జడ్జీలపై వ్యక్తిగత దూషణలు ప్రమాదం

ABN , First Publish Date - 2022-07-04T10:13:38+05:30 IST

బీజేపీ బహిష్కిృత నేత నూపుర్‌శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలపై..

జడ్జీలపై వ్యక్తిగత దూషణలు ప్రమాదం

’’లక్ష్మణ రేఖ దాటుతున్న సోషల్‌, డిజిటల్‌ మీడియా: జస్టిస్‌ పార్దీవాలా

సుప్రీం వ్యాఖ్యలపై తగిన వేదికపై చర్చ: రిజిజు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 3: బీజేపీ బహిష్కిృత నేత నూపుర్‌శర్మ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శలపై.. ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్‌ జేబీ పార్దీవాలా స్పందించారు. ఈ అంశానికి సంబంధించి సోషల్‌ మీడియాలో తమపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని.. న్యాయానికి ఇది ప్రమాదకరమని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఇది ఇలాగే కొనసాగితే న్యాయమూర్తులు న్యాయం ఏం చెబుతుందనే విషయం కన్నా.. మీడియా ఎలా ఆలోచిస్తుందనే అంశంపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పులపై నిర్మాణాత్మక విమర్శల కన్నా.. ఆ తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే ధోరణి సోషల్‌, డిజిటల్‌ మీడియాలో బాగా పెరుగుతోందని.. చట్టబద్దమైన పాలనను కాపాడాలంటే సామాజిక మాధ్యమాలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ ఆధునిక యుగంలో.. డిజిటల్‌ మీడియా విచారణ న్యాయనిర్వహణ ప్రక్రియలో అనుచిత జోక్యం చేసుకుంటోంది. లక్ష్మణరేఖను పలుమార్లు దాటుతోంది’’ అని జస్టిస్‌ పార్దీవాలా వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా అయోధ్య కేసును ఆయన ప్రస్తావించారు. అది ఒక భూమికి సంబంధించిన హక్కుల కేసు అని.. తీరా తీర్పు వచ్చే సమయానికి రాజకీయ రంగు సంతరించుకుందని.. దానిపై ఎప్పుడో ఒకప్పుడు, ఎవరో ఒకరు తీర్పు ఇవ్వాల్సిందేననే విషయాన్ని కావాలనే మర్చిపోయారని పేర్కొన్నారు. కాగా.. నూపుర్‌ పిటిషన్‌ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించాలని తనను చాలామంది కోరుతున్నారని.. కానీ, న్యాయమంత్రిగా సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపైన, ఇచ్చిన తీర్పుపైన వ్యాఖ్యానించడం సరికాదని కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు తెలిపారు. దీని గురించి తగిన వేదికపైన చర్చిస్తానని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన రిజిజు ఈ అంశంపై స్పందించారు. మరోవైపు జడ్జీలు ప్రసంగాలు చేయాలనుకుంటే పొలిటీషియన్లు కావొచ్చని ఢిల్లీ మాజీ జడ్జి ఎస్‌.ఎన్‌.ధింగ్రా మండిపడ్డారు. నూపుర్‌పై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. న్యాయమూర్తులు ఈ వ్యాఖ్యలను మౌఖికంగా చేశారు తప్ప ఉత్తర్వుల్లో వాటిని పొందుపరచలేదని ఆయన గుర్తుచేశారు. ఇక.. నూపుర్‌శర్మపై సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలను తాలిబన్ల అధికార ప్రతినిధి జుబియుల్లా ముజాహిద్‌ స్వాగతించారు. నూపుర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించకూడదని.. ఆమెను ఉరితీసి చంపాలని ఆయన ట్వీట్‌ చేశారు. 


న్యాయవ్యవస్థను దెబ్బ తీస్తున్నారు: సిబల్‌

న్యాయవ్యవస్థ ప్రస్తుత తీరుపై ప్రముఖ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు సభ్యులు వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, ఇటీవలి పరిణామాలతో సిగ్గుతో తలదించుకుంటున్నానని తెలిపారు. కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన ఆయన సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యా రు. భావ వ్యక్తీకరణకు దేశంలో అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జె న్సీ అమలవుతోందని ఆరోపించారు. మోదీ సర్కారు అన్ని వ్యవస్థలపై దాడి చేస్తోందని, రోజూ చట్ట ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఆల్ట్‌న్యూస్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ జుబేర్‌ అరెస్టుపై స్పందిస్తూ.. ‘50 ఏళ్లుగా నేను భాగంగా ఉన్న న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తు లు మమ్మల్ని పతనావస్థలోకి తీసుకెళ్తున్నారు. ఇది చూసి సిగ్గుతో తలదించుకుంటున్నాను. నాలుగేళ్లనాటి ట్వీట్‌పై ఇప్పుడు జుబేర్‌ను అరెస్టు చేయడం ఏమిటి?’ అని ధ్వజమెత్తారు. దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూల్చివేస్తోందని విమర్శించారు. 

Updated Date - 2022-07-04T10:13:38+05:30 IST