక్సైజ్ సుంకంలో మాత్రమే రాష్ట్రాలకు 42 శాతం వాటా లభిస్తుంది. తక్కినదంతా కేంద్రం చేతికే వెడుతుంది. సరుకులు, సేవల పన్ను (జిఎస్టీ)ని ప్రవేశపెడుతున్నప్పుడు, పన్నుల పంపకాలపై విస్తృత చర్చ జరిగింది. రాష్ట్రాలు ఆదాయం కోసం ఎక్కువగా ఆధారపడే సరుకులు రెండు, ఒకటి చమురు ఉత్పత్తులు, రెండోది మద్యం. కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీకి అదనంగా తాము కూడా సుంకాలు విధించే అవకాశం పెట్రోల్, డీజిల్ విషయంలో ఉన్నది. మద్యం అయితే పూర్తిగా రాష్ట్ర వ్యవహారం. ఈ రెంటిని జిఎస్టి పరిధిలోకి తెస్తే, తమకు సొంత నిర్ణయాధికారం లేక, ఆదాయం తగ్గి ఇబ్బందులు పడతామని రాష్ట్రాలు వాదించాయి. ఫలితంగా, మినహాయింపు పొందిన సరుకులలో పెట్రోలు, డీజిల్, మద్యం చేరాయి. ఇప్పుడు రోజువారీగా జరుగుతున్న పెట్రో ధరల పెంపునకు పరిష్కారం దానిని జిఎస్టి పరిధిలోకి తేవడమేనని కేంద్రం వాదిస్తున్నది. జిఎస్టి పరిధిలోకి తెస్తే, ఇక రాష్ట్రాలకు నేరుగా వచ్చే పెట్రో ఆదాయం ఉండదు. కొత్తగా విధించే అవకాశమూ ఉండదు. జిఎస్టి పంపకాలలో భాగంగా పెట్రో జిఎస్టిలో నుంచి కూడా వాటా వస్తుంది. ఆ వాటా తమ ప్రస్తుత ఆదాయం కంటె తప్పనిసరిగా తక్కువగా ఉంటుందని రాష్ట్రాలు వాపోతున్నాయి. 


దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వాల కాలం నుంచి మొదలయినమాట నిజమే. వివిధ దేశాలలో ఒకే రకమయిన పన్ను విధానం ఉండడం ప్రపంచీకరణకు అనుకూల వాతావరణాన్ని కలిగిస్తుందన్న భావనతో, పన్ను సంస్కరణలు మొదలయ్యాయి. కానీ అమెరికా వంటి దేశంలో కూడా జిఎస్టికి చుక్కెదురయింది. అక్కడ వారికి ఒకే విధానం కంటె, రాష్ట్రాల ప్రతిపత్తే ముఖ్యం. దీర్ఘకాలం జిఎస్టిపై జరిగిన చర్చలలో రాష్ట్రాల హక్కులకు హాని కలుగకుండా సంస్కరణను ఎట్లా సాధ్యం చేయాలన్న అంశంపై వాదోపవాదాలు జరిగాయి. కొత్త విధానంలోకి మారిన వెంటనే కలిగే నష్టానికి పరిహారం చెల్లిస్తామని కేంద్రం వాగ్దానం చేసింది. జిఎస్టి విధానం అమలు మొదలైన తరువాత, కరోనా ఇబ్బందుల కాలంలోనూ పన్ను వాటా ఆదాయం గణనీయంగా తగ్గిపోయిన సందర్భంలో పరిహారం ఇవ్వడానికి కేంద్రం ఎన్నో మెలికలు పెట్టింది. చివరకు కొంత ఇచ్చింది కానీ, ఇవ్వవలసినంత మాత్రం ఇవ్వలేదు. రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడానికి ఆర్థిక కేటాయింపులను వాడడంలో ప్రస్తుత కేంద్రప్రభుత్వం అమిత ఉత్సాహం చూపుతున్నది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్ష రాష్ట్రాల విషయంలో నిధుల కేటాయింపులు, అనుమతుల విషయంలో పక్షపాతం చూపడం, దానికి ప్రతిస్పందనగానే ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించడం తెలిసిందే. బిజెపి ప్రభుత్వం, తీవ్రజాతీయత సహాయంతో ప్రాంతీయ శక్తులను బలహీనపరచడానికి, రాష్ట్రాలను పరాధీనం చేయడానికి ప్రయత్నిస్తున్నది. ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే పరీక్ష, చివరకు ఒకే ఎన్నికల దాకా పరిస్థితి వెడుతున్నది. జిఎస్టి పరిహారం సందర్భంలో, తాము కోరుతున్న సంస్కరణలను అమలు చేయడాన్ని ఒక షరతుగా పెట్టడం చూశాము. మొత్తం ఆదాయం కేంద్రం నుంచి మాత్రమే రావలసివస్తే, ఇక రాష్ట్రాలకు సొంత విధానాలు అంటూ ఏమీ మిగలవు. 


పెట్రోధరలు పెరుగుతున్నా, పౌరులు చూపుతున్న సహనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ధరలు పెరగడాన్ని దేశభక్తితో ముడిపెట్టి సమర్థిస్తున్నవారు ఉన్నారు. పెట్రోధరల ప్రభావం సమస్త జీవన రంగాలపైనా పడుతుంది. ధరల పెంపు ద్వారా నిధులను పోగుచేసుకునే ప్రయత్నాలను, రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చే ఆలోచనలను కేంద్రప్రభుత్వం వెనక్కి తీసుకునేట్టు ప్రజాస్వామికంగా ఒత్తిడి తేవలసిన అవసరం ఉన్నది.

Advertisement
Advertisement
Advertisement