టమోటాపై తెగుళ్ల పోటు..!

ABN , First Publish Date - 2021-02-27T05:05:02+05:30 IST

కరువు నేలలో కాసులు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది టమోటా అని చెప్పవచ్చు.

టమోటాపై తెగుళ్ల పోటు..!
టమోటా పొలం

 ఉల్లిగడ్డ రోగంతో కుప్పలుగా రాలుతున్న కాయలు  ఎండిపోతున్న ఆకులు  నష్టాలను చవిచూస్తున్న రైతులు

సంబేపల్లె, ఫిబ్రవరి26: కరువు నేలలో కాసులు కురిపించే పంట ఏదైనా ఉందంటే అది టమోటా అని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతం టమోటాపై తెగుళ్ల పోటు పడింది. తెగుళ్ల దెబ్బకు తోటలోనే కాయలు రాలిపోతున్నాయి. ఈ రోగం టమోటా రైతుల పాలిట శాపంగా మారింది. అందరినీ పట్టిపీడిస్తున్న ఉల్లిగడ్డ రోగం తోటలో అధికంగా కనిపిస్తోంది. ఈ రోగం దెబ్బకు ఆకులు ఎండిపోయి ముడతలు పడిపోతున్నాయి. కాయలు, పిందెలు, పూత రాలిపోయి రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లె, చిన్నమండెం ఈ ప్రాంతంలో అధిక మంది రైతులు టమోటా సాగు చేయడంలో మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో టమోటా సాగులో ఉంది. ఒక ఎకరాకు తీగ టమోటా సాగుకు లక్ష నుంచి లక్షా 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. పంట తెగుళ్ల బారిన పడటంతో చాలా మంది రైతులు నష్ట పోతున్నారు.  ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు జూదాన్ని తలపిస్తుండడంతో ఒక రోజు ధర ఉండడం, మరుసటి రోజు లేకపోవడం జరుగుతోంది. ఒక ఎకరాలో 18 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. తెగుళ్ల దెబ్బ దిగుబడిపై ప్రభావం పడే అవకాశాలు మెం డుగా ఉన్నట్లు రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.  టమోటా రైతులు తీవ్రంగా నష్టం చేసే వాటిల్లో ఉజీ ఈగ ఒకటి. దీంతో దిగుబడి వచ్చినా మార్కెట్‌లో కాయలు తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మూడు ఎకరాలు సాగు చేసి నష్టపోయా

మూడు ఎకరాల టమోటా ఈ ఏడాది సాగు చేస్తే తెగుళ్లు, వర్షాలతో తీవ్రంగా నష్టపోయా. సాగు ఖర్చు నాలుగు లక్షల రూపాయలు వచ్చింది. లక్ష రూపాయలకు మూడు లక్షలు అప్పు మిగిలింది. ఎంత ప్రయత్నించినా రోగాలు అదుపులోకి రాలేదు. ఊజీగా, ఉల్లిగడ్డ రోగం ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్‌ కాలేదు. టమోటా సాగుచేసిన రైతులకు ఈ ఏడాది నష్టాలే మిగిలాయి. 

 వెంకట్రమణ, రైతు, చెంచురెడ్డిగారిపల్లె



Updated Date - 2021-02-27T05:05:02+05:30 IST