వేటకు వేళాయే!

ABN , First Publish Date - 2020-06-01T11:21:22+05:30 IST

సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఏటా 61 రోజుల పాటు నిషేధం ఉండగా.. ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా మత్స్యకారుల

వేటకు వేళాయే!

నేటి నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతి

రెండు వారాల ముందుగానే  తీర  గ్రామాల్లో సందడి 


(ఎచ్చెర్ల): సముద్రంలో చేపల వేట నిషేధ సమయాన్ని ప్రభుత్వం తగ్గించింది.  ఏటా 61 రోజుల పాటు నిషేధం ఉండగా.. ఈ ఏడాది లాక్‌డౌన్‌ కారణంగా మత్స్యకారుల ఉపాధి దృష్ట్యా 47 రోజులకు కుదించింది. సోమవారం నుంచి సముద్రంలో చేపల వేటకు అనుమతిచ్చింది. ఏటా  చేపల ఉత్పత్తి సమయంగా పరిగణనలోకి తీసుకొని ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధించేది. ఈ సమయానికి మత్స్యకారులకు నిషేధ భృతి అందించేది. ఈ ఏడాది కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చింది. సముద్రంలో మత్స్యకారుల చేపల వేటను సైతం నిలిపివేశారు.


ఇటీవల ఆంక్షల సడలింపులో భాగంగా అన్ని రంగాలకు అనుమతిచ్చినా.. చేపల వేట నిషేధ సమయం అమల్లో ఉండడంతో మత్స్యకారులు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ నుంచి సుమారు రెండు నెలలు ఖాళీగా ఉండడంతో ఉపాధికి దూరమయ్యామని.. కుటుంబ జీవనం కష్టంగా మారిందని మత్స్యకారులు విన్నవించడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రెండు వారాల ముందుగానే నిషేధాజ్ఞలను సడలించింది. దీంతో చేపల వేటకు మత్స్యకారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై మత్స్యకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  


జిల్లాలో 193 కిలో మీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. 11 మండలాల్లో 104 మత్స్యకార గ్రామాలున్నాయి. 1,500 మోటారైజ్‌డ్‌ బోట్లతో చేపల వేట సాగిస్తున్నారు. ఒక్కో బోటుపై 8 నుంచి 10 మంది వంతున మత్స్యకారులు చేపల వేట సాగిస్తుంటారు. ఈ ఏడాది వేట నిషేధ సమయంలో  14,289 మంది మత్స్యకారులకు రూ.10 వేల వంతున ‘మత్స్యకార భరోసా’ పథకం కింద ప్రభుత్వం సాయం చేసింది. కానీ శాశ్వత ఉపాధి కలిగించే చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. జెట్టీలు నిర్మిస్తే స్థానికంగా ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో సుమారు రూ.331 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డి.మత్స్యలేశం పంచాయతీ రాళ్లపేటలో ఫిషింగ్‌ ల్యాండింగ్‌ జెట్టీ నిర్మిస్తామని ప్రతిపాదించారు. హార్బర్‌, జెట్టీలు నిర్మిస్తే చేపల వేటకు అనుకూలంగా ఉంటుందని మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. భావనపాడు పోర్టు నిర్మాణం పూర్తిచేసినా మత్స్యకారులకు శాశ్వత ఉపాధి దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


అందరికీ భరోసా అందించండి

జిల్లా నుంచి ఏటా 4 వేల మంది మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. స్థానికంగా చేపల వేట గిట్టుబాటుకాక గుజరాత్‌, తమిళనాడు వంటి ప్రాంతాలకు వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. వలస మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉంటున్నారు. వారికి కూడా మత్స్యకార భరోసా అందించి ఆదుకోవాలి. జిల్లాలో జెట్టీల నిర్మాణంతో పాటు భావనపాడు హార్బర్‌ నిర్మాణం చేపట్టాలి. తద్వారా స్థానికంగానే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుంది.

 - మూగి రామారావు, ఎస్టీ సాధన కమిటీ నేత


రెండువారాలు ముందుగానే..

నేటి నుంచి సముద్రంలో చేపల వేటకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకూ వేట నిషేధ సమయం అమల్లో ఉంటుంది. ఈ ఏడాది లాక్‌డౌన్‌తో మార్చి నుంచే చేపల వేట లేకుండా పోయింది. దీంతో మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రెండు వారాల ముందుగానే చేపలవేటకు అనుమతిచ్చింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 14,289 మంది మత్స్యకారులకు వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద రూ.10 వేల  వంతున సాయమందించాం.

డాక్టర్‌ వీవీ కృష్ణమూర్తి, జేడీ, మత్స్యశాఖ 

Updated Date - 2020-06-01T11:21:22+05:30 IST