మిర్చి పైరు కకావికలం

ABN , First Publish Date - 2021-12-08T06:45:24+05:30 IST

జిల్లాలో ఒకవైపు బొబ్బర తెగులు, మరోవైపు తామర పురుగు దాడితో కాపుకొచ్చిన మిర్చి తోటలు నిలువునా మాడిపోతున్నాయి.

మిర్చి పైరు కకావికలం
బొబ్బర తెగులు ఆశించిన మిర్చి తోట

తోటలకు బొబ్బర తెగులు, తామర పురుగు

మందులకు లొంగని తెగులు

పంటను పీకివేస్తున్న రైతులు

భారీగా నష్టం


జిల్లాలో ఒకవైపు బొబ్బర తెగులు, మరోవైపు తామర  పురుగు దాడితో కాపుకొచ్చిన మిర్చి తోటలు నిలువునా మాడిపోతున్నాయి. ఇప్పటికే ఎకరానికి రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టిన మిర్చి రైతులు, కకావికలమవుతున్న తోటలను చూసి మౌనంగా రోదిస్తున్నారు. ఎన్ని మందులు వాడినా తామర పురుగు, బొబ్బర తెగులు అదుపులోకి రాకపోవడంతో తోటలను పీకేస్తున్నారు.


  కంచికచర్ల, డిసెంబరు 7 : పశ్చిమ కృష్ణాలో నిన్నటి వరకు కళకళలాడిన మిర్చితోటలు ఉన్నట్టుండి కళతప్పాయి. భారీ దిగుబడులు వస్తాయని ఎంతో సంబరపడిన రైతులు కళ్లెదుటే తోటలు నిలువునా ముడుచుకుపోతుండడంతో కుమిలిపోతున్నారు. జిల్లాలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు, నందిగామ మండలాల్లో ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో  రైతులు మిర్చి సాగు చేశారు. కౌలుతో కలుపుకుని ఎకరానికి  ఇప్పటి వరకు లక్ష నుంచి 1.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం కాపు దశలో ఉన్న మిర్చి పైరుపై పలు ప్రాంతాల్లో తామర పురుగు దాడి చేసింది. పక్షం క్రితం అక్కడక్కడా కనిపించిన తామర పురుగు ప్రస్తుతం ఉధృతమైంది. దీని దెబ్బకు మిర్చి పైరు ముడుచుకుపోతోంది. పగలు పూలలో దాక్కొంటున్న పురుగులు పుప్పొడిని తింటున్నాయి. రాత్రి వేళల్లో ఆకుల్లోని రసాన్ని పీల్చేస్తున్నాయి. దీంతో ముడత తెగులు సోకినట్టు ఆకులు ముడుచుకుపోతున్నాయి. ఆకుల్లో రసం పీల్చిన తర్వాత కాయలపై దాడి చేస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే  చెట్లు గిడసబారిపోతుండడంతో రైతులు కంట తడిపెడుతున్నారు. 


వందలాది ఎకరాల్లో పీకివేత

   కంచికచర్ల, వీరులపాడు మండలాల్లో బొబ్బర తెగులు అధికంగా కనిపిస్తోంది. ఈ మండలాల్లో ఇప్పటి వరకు ఎకరానికి సగటున లక్ష రూపాయల వరకు పెట్టుబడి అయింది.  కళకళలాడుతున్న తోటలను పక్షం క్రితం బొబ్బర తెగులు ఆశించింది. మహమ్మారిలా దాపురించిన ఈ తెగులుకు తోటలు కకావికలమవుతున్నాయి. ఆకులతో పాటుగా కాయలు సైతం ముడుచుకు పోతున్నాయి. పూత రాలిపోతోంది. రోజురోజుకూ తోటలు కునారిల్లిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారి చేసినా ప్రయోజనం కనిపించకపోవడంతో గత్యంతరం లేక రైతులు, తోటలను పీకేస్తున్నారు. కంచికచర్ల మండలంలో బొబ్బర తెగులు ఎక్కువగా ఉంది. చెవిటికల్లు, కునికినపాడు, మున్నలూరు తదితర గ్రామాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల్లో మిర్చి తోటలను పీకేశారు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోతున్నారు. 


తోటలు దెబ్బతింటున్నాయి

ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా మిర్చి పైరుపై తామర పురుగు (వెస్ట్రన్‌ త్రిప్స్‌) దాడి చేసింది. ఎకరానికి సగటున 1.20 లక్షల రూపాయల పెట్టుబడి అయింది. మందులు పిచికారీ చేసినా, ప్రయోజనం కనిపించడం లేదు. మార్కెట్లో మిర్చి ధర పెరుగుతున్నా, ఆశించినంత దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించటం లేదు.   - కొమ్మినేని సత్యనారాయణ, ముచ్చింతాల


 ఏడు లక్షలు నష్టపోయా

ఎకరానికి 20 వేల చొప్పున ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని, మిర్చి సాగు చేశా. ఎకరానికి సగటున లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టా. వర్షాలకు కొంత పైరు దెబ్బతినగా, బొబ్బర తెగులు, తామర పురుగు వల్ల మిగిలింది తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పటికే ఐదెకరాల్లో తోటను పీకేశాను. ఏడు లక్షలకు పైగా నష్టపోయాను.  - పూసుకూరి సాంబశివరావు, చెవిటికల్లు

Updated Date - 2021-12-08T06:45:24+05:30 IST