రైతులపై ఇంధన భారం.. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు

ABN , First Publish Date - 2021-06-18T05:41:25+05:30 IST

మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. దాంతో పొలం పనుల్లో వేగం పెరిగింది. ఉత్పాదకత కూడా పెరిగింది. అయితే రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పల్లెల్లో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో పొలం దున్నడం మొదలు కోతలు వరకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల పెరిగిన డీజీల్‌ ధరలతో రైతులకు పెట్టుబడి భారంగా మారింది.

రైతులపై ఇంధన భారం.. రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు
దుక్కులు దున్నతున్న ట్రాక్టరు

దుక్కుల నుంచి కోతలు వరకు యంత్రాలపైనే ఆధారం 

భారంగా మారుతున్న ట్రాక్టర్‌ కిరాయిలు

బూర్గంపాడు, జూన్‌ 17: మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిపోయింది. దాంతో పొలం పనుల్లో వేగం పెరిగింది. ఉత్పాదకత కూడా పెరిగింది. అయితే రోజురోజుకు పెరుగుతున్న డీజిల్‌ ధరలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. పల్లెల్లో కూలీల కొరత తీవ్రంగా ఉండడంతో పొలం దున్నడం మొదలు కోతలు వరకు యంత్రాలనే ఉపయోగిస్తున్నారు. అయితే ఇటీవల పెరిగిన డీజీల్‌ ధరలతో రైతులకు పెట్టుబడి భారంగా మారింది. గతేడాదితో పోలీస్తే లీటర్‌ డీజిల్‌ ధర రూ.25నుంచి 30వరకు పెరిగింది. ఈ ప్రభావం రైతులపై తీవ్రంగా పడింది. వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో డీజిల్‌ ధర వీపరీతంగా పెరగడంతో రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

భారంగా మారుతున్న ట్రాక్టర్‌ కిరాయిలు

వ్యవసాయంలో పొలం దున్నేందుకు ప్రధానంగా ఉపయోగించే ట్రాక్టర్లకు డీజిల్‌నే వాడతారు.  రైతులందరూ సొంత ట్రాక్టర్లను కలిగి ఉండరు. చిన్నసన్నకారు రైతులు ట్రాక్టర్‌లను కిరాయికి తెచ్చుకొని దుక్కులు దున్నిస్తారు. అయితే డీజిల్‌ ధరల ఆధారంగానే కిరాయిలు ఉంటాయి. ట్రాక్టర్ల యాజమానులు సొంత వ్యవసాయ పనులు చేసుకున్న తర్వాత ఇతర రైతులకు అద్దె ప్రాతిపదికన పనులు చేస్తుంటారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత, లేదా పంట అమ్మిన తర్వాత రైతులు ట్రాక్టర్‌ కిరాయిలు చెల్లిస్తుంటారు. గతేడాది వానాకాలం సీజన్‌లో డీజీల్‌ ధర లీటరుకు రూ.65నుంచి 70మధ్యలో ఉంది. ప్రస్తుతం రూ.96నుంచి 100కు చేరువలో ఉంది. ఏడాది కాలంలో డీజిల్‌ ధర సుమారు రూ.30వరకు పెరగడంతో వ్యవసాయ పనులు చేసే ట్రాక్టరు యాజమానులు సైతం నిర్వహణ ఖర్చులు పెరిగాయాని అద్దెలు పెంచారు. గతేడాది పొలం దుక్కి దున్నేందుకు ప్రాంతాలను బట్టి ఏకరానికి సుమారు రూ.1,400 తీసుకోగా ప్రస్తుతం రూ.1,600కు పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. అదే విధంగా దమ్ములు చేసేందుకు ఎకరానికి గతంలో రూ.1,600ఉండగా ప్రస్తుతం ఆ ధర రూ.1,800లకు పెంచారు. ఇక వరి కోతలు, పత్తి సేద్యాలు వంటి పనుల సమయంలో మరింత భారం పడనుంది. 

డీజిల్‌ ధర భారంగా మారింది

పేరం చిన్నపరెడ్డి, రైతు

విత్తు వేసిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతు చెమటోడ్చాల్సిందే. అయినా పెట్టుబడి పోను మిగిలేది తక్కువే. డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టరు యాజమానులు కిరాయిలు పెంచారు. దీంతో రైతులపై మరింత భారం పడుతోంది.


డీజిల్‌ ధరలు పెరగడంతోనే కిరాయిలు పెంచాం

బత్తుల రామచంద్రారెడ్డి, ట్రాక్టరు యాజమాని

డీజిల్‌ ధరలు పెరగడంతో అద్దెలు పెంచాం. లీటరు ధర రూ.100కు చేరువలో ఉంది. కిరాయి పెంచకపోతే ట్రాక్టరు నిర్వహణ ఖర్చులు కూడా రావడం లేదు. డీజిల్‌ ధరలు పెరగడంతో పాటు ఫైనాన్స్‌లు కట్టడం భారంగా మారింది. అందుకే ధరలు పెంచక తప్పడం లేదు. 


Updated Date - 2021-06-18T05:41:25+05:30 IST