‘స్పందన’ కరువు

ABN , First Publish Date - 2022-08-09T04:33:43+05:30 IST

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ప్రతి సోమవారం జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న.. ‘స్పందన’కు ఎన్నో వినతులు వస్తున్నాయి. కానీ సమస్యల పరిష్కారంలో అధికారుల నుంచి ‘స్పందన’ కరువవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకేంద్రంలోని జడ్పీలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పందన’లో కూడా తమ

‘స్పందన’ కరువు

ఒకే సమస్యపై.. ఎన్నోసార్లు వినతులు

జిల్లాకేంద్రంలోనూ పరిష్కారం కాని దరఖాస్తులెన్నో

అధికారుల తీరుపై అర్జీదారుల అసహనం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. ప్రతి సోమవారం జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహిస్తున్న.. ‘స్పందన’కు ఎన్నో వినతులు వస్తున్నాయి. కానీ సమస్యల పరిష్కారంలో అధికారుల నుంచి ‘స్పందన’ కరువవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకేంద్రంలోని జడ్పీలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పందన’లో కూడా తమ సమస్యలకు పరిష్కార మార్గం చూపడం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణకే అధికారులు పరిమితమవుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఒకే సమస్యపై ఎన్నోసార్లు వినతులు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఎన్నో ఆశలతో జడ్పీలో స్పందనకు వచ్చిన తమకు నిరాశే ఎదురవుతోందని.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ‘స్పందన’లో వినతులపై కనీసం వారానికోసారి సమీక్ష నిర్వహించి.. శాఖలవారీగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం జడ్పీలో జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 255 వినతులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా వినతులు.. గతంలో అర్జీలు ఇచ్చినా.. సమస్యలు పరిష్కారం కానివే ఎక్కువ ఉన్నాయి. 


కబ్జాదారులపై చర్యల్లేవ్‌

పాత్రునివలసలో సర్వే నంబర్‌ 195-1లో మాకు రెండెకరాల పల్లం భూమి ఉంది. ఇందులో పది సెంట్ల భూమి కబ్జాకు గురైంది. దీనిపై ఇప్పటికి ఎన్నోసార్లు స్పందనలో ఫిర్యాదు చేశాను. అయినా కబ్జాదారులపై చర్యలు లేవు. ఈసారైనా.. చర్యలు తీసుకుంటారని స్పందనకు వచ్చి ఫిర్యాదు చేశాను. 

- కోలా సింహాద్రి, రిటైర్డు సుబేదారు, పెద్దపాడు రోడ్డు


‘అంత్యోదయ’ తొలగించారు 

లెప్రసీ రోగులకు నరసన్నపేటలో 7, ఆమదాలవలసలో 5 అంత్యోదయ కార్డులను తొలగించారు. చాలామంది పింఛన్లను తొలగించేశారు. ప్రతి సోమవారం స్పందనకు వచ్చి వినతులు ఇస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. 

-సీహెచ్‌ పాపారావు, క్యూర్‌డ్‌ లెప్రసీ డిజేబుల్‌ అసోసియేషన్‌  అధ్యక్షుడు


మూడేళ్లుగా పింఛన్‌ కోసం..

నా భర్త మరణించి మూడేళ్లు అవుతోంది. వితంతు పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటివరకు మంజూరు చేయలేదు. స్పందనకు వచ్చి అర్జీలు ఇచ్చినా.. పింఛన్‌ ఎప్పుడిస్తారో చెప్పడం లేదు. 

- కోడూరు చిన్నమ్మ, బొడ్డవలస, ఎల్‌.ఎన్‌.పేట


చిన్న సమస్య కూడా పరిష్కారం కావట్లేదు.

ఆవుల షెడ్‌ కోసం విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని దరఖాస్తు చేసుకుని చాన్నళ్లు అవుతోంది. కానీ కొత్త కనెక్షన్‌ ఇంతవరకూ ఇవ్వడం లేదు. ఎన్‌ఓసీ తెమ్మంటున్నారు. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకున్నా.. సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదు. జిల్లాకేంద్రంలోని ‘స్పందన’లో కూడా అర్జీలు ఇవ్వడం తప్ప.. చిన్న సమస్య కూడా పరిష్కారం కావడం లేదు. 

- పైడి రంగరామానుజులు, ఫరీద్‌పేట, ఎచ్చెర్ల 


పట్టా ఇవ్వలేదు 

మాకు కొన్నేళ్ల కిందట ఇంటి స్థలం ఇచ్చారు. కానీ పట్టా ఇవ్వలేదు. పట్టా కోసం స్పందనలో పలుమార్లు వినతులు ఇస్తున్నా.. సమస్య పరిష్కారం కావడం లేదు. 

- కుర్తి విజయ, బుడుమూరు, లావేరు


ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని..

మా సొంత స్థలంలో ఒకరికి దుకాణం నిర్మాణానికి గతంలో అనుమతి ఇచ్చాం. ఇప్పుడు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కడుతున్నారు. దీనిపై చాలా సార్లు ఆధారాలతో సహా ‘స్పందన’కు వచ్చి ఫిర్యాదు చేశాను. కానీ, ఆక్రమణదారులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.  

- ఉగాది సీతమ్మ, దీపావళి, గార


క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వక..

బీసీ కార్పొరేషన్‌ ద్వారా రుణం తీసుకుని.. ఆటో కొనుగోలు చేశాను. రుణం మొత్తం చెల్లించేశాను. కానీ ఎస్‌బీఐ నుంచి రుణ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఇవ్వడంలేదు. దీనివల్ల ఆటో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందలేకపోతున్నాను. దీనిపై జిల్లాకేంద్రంలో స్పందనలో ఎన్నోసార్లు వినతులు ఇచ్చినా.. అంతే సంగతులు. 

-సింగూరు ధనంజయరావు, అమృతలింగరాజపురం, సరుబుజ్జిలి



Updated Date - 2022-08-09T04:33:43+05:30 IST