పేట జలదిగ్బంధం

ABN , First Publish Date - 2022-01-17T05:58:36+05:30 IST

భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.అత్యధికంగా నూతన్‌కల్‌ మండలంలో 68. 1మి.మీ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 57.6మి.మీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది.

పేట జలదిగ్బంధం
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మానసనగర్‌లో నీట మునిగిన ప్రాంతం

ఇళ్లలోకి చేరిన వరద

ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు

నీటమునిగిన పంటపొలాలు

నల్లగొండ జిల్లాలో పలుచోట్ల వర్షం


సూర్యాపేటటౌన్‌, జనవరి 16: భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది.అత్యధికంగా నూతన్‌కల్‌ మండలంలో 68. 1మి.మీ, సూర్యాపేట జిల్లా కేంద్రంలో 57.6మి.మీ వర్షం కురిసింది. శనివారం రాత్రి 12.30 నుంచి ఆదివారం ఉదయం 8గంటల వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో ప్రాంతాలు జలమయమయ్యాయి. కార్లు, బైక్‌లు వరద నీటిలో మునిగాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. జిల్లా కేంద్రంలో సుమారు 100 ఇళ్లలోకి వరద చేరింది. కొంతమంది ఇంటిపైనే రాత్రంతా జాగారం చేశారు. శనివారం సంక్రాంత్రి పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజ ల్లో వర్షం బీభత్సంతో సంతోషం ఆవిరైంది. జిల్లా కేంద్రంలో నీట మునిగిన ప్రాంతాలను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు ఎస్‌.మోహన్‌రావు, పాటిల్‌ హేమంత్‌కేశవ్‌ పరిశీలించారు. 

ఆత్మకూర్‌(ఎస్‌), అర్వపల్లి, నాగారం, మద్దిరాల, నూతన్‌కల్‌ తదితర మండలాల్లో చెరువులు, కుంటలు అలుగులు పోయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. మోతె మండలం నామవరం పెద్ద చెరువు అలుగుపోస్తుండడంతో గుంజలూరు వెళ్లే తారురోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయింది. సుమారు 400 ఎకరాల్లో వరి పంట నీటముగినింది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీల్లోకి వరద చేరింది. నూతన్‌కల్‌ మం డలంతో పాటు పలు మండలాల్లో మిర్చి పంట లు దెబ్బతిన్నాయి. ఆత్మకూర్‌(ఎస్‌) మండలం నశీంపేట చెరువు అలుగుపోసింది. తిరుమలగిరి మండలంలో ఈదురుగాలులకు తొండగ్రామానికి చెందిన రెకుల షెడ్డు కొట్టుకుపోయింది. సూర్యాపేట మండలం కాసరబాద, కుసుమవారిగూడెం వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో భీమారం, మిర్యాలగూడెం రాకపోకలు నిలిచిపోయాయి. సపావత్‌తండా, పిన్నాయిపాలెం గ్రామాల్లో వరద భారీగా నిలిచింది. అర్వపల్లి మండలంలోని యోగానందలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో వరద నిలిచింది. జిల్లా కేంద్రంలో వరద ప్రాంతాలను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు సందర్శించి వదరతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు.


స్తంభించిన జనజీవనం

అకాలవర్షంతో జనజీవనం స్తంభించింది. సూర్యాపేటలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వరకు సుమారు మూడు అడుగుల మేర వరద నిలవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. అమరావతినగర్‌, ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంతం, శ్రీశ్రీనగర్‌, భగత్‌సింగ్‌నగర్‌, మానస నగర్‌, కృష్ణకాలనీ, 60ఫీట్ల రోడ్డు, గోపాలపురం, తాళ్లగడ్డ, ఇందిరమ్మ కాలనీలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. అమరావతి నగర్‌లో ఓ ఇంట్లో మూడు అడుగుల మేర వరద నిలిచింది. ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని నశీంపేట చెరువు అలుగుపోయడంతో రాకపోకలు బందయ్యాయి. వాహనదారుడు బైక్‌తో సహా వరద నీటిలో కొట్టుకపోగా స్థానికులు గుర్తించి కాపాడారు. జిల్లా కేంద్రంలో ఎస్వీడిగ్రీ కళాశాల ప్రాంతంలో వరద నీటిలో ఆవు కొద్దిదూరం కొట్టుకుపోయి చివరికి ఒడ్డుకు చేరింది. జాతీ య రహదారిపై వరద ప్రవాహంతో  రాకపోకలు కొంత అంతరాయం ఏర్పడింది.


మంచినీటి కోసం ఇక్కట్లు

పేట జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి నీట మునిగిన ఇళ్ల బాధితులు బయటికి రాలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు మూడు అడుగల  మేర వరద నీరు ఇళ్లను చుట్టముట్టింది. కనీసం మంచినీటి సౌకర్యం లేక అల్లాడిపోయారు. వారికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ శభరినాథ్‌, టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సిరివెళ్ల లక్ష్మికాంతమ్మ మంచినీరు, అల్పాహారం, భోజన ప్యాకెట్లు అందజేశారు. ఇదిలా ఉండగా, భారీ వర్షానికి సద్దుల చెరువు అలుగుపోసి మెడికల్‌ కళాశాలలోకి వరద చేరింది.  20 ఏళ్లతో పోల్చితే ఇప్పటి వరకు ఇంత వరద రాలేదని స్థానికులు తెలిపారు.



నల్లగొండ, యాదాద్రి జిల్లాలో పలుచోట్ల వర్షం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ):  నల్లగొండ జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున పలు చోట్ల వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 19.02మి.మీ వర్షపాతం నమోదైంది. చిట్యాలో 32.8 మి.మీ, నార్కెట్‌పల్లిలో 32.9, కట్టంగూర్‌ 99.9, శాలిగౌరారం 7.8, నకిరేకల్‌లో 117.0, కేతపల్లిలో 70.9, తిప్పర్తిలో 7.6, నల్లగొండలో 18.4, కనగల్‌లో 61.2, మునుగోడులో 96.6, చండూరులో 25.3, మాడ్గులపల్లిలో 13.5మి.మీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా మూడు డివిజన్లలో కలిపి 593.7మి.మీ వర్షపాతం నమోదైంది. నల్లగొండ డివిజన్‌ మినహా మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్‌లో స్వల్పంగా వర్షం కురిసింది. వర్షాలతో వరితో పాటు ఆరుతడి పంటలకు ప్రయోజనం చేకూరనుంది. వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. ఇప్పటికే చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు మళ్లీ వాతావరణం చల్లబడటంతో చల్లటి గాలులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడవిదేవులపల్లి, దామరచర్ల, తిరుమలగిరి(సాగర్‌), పెద్దవూర, అనుముల మండలాల్లో స్వల్పంగా కురిసిన వర్షాలకు తడిసిన మిర్చిని రైతులు ఆరబెట్టారు. ముందు జాగ్రత్తగా మిర్చిపై పట్టాలు కప్పడంతో కొంతమేర నష్టం తగ్గింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం శని, ఆదివారం పలుచోట్ల మోస్తరు వర్షం కురిసింది.

Updated Date - 2022-01-17T05:58:36+05:30 IST