అటవీ గ్రామాల అభివృద్ధికి అనుమతులే అడ్డంకి

ABN , First Publish Date - 2022-05-11T04:35:40+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్ధాలు దాటినా ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో ఇంకా రహదారులు లేని గ్రామాల్లో వందల్లో ఉన్నాయి. అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతున్నా రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ రూపంలో అడ్డంకులు ఎదరవుతుండటంతో ప్రజానీకానికి రహదారి ఇక్కట్లు తప్పడం లేదు.

అటవీ గ్రామాల అభివృద్ధికి అనుమతులే అడ్డంకి

- అటవీ గ్రామాల రోడ్లకు అనుమతించని అటవీశాఖ

- పాత రోడ్ల పునరుద్ధరణకూ మోకాలడ్డు

- అటవీ అధికారుల వైఖరితో ప్రజలకు తప్పని ఇక్కట్లు

- వందలాది గ్రామాలకు ఇంకా కాలినడకే దిక్కు 

- అనుమతుల కోసం వేచి చూస్తున్నామంటున్న అటవీశాఖ

(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్ధాలు దాటినా ఆసిఫాబాద్‌ ఏజెన్సీలో ఇంకా రహదారులు లేని గ్రామాల్లో వందల్లో ఉన్నాయి. అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతున్నా రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ రూపంలో అడ్డంకులు ఎదరవుతుండటంతో ప్రజానీకానికి రహదారి ఇక్కట్లు తప్పడం లేదు. ఏజెన్సీలోని తిర్యాణి, కెరమెరి, సిర్పూరు(యూ) మండలాలతో పాటు ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూరు(టి), దహెగాం, పెంచికల్‌పేట వంటి మండలాల్లో నేటికీ ప్రజలు తమ రోజూ వారి అవసరాలు తీర్చుకునేందుకు సమీప పట్టణాలకు రావాలంటే కాలినడకే దిక్కు. మరీ ముఖ్యంగా ఏజీన్సీ మండలాల్లో నిత్యావసరాల కొనుగోలు కూడా 20-30 కిలోమీటర్లు అడవిలోని డొంక దారుల గుండా కాలినడక ప్రయాణించాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రజల బాధలను తప్పించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు వివిధ పథకాల కింద రోడ్లను మంజూరు చేయిస్తున్నా అటవీ శాఖ నిబంధనల కారణంగా వాటికి మోక్షం లభించడం లేదు. ఇదంతా ఒక వైపు అయితే మరో వైపు గతంలోనే నిర్మించిన రోడ్లకు కూడా మరమ్మతులు చేయనీయకుండా అధికారులు సైందవుల్లా అడ్డుపడుతున్నారన్న అరోణలున్నాయి. అయితే ఆ శాఖ ఉన్నతాధికారులు మాత్రం అలాంటిదేమీలేదని చెప్పుతున్నా క్షేత్రస్థాయిలో ఉండే దిగువ స్థాయి సిబ్బంది అడ్డంకులు సృష్టిస్తున్నారన్నది వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధుల వాదన. అటు ఎమ్మెల్యేలు కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం ఇక్కడి పరిస్థితులకు దర్పణం పడుతుందని చెప్పాలి. రోడ్ల నిర్మాణ వ్యవహారంలో ఐదేళ్లుగా గ్రామస్థులకు అటవీశాఖకు మధ్య తరుచూ వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల బెజ్జూరు మండలంలోనూ ఇదే తరహా వివాదం తలెత్తింది. దాంతో గ్రామ స్థులు గ్రామంలో ప్రతి ఇంటిపై నల్లా జెండాలను ఎగురవేసి అటవీ శాఖ వ్యవహరశైలిపై నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు తిర్యాణి మండలంలోనూ అటవీ శాఖ అధికారులు ఇదే తరహాలో రోడ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటుండటంతో ఆదివాసులు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మంగీ, గుండా వంటి మారుమూల అటవీ ప్రాంత గ్రామాలు, వాటి పరిధిలోని ఆవాసాలకు కనీస రోడ్డు సౌకర్యం లేక పోవడంతో దండేపల్లి మీదుగా మంచిర్యాలకు వెళ్లి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అలాగే జిల్లా కేంద్రానికి వ్యక్తిగత అవసరాల నిమిత్తం రావాలంటే కొండలు, గుట్టలు దాటుకుంటూ రావాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. 

రోడ్డు సదుపాయం నోచుకొని గ్రామాలు..

జిల్లాలో కనీస రోడ్డు సౌకర్యాలు లేని గ్రామాలను పరిశీలిస్తే మొగవెల్లి నుంచి గూడెం, బెజ్జూరు-సోమిని, బెజ్జూరు-పాపన్‌పేట, తలాయి గ్రామాల్లో రోడ్డు సమస్య ఉంది. ఇక్కడ రోడ్ల నిర్మాణం, కల్వర్టుల నిర్మాణం కోసం నిధులు మంజూరైనప్పటికీ అనుమతులు లేని కారణంగా పనులు నిలిచి పోయాయి. మొగవెల్లి నుంచి గూడెం వరకు 2014లో బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.6.65 కోట్లు నిధులు మంజూరు చేపట్టారు. బెజ్జూరు-సోమిని గ్రామాల మధ్య రోడ్డుతో పాటు రెండు వాగులపై వంతెనల నిర్మాణానికి రూ.7.25కోట్లు మంజూరయ్యాయి. బెజ్జూరు నుంచి పాపన్‌పేట వరకు డబుల్‌ రోడ్డ నిర్మాణం కోసం రూ.8కోట్లు మంజూరయ్యాయి. పాపన్‌పేట నుంచి తలాయి గ్రామానికి రోడ్డు నిర్మాణం కోసం రూ.15కోట్లు మంజూరయ్యాయి. చింతలమానేపల్లి మండలంలో దిందా, ఖేతిని గ్రామాల మధ్య ఉన్న ప్రధాన వాగుపై వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం మూడు కోట్లు మంజూరు చేసింది. సిర్పూరు(టి) మండలంలో 2018లో రూ.18లక్షల వ్యయంతో సిర్పూరు చీలపెల్లి మెటల్‌ రోడ్డు పనులు చేపట్టగా అటవీ శాఖ అడ్డుకుంది. ఇలా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతున్నా అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో రోడ్డు, వంతెనల పనులు నిలిచిపోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొ మండలంలో సగటున పది నుంచి 15 గ్రామాలు రోడ్డు సదుపాయం లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వర్షా కాలంలో వాగులు, వంకలు దాటలేక నెలల తరబడి అటవీ గ్రామాల్లోనే బందీలుగా మారుతున్నారు. 

80 రోడ్లకు అనుమతుల కోసం లేఖ రాశాం

-శాంతారాం, జిల్లా అటవీశాఖ అధికారి 

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆసిఫాబాద్‌ జిల్లాలోనే అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు రోడ్డు సదుపాయం కోసం అటవీ శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు 80తారు రోడ్ల నిర్మాణం కోసం అనుమతి మంజూరు చేయాలని  ఉన్నతాధికారులకు లేఖ రాశాం. ఫారెస్టు క్లియరెన్స్‌ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాశాం. త్వరలోనే అనుమతులువచ్చే అవకాశాలున్నాయి. బెజ్జూరు మండలం పాపన్‌పేట రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులకు అనుమతులు లేక పోవ డంతోనే అభ్యంతరం వ్యక్తం చేశాం. నిబందనలు మేర దరఖాస్తులు చేసుకుంటే అనుమతులు వచ్చేవి. ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలన్నది మాఉద్దేశ్యం కాదు. అయితే గ్రామాల పేరుతో కొన్నిచోట్ల అడవి మధ్యలో పది, ఇరవై కుటుంబాలకు కూడా రోడ్లు వేసే ప్రయత్నాలు మాత్రం సరికాదు. వారిని ప్రధాన స్రవంతిలోకి రావాలని కోరుతున్నాం.

Read more