పెట్రో ధరల తగ్గింపు

ABN , First Publish Date - 2022-05-22T07:00:25+05:30 IST

పెట్రో ఉత్పత్తుల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతుండడం వల్ల ప్రభుత్వంపై వ్యతరేకత అధికమవుతున్నదని గుర్తించిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు నడుం కట్టింది.

పెట్రో ధరల తగ్గింపు

స్థానికంగా పెట్రోల్‌ లీటర్‌కు రూ.9.50, డీజిల్‌ రూ.7 వరకూ తగ్గే అవకాశం

ఉమ్మడి విశాఖ జిల్లాలో వినియోగదారులపై సగటున రూ.84 లక్షల మేర తగ్గనున్న భారం

ఆర్టీసీ చార్జీలు కూడా తగ్గించాలని డిమాండ్‌ 


విశాఖపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి):

పెట్రో ఉత్పత్తుల రేట్లు రోజురోజుకూ పెరిగిపోతుండడం వల్ల ప్రభుత్వంపై వ్యతరేకత అధికమవుతున్నదని గుర్తించిన కేంద్రం దిద్దుబాటు చర్యలకు నడుం కట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని ఇటీవల సూచించిన కేంద్రం స్వయంగా తానే ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్టు శనివారం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిపై కీలక ప్రకటన చేశారు. పెట్రోల్‌పై లీటరుకు ఎనిమిది రూపాయలు, డీజిల్‌పై లీటరుకు ఆరు రూపాయలు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. ఇది వినియోగదారుల వద్దకు వచ్చేసరికి పెట్రోల్‌పై రూ.9.50, డీజిల్‌పై ఏడు రూపాయలు తగ్గుతుందని వివరించారు. ఈ ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయన్నారు.

విశాఖపట్నంలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. కొత్త రేటు ప్రకారం సుమారు రూ.110.50 కానున్నది. విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో 14 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీరంతా సగటున రోజుకు ఏడు లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నారు. ఆ లెక్కన చూసుకుంటే రోజుకు రూ.70 లక్షల భారం తగ్గుతుంది. ఇక ప్రస్తుతం డీజిల్‌ రేటు రూ.106 ఉంది. దీనిపై ఏడు రూపాయలు తగ్గుతుంది. అంటే ఇటుఇటుగా రూ.99 కానున్నది. ఉమ్మడి జిల్లాలో ఆటోలు, లారీలు, ఇతర వాహనాలు కలిసి రోజుకు రెండు లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుంటాయని అంచనా. ఈ లెక్కన రోజుకు రూ.14 లక్షల వరకు ఆదా అవుతుంది. అంటే పెట్రో, డీజిల్‌ రేట్లు తగ్గింపు వల్ల రోజుకు రూ.84 లక్షల వ్యయం తగ్గుతుంది.


ఆర్టీసీ చార్జీలు తగ్గిస్తారా? 

డీజిల్‌ ధరలు పెరిగిపోయాయని పీటీడీ (ఆర్‌టీసీ)/ఆర్టీసీ ఇటీవల భారీగా చార్జీలు పెంచింది. అలాగే ఆటో డ్రైవర్లు కూడా చార్జీలు పెంచేశారు. ఇప్పుడు లీటరుకు ఏడు రూపాయల వరకు తగ్గినందున ఆ మేరకు ప్రజలపై భారం తగ్గిస్తారా?...అని పలు సంఘాలు ప్రశ్నిస్తున్నారు. రేట్లు పెరిగినప్పుడు చార్జీలు పెంచినవారు, తగ్గినప్పుడు ఆ భారం ప్రజలపై తగ్గించలేరా?...అని అడుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కీలక ప్రకటన చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-05-22T07:00:25+05:30 IST