అవినీతి పునాదులపై..పక్కా ‘ప్లాన్‌’!

ABN , First Publish Date - 2020-02-20T09:58:27+05:30 IST

జిల్లాలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ‘అవినీతి’ పునాదులపై పక్కా ‘ప్లాన్‌’తో యథేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొంతమంది సిబ్బంది

అవినీతి పునాదులపై..పక్కా ‘ప్లాన్‌’!

జిల్లాలో యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు

టౌన్‌ప్లాన్‌ విభాగం.. మాయాజలం

అనధికార కట్టడాలకు అడ్డగోలు అనుమతులు

అమలుకాని నిబంధనలు  

చోద్యం చూస్తున్న కార్పొరేషన్‌ అధికారులు

ఏసీబీ సోదాలతో వెలుగుచూస్తున్న అక్రమాలు


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/రాజాం రూరల్‌)

జిల్లాలో అక్రమ భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి.‘అవినీతి’ పునాదులపై పక్కా ‘ప్లాన్‌’తో యథేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొంతమంది సిబ్బంది ‘మామూళ్లు’ తీసుకుని.. అనధికార కట్టడాలకు అడ్డగోలుగా అనుమతులు మంజూరు చేసేస్తున్నారు. శ్రీకాకుళంలో రెండు రోజులుగా ఏసీబీ అధికారులు చేస్తున్న సోదాల్లో అనేక విస్తుగొలిపే అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు.. బుధవారం కూడా దాడులు కొనసాగించారు. నగరంలో  అనుమతి లేకుండా అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్న ఐదు భవనాలను గుర్తించారు. ఒక్క శ్రీకాకుళం నగరంలోనే కాదు జిల్లావ్యాప్తంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. రాజాంలో కూడా ఇటీవల అనుమతి లేని 17 భవంతులను గుర్తించి అధికారులు నోటీసులు జారీచేశారు. జరిమానా సైతం విధించారు. అయినా.. కొన్నిచోట్ల అక్రమ నిర్మాణాలు ఆగకపోవడం చర్చనీయాంశమవుతోంది. 


‘దోచుకున్నోడికి దోచుకున్నంత’ అన్న చందంగా ఉంది శ్రీకాకుళం నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో కొందరి వ్యవహారం. ఇక్కడ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి అనుమతుల మాటున అడ్డగోలు నిర్మాణాలకు పచ్చజెండా ఊపుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందరికీ వాటాలు ఇస్తున్నామనే ధీమాతో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో కొందరు.. అక్రమ నిర్మాణాలకు పక్కా ప్లాన్‌ వేస్తున్నారు. అడ్డదారిలో అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఒక భవన నిర్మాణానికి ప్లాన్‌ పొందాలంటే ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.60 వేలు చలానా చెల్లించాలి.


కానీ అక్రమార్కులు టౌన్‌ప్లానింగ్‌ విభాగం లో కొంతమందికి మామూళ్లు ఇచ్చి ప్రసన్నం చేసుకుం టున్నారు. దీంతో అనుమతులు లేకుండానే అవినీతి పునాదులపై అంతస్తులు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో ఎటువంటి అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఏసీబీ అధికారులు.. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఐదు అనధికార భవన నిర్మాణాలను పరిశీలించగా.. వాటికి ఎటువంటి అనుమతులు లేవని గుర్తించారు. మంగువారితోటలో మూడంతస్తుల భవనం నిర్మాణం ఇప్పటికే పూర్తి కావచ్చింది. కత్తెరవీధిలోని మరో భవనం పనులు సగం పూర్తయ్యా యి.


ద్వారకానగర్‌ కాలనీలో నాగావళి ఏటిగట్టుకు ఆను కొని ముగ్గురు అన్నదమ్ములు ఏకంగా మూడు భవనా లు కట్టేస్తున్నారు. ఒక నాయకుడు మధ్యవర్తిగా ఉండి అధికారుల నుంచి దొడ్డిదారిన అనుమతి పొంది, ఈ నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. వాస్తవానికి భవన నిర్మాణానికి ముందే భూమి యజమాని టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన తరువాత టౌన్‌ప్లాన్‌ విభాగంలో పనిచేసే సర్వేయర్‌.. స్థల పరిశీలన చేసి, కొలతలు వేయాలి. ఆ తర్వాత అది నిర్మాణానికి యోగ్యమైనదా? కాదా? అనేది ధ్రువీకరణ చేయాలి. టౌన్‌ ప్లాన్‌ అధికారులు దీనికి ప్లాన్‌ జారీ చేయిస్తారు. కానీ ఇక్కడ అధికారులు అవేమీ పట్టించుకున్న దాఖలాలు లేవు. అన్‌లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న తరువాత ప్లాన్‌ అప్రూవ్‌ కాకుండానే భవన నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కొం దరు కనీసం అనుమతి కోసం దరఖాస్తు చేయకుండానే నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. 


తెర వెనుక నాయకులు...

శ్రీకాకుళం నగరంలో కొన్నేళ్లుగా కొనసాగుతున్న అక్రమ కట్టడాల వెనుక అన్ని పార్టీల నేతల హస్తం ఉన్నట్లు సమాచారం. గతంలో టీడీపీ హయాంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో చక్రం తిప్పిన వ్యక్తే మళ్లీ ఇప్పుడు అధికార పార్టీ నాయకుల పంచన చేరి అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. సదరు ప్రైవేటు వ్యక్తుల సిఫారసు మేరకు టౌన్‌ ప్లాన్‌ అధికారులు పనిచేయడం స్థానికులకు విస్మయం కలిగిస్తోంది.  దళా రుల ద్వారా బేరసారాలు చేసి.. అధికారులకు నగదు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. 


రాజాంలోనూ 17 భవనాలకు నోటీసులు

రాజాంలో కొంతమంది రియల్టర్లు భవంతుల నిర్మాణ విషయంలో నిబంధనలకు తిలోదకాలిస్తున్నారు. ఇష్టారాజ్యంగా ప్లాన్‌లో లేని విధంగా అయిదారు అంతస్తులు నిర్మిస్తున్నారు. రాజాం నగర పంచాయతీలో 300 స్వ్కేర్‌ మీటర్ల పరిధిలో టూ ప్లస్‌ త్రీ మేర భవంతుల నిర్మాణానికి మాత్రమే టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అనుమతినిస్తుంది. అయితే అందుకు విరుద్ధంగా చీపురుపల్లి రోడ్‌లోని గాయత్రికాలనీ సమీపా న, కేర్‌ హాస్పిటల్‌కు వెళ్లే మార్గంలో.. పాలకొండ రోడ్‌లో కొన్ని భవంతులు నిర్మి స్తు న్నారు.


ఇలా 17 భవ నాల నిర్మిస్తున్నట్టు ఇటీవల నగర పం చాయతీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు గుర్తిం చారు. 50 మంది నిర్మాణదారులకు యు.సి. నోటీసులు జారీ చేశారు. 26 మందిపై ఛార్జిషీటులు నమోదు చేశారు. గతంలో గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు మరో మూడు ఫ్లోర్‌ల నిర్మాణాలకు అనుమతులిచ్చేవారు. ఇటీవల నిర్మాణాలు ప్రారంభించిన వాటికి ఆ తరహా అనుమతుల్లేవు. అయినా సరే సెల్లార్‌తో కలిపి ఆరంతస్తుల భవన సముదాయ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఒకరిద్దరు నిర్మాణదారులు మాత్రం ‘వుడా’ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని స్పష్టం చేస్తున్నారు. 


పార్కింగ్‌కు బదులు.

అపార్ట్‌మెంట్లు, బహుళ అంతస్తులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు నిర్మిస్తే వాహనాల పార్కింగ్‌, ఇతరత్రా అవసరాల దృష్ట్యా సెల్లార్‌ ఉంచాలి. కానీ అందుకు విరుద్ధంగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ల యజమానులు.. పార్కింగ్‌ స్థలాల్లో సైతం గొడౌన్లు, షాపులు నిర్మిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ విభాగానికి ప్లాన్‌ కోసం దరఖాస్తు చేసిన సమయంలో మాత్రం పార్కింగ్‌ కోసమే నమోదు చేస్తున్నారు. కానీ, నిర్మాణాలలో మాత్రం షాపులు దర్శనమిస్తున్నాయి. 


నోటీసులు దాఖలు చేశాం : 

రాజాం పట్టణంలో ఇప్పటివరకు 17 అక్రమ నిర్మాణాలను గుర్తించాం. భవన యజమానులకు నోటీసులు జారీచేశాం. జరీమానాలు కూడా విధించాం. అయినా వారిలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. అవసరమైతే కోర్టులో కేసులు నమోదు చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. 

జి.నాగలత, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి, రాజాం.

Updated Date - 2020-02-20T09:58:27+05:30 IST