పెట్రోలు ధరలపై ఎగసిన ఆగ్రహం

ABN , First Publish Date - 2021-02-27T07:03:33+05:30 IST

దారుణంగా పెరిగిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా భారత్‌ బంద్‌లో భాగంగా శుక్రవారం వామపక్షాలు, లారీ ఓనర్లు, ట్యాక్సీ నిర్వాహకులు నిరసన వ్యక్తం చేశారు.

పెట్రోలు ధరలపై ఎగసిన ఆగ్రహం
కాకినాడలో లారీలు నిలిపివేసి నిరసన తెలుపుతున్న అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాబ్జి తదితరులు

జిల్లాలో భారత్‌ బంద్‌ పాక్షికం

పెట్రోలు ధరలపై ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు

వామపక్షాలు, లారీ, ట్యాక్సీ ఓనర్ల రాస్తారోకోలు 8 విశాఖ ఉక్కుపైనా ఆందోళన

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి)/ డెయిరీఫారం సెంటర్‌ (కాకినాడ): దారుణంగా పెరిగిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలకు నిరసనగా భారత్‌ బంద్‌లో భాగంగా శుక్రవారం  వామపక్షాలు, లారీ ఓనర్లు, ట్యాక్సీ నిర్వాహకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల పెట్రోలు డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. పెట్రోలు ధర రూ.వందకు సమీపంలో ఉంది. దీంతో వాహనాలు నడపలేని పరిస్థితిలో వాహనదారులు ఉన్నారు. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, లారీ, ట్యాక్సీ ఓనర్లు బంద్‌కు పిలుపు ఇచ్చారు. పెంచిన డీజిల్‌ ధరలు వెంటనే తగ్గించాలని, సరుకు రవాణా సమయంలో ఇచ్చే వే బిల్లులపై గడువు పొడిగించాలని, థర్‌ ్డ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ప్రీమియం తగ్గించాలని, వాహన తుక్కు పాలసీని సవరణ చేయాలని, వాహనాల నుంచి గ్రీన్‌టాక్స్‌ వసూలు నిలుపుదల చేయాలని అఖిల భారత లారీ ఓనర్స్‌ అసోసియేషన్లు డిమాండు చేస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా లక్షా 30 వేల లారీలు నిలిపివేసి బంద్‌లో పాల్గొని రవాణ రంగ సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. అదేవిధంగా విశాఖ ఉక్కును పరిరక్షించాలని కేంద్ర కార్మిక సంఘాలు జిల్లా కేంద్రం కాకినాడలో రాస్తారోకో చేశాయి. భారత్‌ బంద్‌లో పాల్గొన్నాయి. అలాగే కార్పొరేట్‌లకు కొమ్ముకాస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ సం ఘాలు నిరసన తెలిపాయి. జీఎస్‌టీలో లోపాలు సవరించాలని వ్యాపార సంఘాలు భారత్‌ బంద్‌లో భాగస్వామ్యం అయ్యాయి. అయితే జనజీవనానికి ఎటువంటి ఆటంకం లేకుండా ఆయా వర్గాలు నిరసనలు తెలిపాయి. ఇక రాజమహేంద్రవరం, రంపచోడరం,  చింతూరు, ఎటపాక,  సామర్లకోట, తుని, అమలాపురం, మలికిపురం తదితర ప్రాంతాల్లోనూ నిరసనలు కొనసాగాయి. ధరలు వెంటనే తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్‌ చేశాయి. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అని, దాని జోలికి వస్తే ఊరుకునేది లేదని ఈ సందర్భంగా నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్చి 1న ప్రధాని విశాఖ వస్తున్నట్టు సమాచారం వచ్చిందని, అలా వస్తే మోదీ గ్యోబాక్‌ నినాదంతో పెద్దఎత్తున నిరసన తెలియజేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. జిల్లాలో జరిగిన నిరసన, రాస్తారోకో కార్యక్రమాల్లో సీపీఎం మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌, లారీ యూనియన్‌ నేతలు, ట్యాక్సీ యూనియన్‌ నేతలు,  ఏఐటీ యూసీ, సీఐటీయూసీ, టీఎన్‌టీయూసీ నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T07:03:33+05:30 IST