పింఛన్‌.. వంచన్‌

ABN , First Publish Date - 2022-08-04T05:11:21+05:30 IST

సామాజిక పింఛన్లలో వంచనతో పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకాలం పింఛన్‌ సొమ్ముపై ఆధారపడి బతుకీడుస్తున్న వారిని తొలగించారు.

పింఛన్‌.. వంచన్‌

అనర్హత పేరిట 2500 మందికి తొలగింపు

ఎందుకు తొలగించారో తెలియక లబోదిబో 

పింఛన్‌ లబ్ధిదారుల లెక్కల్లో అంకెల కనికట్టు

15 వేల దరఖాస్తుల్లో 8500 మందికే మంజూరు

అర్హతకంటే అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే లబ్ధి

పేరుకు బాపట్ల జిల్లా.. ఒంగోలు నుంచే డీఆర్‌డీఏ పర్యవేక్షణ

ద్రోణాదులలో సర్పంచ్‌కి, సెక్రటరీకి మధ్య పింఛన్ల పంచాయితీ


బాపట్ల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): సామాజిక పింఛన్లలో వంచనతో పలువురు లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇంతకాలం పింఛన్‌ సొమ్ముపై ఆధారపడి బతుకీడుస్తున్న వారిని తొలగించారు. దీంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. ఇక ఆరు నెలల నుంచి దరఖాస్తులు చేసుకుని పింఛన్‌ వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న వారిలో సగం మందికి కూడా మంజూరు కాలేదు. అంకెల గారడీతో పింఛన్లను అధికారులు మాయ చేశారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఆరంచెల ప్రక్రియలో భాగంగా జిల్లాలో దాదాపు 2,500 మంది గతంలో పింఛను పొందుతున్న వారిని ప్రస్తుతం అనర్హులుగా పరిగణించారు. అయినా ఈ నెలలో పింఛనుల సంఖ్య మాత్రం గతంలో కన్నా పెరిగింది. అదెలాగంటే ప్రభుత్వం ఆరు నెలలకొకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతను బట్టి లబ్ధిదారుల జాబితాలో చేర్చి పింఛను అందచేయాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఈ నెలలో దాదాపు 8,500 మందికి పైనే కొత్తగా పింఛను పొందడానికి అర్హులుగా ప్రభుత్వం తేల్చింది. వివిధ నిబంధనల ద్వారా వడపోసి దాదాపు 2,500 మందికి పైనే లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించింది. ఇస్తున్న పెన్షన్ల సంఖ్య గతంలో కన్నా పెరగడంతో ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. కానీ గతంలో ఇస్తున్న వారికి వివిధ కారణాలతో కోతపెట్టింది. ఇన్ని రోజులు పింఛను అందుకుంటున్న తమకు హఠాత్తుగా ఆపేయడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నెలలో కొత్తగా చేరిన వారిని కలుపుకుని 2,26,921 మంది లబ్ధిదారుల జాబితాలో ఉండగా గత నెలలో 2,18,421 మందికి పింఛను అందించారు. కొత్తగా వచ్చిన దరఖాస్తులు కూడా దాదాపు 15,000 ఉండగా వాటిని కూడా వడపోసి 8,500 మందికే అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. మళ్లీ ఆరు నెలల తర్వాతే అవకాశం ఉన్నందున వీటి మీదే ఆధారపడి బతుకీడ్చే వారి కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి


ఒంగోలు నుంచే పర్యవేక్షణ....

బాపట్ల జిల్లా ఆవిర్భవించి గురువారంతో నాలుగు నెలలైనా పింఛన్ల పర్యవేక్షణ ఇంకా ఒంగోలు నుంచే జరుగుతోంది. పేరుకి డీఆర్‌డీఏ కార్యాలయం ఏర్పాటు చేశారే కానీ పూర్తిస్థాయిలో సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలేదు. దీంతో పింఛన్లకు సంబంధించి సమాచారం జిల్లాకేంద్రంలో లభ్యం కావడం లేదు. సెర్ప్‌, డీఆర్‌డీఏ మధ్య సమన్వయం లోపంతో జిల్లాలో పింఛన్లకు సంబంధించి సరైన సమాచారం కూడా అందుబాటులో లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది పొరపాట్ల వల్ల కూడా అర్హులైన చాలామందికి పింఛన్‌ అందడం లేదు.  


గ్రామాల్లో అధికార పార్టీ నాయకులదే హవా

గ్రామాల్లో రాజకీయ జోక్యంతో అర్హులైన వారికి పింఛను అందకపోగా అనర్హులకు లబ్ధి చేకూరుతుంది. అధికారపార్టీ నాయకుల అండదండలతో అర్హుత లేకపోయినా పలువురికి పింఛన్‌ మంజూరు చేసినట్లు సమాచారం.  పారదర్శకంగా జరగాల్సిన ప్రక్రియ చోటామోటా నాయకుల మితిమీరిన జోక్యంతో అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందకుండా పోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో అధికార పార్టీ సర్పంచ్‌కి, పంచాయతీ సెక్రటరీకి మధ్య పింఛన్ల పంచాయితీ నెలకొంది. దీంతో బుధవారం పంచాయతీ సెక్రటరీ గదికి సర్పంచ్‌ తాళం వేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బల్లికురవ మండలం ఎస్‌ఎల్‌ గుడిపాడు గ్రామస్థులు పింఛన్లు తొలగించారని బుధవారం అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌కి ఫిర్యాదు చేశారు. 

 

Updated Date - 2022-08-04T05:11:21+05:30 IST