Abn logo
Feb 19 2021 @ 02:41AM

పెట్రో మంటలు

పెట్రోల్‌ రేట్లు ఇప్పుడింతగా పెరగడానికి గత పాలకులు అప్పట్లో చేసిన తప్పిదాలే కారణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తేల్చేసిన తరువాత, కేంద్రప్రభుత్వం నుంచి ఇక ఉపశమన చర్యలు ఆశించడం వృధా. చమురు భారాన్ని సామాన్యుడు మౌనంగా భరించాల్సిందే తప్ప, సణిగితే ప్రయోజనం లేదని మోదీ చెప్పకనే చెప్పేశారు. ఎవరినీ నిందించాలని లేదంటూనే, తనకంటే ముందు అధికారంలో ఉన్నవారిని ప్రస్తుత సమస్యకు బాధ్యులను చేయడం ద్వారా ఆయన ఎంచక్కా చేతులు దులిపేసుకున్నారు. 


తనకంటే ముందువారు దేశ ఇంధన భవిష్యత్‌ అవసరాలను గుర్తించి, తగిన చర్యలు తీసుకొని ఉంటే చమురు భారం సామాన్యుడిని ఇలా వేధించేది కాదని మోదీ అంటున్నారు. మంచి ఏమైనా ఉంటే అది పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవడం, చెడుని మాత్రం ఎదుటివారినెత్తిన రుద్దడం రాజకీయ నాయకులన్నాక సహజం. గతపాలకులను చేతకానివాళ్ళనీ, దద్దమ్మలనీ విమర్శించడం ద్వారా ఏదో ఆనందం పొందుతూంటారు, ప్రజలను మాయచేయగలమని అనుకుంటారు. జనానికీ ఇది అలవాటే కనుక విని ఊరుకుంటారు, లేదంటే మనసులో నవ్వుకుంటారు. కానీ, చమురు ధరల విషయంలో మోదీ చేసిన వ్యాఖ్యలు పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించే ప్రతీవాడినీ ఆగ్రహానికి గురిచేసివుంటాయి. నిజాయితీ లేని ఆ మాటలు వారి గుండెలను మెలిపెట్టి ఉంటాయి. తమ కోపాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి సామాజిక మాధ్యమాలున్నాయి కనుక ఉక్రోషాన్నంతా అక్కడ కక్కుతున్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్‌ రేటు ‘సెంచరీ’ దాటినందుకు చప్పట్లు చరు‍స్తూ జోకులు పేల్చుతున్నారు. మోదీ అధికారంలోకి రాకముందు, పెట్రోల్‌ ధర అరవై డెబ్బయ్‌ రూపాయలున్నందుకే అక్షయ్‌కుమార్‌నుంచి అమితాబచ్చన్‌దాకా, అనుపమ్‌ ఖేర్‌ నుంచి వివేక్‌ అగ్నిహోత్రి వరకూ అనేకులు మండిపడిన ఆ జ్ఞాపకాలను ఇప్పుడు అందరూ తవ్వితీస్తున్నారు. సైకిళ్ళను తుడవడం, కార్లు తగులబెట్టడం, గుర్రాలెక్కడం ఇత్యాది వెటకారాలు ఇప్పుడు తిరిగి ప్రచారంలోకి వచ్చాయి. అప్పుడు నోరుపారేసుకున్న పెద్దమనుషులంతా ఇప్పుడేమైపోయారనీ, దేశంకోసం నిలబడాల్సింది పోయి, ఒక పార్టీకి కట్టుబానిసలుగా మారిపోయారేమని నిలదీస్తున్నారు. ‘మోదీ హైతో ముమ్కిన్ హై’ అంటున్నారు.


మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన 2014తో పోల్చితే, ఇప్పుడు ముడిచమురు ధరలు తక్కువ. అప్పట్లో పన్నులూ సుంకాలూ ఇత్యాది వివిధ వాతలకు ముందూ తరువాతా లీటరు పెట్రోల్‌ ధరలో వచ్చిన మార్పు పాతికరూపాయలకు మించి లేదు. ముడిచమురు ధర ఇప్పుడు మరింత తగ్గినందున పెట్రోల్‌ బేసిక్‌ ప్రైస్‌ దాని అమ్మకం ధరలో నాలుగోవంతు ఉంది. ఒక లీటరు వాటర్‌బాటిల్‌ ఖరీదుతో సమానంగా ఉన్న ముడిచమురుధరకు, కనీసం నాలుగైదురెట్లు అధికంగా చెల్లించి ప్రతీ భారతీయుడు లీటరు పెట్రోల్‌ కొంటున్నాడు. గత ఏడాది ఏప్రిల్‌మాసంలో అది ఏకంగా ఎనిమిదిరెట్లు. అంతర్జాతీయ మార్కెట్‌తో ముడివేస్తే అక్కడి హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఇక్కడా తగ్గిన రేట్లు పొందవచ్చునని మోదీ ప్రభుత్వం మభ్యపెట్టింది. కానీ, ప్రజలను ఆ ఫలితం ఎన్నడూ అనుభవించనీయకుండా తగ్గినరేట్లకు సరిపడా పన్నులూ సుంకాలూ పెంచేయడం జరుగుతోంది. గత నలభైరోజుల్లో ఇరవైసార్లు ఇంధనధరలు హెచ్చాయి. పెట్రోల్‌ వినియోగించేవారిలో ఎనభైశాతం ద్విచక్రవాహనదారులే. చమురుపై వారి నెలవారీ ఖర్చు నాలుగోవంతు పెరిగింది. ఇంధనరేట్ల పెరుగుదల ప్రభావం ప్రతీ ఉత్పత్తిమీదా కనిపిస్తున్నది. ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్ని అంటడానికి చమురు ధరలే కారణం. ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు వాటాపంచనక్కరలేని కొత్తసెస్సులు విధిస్తూపోవడానికి కేంద్రానికి చమురు తేరగా దొరికింది. అంతా అంతర్జాతీయమే, మా చేతుల్లో ఏమీ లేదన్న వాదన అసత్యం. ప్రపంచపటంలో ఏ దేశాన్ని చూసినా చమురు ధర ఇంతగా మండుతున్నవి కనబడవు. మ్యాపులో మన పక్కన చిన్నగా కనిపిస్తున్న ఇరుగుపొరుగుదేశాల్లో అది ఎంతో చవుక. చమురును జీఎస్టీ పరిధిలోకి తెస్తే తమ నిరవధిక దోపిడీ సాగదు కనుక ఆ ఊసే ఎత్తడం మానేసి, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు వేర్వేరు పేర్లతో పన్నులూ సుంకాలూ వడ్డించేస్తున్నాయి. ఏం చేసినా రాష్ట్రాలే చేయాలని కేంద్రం, పాపం పూర్తిగా దానిదేనని రాష్ట్రాలూ బాధ్యత తప్పించుకుంటూ జనాన్ని పీల్చేస్తున్నాయి. ధరలమంటను ఇక ఏమాత్రం భరించలేని స్థితికి సామాన్యుడు చేరుకున్న వాస్తవాన్ని గుర్తించనిరాకరిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement