Abn logo
Apr 10 2020 @ 00:03AM

సేవకు నిబంధనాలు!

స్వచ్ఛంద సేవకు అనుమతి తప్పనిసరి 

ఎవరైనా సరే నేరుగా పంపిణీ చేయడానికి వీల్లేదని ఆదేశాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరిక

ప్రతిబంధకాల మధ్యన పేదలకు సేవ చేయలేమంటున్న సంఘాలు


గుంటూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకటించిన లాక్‌డౌన్‌లో పేదప్రజలు, యాచకులు ఇబ్బంది పడకుండా వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, రాజకీయ నేతలు అందిస్తున్న సాయానికి అనుమతిని జిల్లా యంత్రాంగం తప్పనిసరి చేసింది. ఏ ఒక్కరూ నేరుగా నిత్యవసర సరుకులు, భోజనం ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు వంటివి అందజేయడానికి వీల్లేదని ఆదేశించింది. తమ అనుమతి తీసుకొని మెప్మా సిబ్బంది ద్వారా పంపిణీ చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ ఇందుపల్లి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ స్పష్టం చేశారు.ప్రజలకు ఉపయోగపడే సరుకులను తాము ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వారి చెంతకు చేరుస్తుంటే ఇలా నిబంధనలు పెట్టడంపై వివిధ సామాజిక, స్వచ్ఛంధ సేవా సంస్థలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 


గత నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ ప్రారంభమైన రోజు నుంచి జిల్లావ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఏ గూడు లేకుండా రోడ్ల పక్కన ప్లాట్‌ఫాంలనే ఆశ్రయం చేసుకొని జీవిస్తున్న వారికి నిత్యం ఆకలి తీరుస్తున్నారు. జిల్లా కేంద్రంలో అమ్మ చారిటబుల్‌ ట్రస్టు, రియల్‌ మిరాకిల్స్‌, తెలుగుదేశం, వైసీపీ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు తీరిక లేకుండా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమౌతున్నాయి. జిల్లా యంత్రాంగం చేయలేని కార్యక్రమాలను ఆయా సంస్థలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. వలస కార్మికులకు నిత్యవసర సరుకులైన బియ్యం, కూరగాయలు, కందిపప్పు, నూనె వంటివి ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ఇళ్లు లేకుండా రోడ్లపై ఉంటున్న వారికి భోజన ప్యాకెట్లు అందిస్తూ ఎక్కడా ఇబ్బంది రాకుండా చూస్తున్నాయి. కొన్ని సంస్థలు అయితే పాలు, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేస్తున్నాయి. 


అయితే ఆయా సంస్థలు పంపిణీ చేసే సమయంలో సామాజిక దూరం పాటించకుండా చేస్తున్నాయని, అంతేకాకుండా ఫొటోలు, ప్రచారం కోసం చేస్తున్నాయని కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీని వలన కరోనా వైరస్‌ వ్యాప్తి రిస్కు ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్వచ్ఛంద సంస్థలు భోజనం, సరుకులు పంపిణీ చేయాల్సిన ప్రదేశం వివరాలు అందిస్తే అక్కడికి మెప్మా సిబ్బంది పంపించి వారి ద్వారా పంపిణీ చేయిస్తామని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఇందుకోసం కలెక్టరేట్‌లో విజయ్‌కుమార్‌ అనే అధికారి ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. 


ఇదిలావుంటే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకొంటున్న చర్యలకే జిల్లా యంత్రాంగం వద్ద సరిపడా సిబ్బంది అందుబాటులో లేరు. ఇప్పటికే పోలీసులు చేయాల్సిన డ్యూటీలను ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో చేయిస్తున్నారు. అధికార యంత్రాంగం కేవలం కొద్దిమందిని మాత్రమే పునారావాస కేంద్రాలకు తరలించి వారికి భోజనం పెడుతున్నారు. అయితే పునరావాస కేంద్రాలకు తరలించని వారు వందల సంఖ్యలో ఉన్నారు. నిత్యం రాత్రి వేళ జీజీహెచ్‌ క్యాజువాలిటీ వద్ద ప్లాట్‌ఫాంపై వారంతా నిద్రిస్తున్నారు. ఇలాంటి వారు జిల్లా అంతటా వేల మంది ఉన్నారు. వారికి దాతలు సాయం అందిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిత్యం కలెక్టరేట్‌కు వచ్చి అనుమతి తీసుకొని మెప్మా సిబ్బందితో వెళ్లి భోజనం, సరుకులు పంపిణీ చేయాలంటే సాధ్యమయ్యే పని కాదని వివిధ సంఘాల ప్రతినిధులు చెప్పారు. దీని వలన సాయం చేసే చేతులు కూడా ముందుకు రాకపోవచ్చని చెబుతున్నారు. తాము సామాజిక దూరం పాటిస్తూనే సరుకులు, భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement