పెట్రో మంటలు మంచివే

ABN , First Publish Date - 2021-10-26T09:21:24+05:30 IST

అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధర 2016 సంవత్సరం నుంచి మూడు రెట్లు పెరిగింది. మన చమురు అవసరాలలో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నందున అది అమితమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది....

పెట్రో మంటలు మంచివే

అంతర్జాతీయ విపణిలో క్రూడాయిల్ ధర 2016 సంవత్సరం నుంచి మూడు రెట్లు పెరిగింది. మన చమురు అవసరాలలో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నందున అది అమితమైన ఆర్థిక భారాన్ని మోపుతోంది. దిగుమతులపై ఇంతగా ఆధారపడడం మన ఆర్థిక సార్వభౌమత్వానికి ముప్పును కొని తెచ్చుకోవడమే అవుతుంది. చమురు ధరల పెరుగుదల వల్ల వినియోగం అనివార్యంగా తగ్గుతుంది. ఈ దృష్ట్యా చమురు ధరల పెరుగుదల మనకు మేలు చేసే పరిణామమే. అయితే తొలుత చమురు ధర పెరుగుదల వల్ల సంభవిస్తున్న హాని ఏమిటో పరిగణనలోకి తీసుకుందాం. 


మొదటి ప్రధాన నష్టం వాణిజ్యలోటు పెరుగుదల. మన దిగుమతులకు అధిక ధర చెల్లించవలసి ఉంటుంది. ఈ చెల్లింపులకుగాను డాలర్ల నిల్వలను మరింతగా పెంచుకోవలసి ఉంది. ఇందుకు మన ముడిఖనిజాలను తక్కువ ధరకు విక్రయించుకోవలసిరావడం తప్పనిసరి అవుతుంది. మన సహజ సంపదలను ఇలా కోల్పోవడం ఆర్థికవ్యవస్థకు ఎంత మాత్రం క్షేమకరం కాదు. మార్గాంతరం ఏమిటి? చమురు వినియోగాన్ని తగ్గించుకోవడమే. ఈ దిశగా మనం సేవల రంగంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ఆ రంగంలో విద్యుత్ వినియోగం తక్కువగా ఉంటుంది. సేవల రంగంతో పోలిస్తే, అవే ఆదాయాలను ఉత్పత్తి రంగం ద్వారా పొందాలంటే పదిరెట్లు ఎక్కువగా విద్యుత్ అవసరమవుతుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో అధికాదాయాలను సమకూర్చడమే సేవల రంగ విశిష్టత. ఈ విషయంలో మనం బ్రిటన్ నుంచి పాఠాలు నేర్చుకోవలసి ఉంది.


ఒక లీటర్ చమురుతో 5.3 డాలర్ల విలువైన సరుకులను, సేవలను చైనా ఉత్పత్తి చేస్తోంది. మనదేశం 8.2 డాలర్ల విలువైన సరుకులను, సేవలను సమకూరుస్తోంది. బ్రిటన్ అయితే 16.2 డాలర్ల విలువైన వస్తు సేవలను అందించగలుగుతోంది. ఒక లీటర్ చమురుతో బ్రిటన్ అధిక ఆదాయాన్ని ఎలా ఆర్జించగలుగుతోంది? ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక, పర్యాటక, విద్యాసేవల వాటా అత్యధిక స్థాయిలో ఉండడం వల్లేనని చెప్పవచ్చు. తయారీరంగానికి బదులుగా సేవల రంగం విస్తరణకు ప్రాధాన్యమిచ్చిన పక్షంలో మనం కూడా ఒక లీటర్ చమురుతో బ్రిటన్ వలే 16.2 డాలర్ల విలువైన వస్తుసేవలను ఉత్పత్తి చేయగలుగుతాము. మన ఆర్థిక కార్యకలాపాలను అలా తీర్చి దిద్దుకున్న పక్షంలో చమురును భారీ పరిమాణంలో దిగుమతి చేసుకోవలసిన అవసరముండదు. వాణిజ్యలోటును అదుపులో ఉంచుకోగలుగుతాము. 


చమురు ధర పెరుగుదలతో వాటిల్లే రెండో హాని ద్రవ్యోల్బణం అధికమవ్వడం. ఇది నిజమే కానీ దీని ప్రభావం విపరీత స్థాయిలో ఉంటుందని భావించనవసరం లేదు. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు పెరుగుదలే కానీ చమురు ధర పెరుగుదల కాదు.


2018లో ద్రవ్యోల్బణం రేటు 3.4 శాతం. అది 2.8 శాతం పెరిగి ఇప్పుడు 6.2 శాతంగా ఉంది. ఇదే కాలంలో ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటు కూడా పెరిగింది. 2018లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నెలకు రూ.లక్ష కోట్లకు పైగా ఉండేది. జీఎస్టీ వసూళ్లు 2021 సెప్టెంబర్‌లో రూ.1,17,000 కోట్లు. ఆర్థికవ్యవస్థ అభివృద్ధి బాటలో ఉంది. ఈ పెరుగుదలే ప్రస్తుత ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణం. దీనితో పోలిస్తే ద్రవ్యోల్బణంపై చమురు ధర పెరుగుదల ప్రభావం స్వల్పస్థాయిలో మాత్రమే ఉంటుంది. ఒక అంచనా ప్రకారం పెట్రోల్ ధర 100 శాతం పెరిగితే ద్రవ్యోల్బణం ఒక శాతం పెరుగుతుంది. డీజిల్ ధర 100 శాతం పెరిగితే ద్రవ్యోల్బణం 2.5 శాతం మాత్రమే పెరుగుతుంది. ద్రవ్యోల్బణంపై పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల మొత్తం ప్రభావం ఇంచుమించు 1.5 శాతంగా ఉండవచ్చు. గత ఆరునెలల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల 50 శాతం మేరకు ఉంది. ఈ దృష్ట్యా ద్రవ్యోల్బణం పెరుగుదలలో చమురు ధర పెరుగుదల వాటా 0.75 శాతం మేరకు ఉంటుంది. ద్రవ్యోల్బణం మొత్తం పెరుగుదల 2.8 శాతం అనే విషయాన్ని మనం విస్మరించకూడదు. ద్రవ్యోల్బణం వల్ల జరిగే నష్టం ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు పెరుగుదలతో తొలగిపోతుంది. చమురు ధరల పెరుగుదలతో వాటిల్లే మూడో హాని ద్రవ్యలోటు పెరుగుదల. ఇది కూడా తప్పుడు భావనే. చమురు విక్రయాలపై కేంద్రప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకాల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మొత్తం మీద చమురు ధర పెరుగుదల ప్రతికూల ప్రభావాలను చూపుతున్న మాట నిజమే గానీ వాటిని మరీ ఎక్కువ చేసి చెబుతున్నారు. అధిక ధరతో సమకూరుతున్న ప్రయోజనాలు ఆ వ్యతిరేక తాకిడిని తగ్గిస్తున్నాయి. పలు లాభాలు సమకూరుతున్నందున అదుపు తప్పుతున్న పెట్రో ధరలతో సంభవిస్తున్న నష్టం నిజానికి భరింపతగినదే.


ఇక ఇప్పుడు చమురు ధర పెరుగుదలతో సమకూరుతున్న ప్రయోజనాలను పరిశీలిస్తే, అంతర్జాతీయ విపణిలో ధర పెరగుదల ప్రపంచ ఆర్థికవ్యవస్థ అధిక వృద్ధిరేటుతో పురోగమిస్తోందనడానికి ఒక స్పష్టమైన సూచన అని చెప్పవచ్చు. దీనివల్ల మన ఎగుమతులు ఇతోధికంగా పెరుగుతాయి. రెండో లబ్ధి చమురును ఎగుమతి చేసే, ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలలోని ప్రవాస భారతీయులు స్వదేశానికి పెద్ద మొత్తాలలో పంపే డబ్బు. మూడో లాభం ఇంధన సమర్థ వినియోగం. చమురు ధర అధికంగా ఉంటే ఒర లీటర్ పెట్రోల్ లేదా డీజిల్‌తో సగటున అత్యధిక దూరం ప్రయాణించడానికి దోహదం చేసే బైక్ లేదా కారును మాత్రమే కొనుక్కోవడం జరుగుతుంది. చమురు ధర స్వల్పస్థాయిలో ఉంటే ఇటువంటి జాగ్రత్తలపై మనం ఉపేక్ష వహించడం కద్దు. ధర పెరుగుదల వినియోగం తగ్గడానికి దోహదం చేస్తుంది. దాంతో చమురు దిగుమతులు తగ్గుతాయి. మన ఆర్థిక సార్వభౌమత్వానికి భద్రత సమకూరుతుంది. భూమి వేడెక్కడం (గ్లోబల్ వార్మింగ్) కూడా తగ్గుతుంది. భూతాపం పెరుగుదలతో తుపానులు, సునామీలు, వరదలు, కరువులు పెరిగి ఆర్థికవ్యవస్థ పెనునష్టాలకు లోనవుతుంది. ఈ ప్రతికూల ప్రభావాల తగ్గుదలకు చమురు ధర పెరుగుదల గణనీయంగా దోహదం చేస్తుంది. నాలుగో ప్రయోజనం సౌరశక్తి, పవన విద్యుత్ రంగాలు మరింత లాభదాయకంగా పురోగమిస్తాయి. ఈ పరిణామం మన ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడడంతో పాటు భూతాపాన్ని తగ్గిస్తుంది. ఈ వాస్తవాల దృష్ట్యా చమురు ధర పెరుగుదలకు మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-10-26T09:21:24+05:30 IST