3 రోజుల్లోనే అనుమతి

ABN , First Publish Date - 2021-04-16T07:12:25+05:30 IST

కరోనా మహమ్మారి ఉధృతంగా కమ్మేస్తుండడంతో కేంద్రం విదేశీ టీకాలకు సత్వర అనుమతి

3 రోజుల్లోనే అనుమతి

విదేశీ టీకా దరఖాస్తులపై  కేంద్రం నిర్ణయం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కరోనా మహమ్మారి ఉధృతంగా కమ్మేస్తుండడంతో కేంద్రం విదేశీ టీకాలకు సత్వర అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. అత్యవసర పరిమిత వినియోగానికి సంబంధించి - విదేశాల్లో తయారైన కొవిడ్‌ వ్యాక్సిన్లకు దరఖాస్తు చేసిన మూడు రోజుల్లోనే అనుమతిచ్చేయాలని నిశ్చయించింది. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఈ అప్లికేషన్లను పరిశీలించి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను, దిగుమతి లైసెన్సును ఇస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా, యూరప్‌, జపాన్‌ మొదలైన  దేశాల్లోని రెగ్యులేటరీ విభాగాలు అత్యవసర వినియోగ అనుమతులను ఇచ్చిన రీతిలోనే  భారత్‌లోనూ ఈ క్లియరెన్సులను ఫాస్ట్‌ట్రాక్‌ చేయాలని కేంద్రం మంగళవారం నిర్ణయించిన తరువాత ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను సీడీఎ్‌ససీఓ విడుదల చేసింది.


విదేశీ టీకా ఉత్పత్తి సంస్థలు తమ దరఖాస్తులను భారత్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా గానీ, అది లేకపోతే ఓ ఆథరైజ్డ్‌ ఏజెంట్‌ ద్వారా గానీ సీడీఎ్‌ససీఓకు పంపాలి.  వాటిని చూసి అన్నీ బాగుంటే దరఖాస్తు చేసిన 72 గంటల్లోగా అనుమతి ఇస్తారు. మొదట 100 మందికి ఈ వ్యాక్సిన్‌ ఇచ్చి ఏమైనా దుష్ఫలితాలున్నాయా... అన్నది వారంరోజుల పాటు పరిశీలిస్తారు. కాగా, అత్యవసరం కాని పరిశ్రమలకు ఆక్సిజన్‌ సరఫరాలో కోత విధించాలని, అది ఆరోగ్య రంగానికి- ముఖ్యంగా కొవిడ్‌ ఆసుపత్రులకు, చికిత్సకు మళ్లించాలని కేంద్రం యోచిస్తోంది. 



రెమ్‌డెసివిర్‌ డోసులు ఇస్తా: సీఆర్‌ పాటిల్‌

ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుండగా మరోవైపు గుజరాత్‌లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో, సూరత్‌లోని తమ పార్టీ కార్యాలయం ద్వారా 5,000 డోసుల రెమ్‌డెసివిర్‌ను కరోనా రోగులకు ఉచితంగా అందేలా చేస్తానని బీజేపీ గుజరాత్‌ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ మీడియాకు తెలిపారు. అయితే, అంత పెద్ద మొత్తంలో రెమ్‌డెసివిర్‌ను ఎలా కొనగలిగారని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానాలు చెప్పలేదు. వైద్యుడి ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా ఆరు డోసుల కంటే అధికంగా రెమ్‌డెసివిర్‌ను విక్రయించొద్దని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది.


మరి ఆ ఔషధ నిల్వల కోసం సెన్సు పొందారా? అని సీఆర్‌ పాటిల్‌నుమీడియా ప్రశ్నిసే సమాధానం చెప్పలేదు. తర్వాత ఇదే విషయాన్ని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీని మీడియా ప్రశ్నించగా దానిపై తనకు ఏమీ తెలియద ని, సీఆర్‌ పాటిల్‌నే అడగాలని సమాధానమిచ్చారు. దీంతో గుజరాత్‌ పత్రిక దివ్య భాస్కర్‌ ఇటీవల మొదటి పేజీలో పాటిల్‌ ఫోన్‌ నంబరును పెద్ద అక్షరాలతో ప్రచురించింది. ప్రజలు పాటిల్‌కు ఫోన్‌చేసి రెమ్‌డెసివిర్‌ గురించి అడగాలని పేర్కొంది.


Updated Date - 2021-04-16T07:12:25+05:30 IST