అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి

ABN , First Publish Date - 2022-01-29T07:12:52+05:30 IST

నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాల తంతు యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులేమో గృహ నిర్మాణం కోసం తీసుకుని నిర్మాణాలు మాత్రం వారికి నచ్చినవిధంగా నిర్మిస్తున్నారు.

అనుమతి ఒకటి.. నిర్మాణం మరొకటి

నగరంలో యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

ఇళ్ల పేరిట అనుమతులు.. వ్యాపార సముదాయాల కట్టడాలు

వినాయక్‌నగర్‌ వంద ఫీట్ల రోడ్డులో ఇదే తరహా అక్రమాలు

కార్పొరేటర్‌ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోని అధికారులు

నిజామాబాద్‌అర్బన్‌, జనవరి 28: నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాల తంతు యథేచ్ఛగా సాగుతోంది. అనుమతులేమో గృహ నిర్మాణం కోసం తీసుకుని నిర్మాణాలు మాత్రం వారికి నచ్చినవిధంగా నిర్మిస్తున్నారు. దీనికి కార్పొరేషన్‌ అధికారులు తోడుకావడంతో నగరంలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థ అధికారుల నిర్వాకంతో నిర్మాణం పూర్తికాని భవనాలకు సైతం ట్యాక్స్‌లు వేస్తున్నారు. గృహ నిర్మాణం కోసం అనుమతులు తీసుకుంటూ వ్యాపార సముదాయాలను నిర్మిస్తున్నా.. ఉన్నతాధికారులు వీటిపై దృష్టిపెట్టకపోవడంతో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహారం జరుగుతోంది. టీఎస్‌బీపాస్‌ద్వారా ఏ నిర్మాణం చేపట్టాలన్నా దరఖాస్తులు చేసుకుంటే అధికారులు పర్యవేక్షణ చేసి అనుమతులు ఇస్తారు. కానీ దరఖాస్తు ఏమో గృహ నిర్మాణం కోసం, నిర్మాణం ఏమో వాణిజ్య అవసరాల కోసం చేస్తున్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్‌ బృందాలు మాత్రం ఏమిపట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. 

ఫ టీఎస్‌బీఎస్‌తోనే తంటాలు..

కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం నగరంలో ఏ నిర్మాణం చేపట్టాలన్నా టీఎస్‌బీఎస్‌ ద్వారా దరఖాస్తుచేస్తే టాస్క్‌ఫోర్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాటికి అనుమతులు ఇస్తారు. ఇందులో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌, నీటిపారుదలశాఖ అధికారులు సభ్యులుగా ఉండి అన్ని సవ్యంగా ఉంటే అనుమతులు ఇస్తారు. కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా ఇంటి నిర్మాణదారుడు చెల్లించిన చలాన్‌ తిరిగిరాదు. అయితే స్థాని క ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రోత్సాహంతో నగరంలో నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 

ఫ నిర్మాణం పూర్తికాని ఇంటికి  ట్యాక్స్‌..

నగరంలోని దుబ్బా ప్రాంతంలో గృహ నిర్మాణం కోసం అనుమతి తీసుకుని నిర్మిస్తున్న ఒక భవనాన్ని నగరపాలక సంస్థ రెవెన్యూ ఇన్స్‌పెక్టర్‌ కమర్షియల్‌ భవనంగా చూపిస్తూ ట్యాక్స్‌ వేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ భవన నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉండగా దానికి ఆ అధికారి అత్యుత్సాహంతో కమర్షియల్‌ ట్యాక్స్‌ వేయగా దానిపై స్థానిక కార్పొరేటర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ భవన నిర్మాణ విషయంలో సదరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అన్ని తానై వ్యవహరించడం విశేషం. ఈ వ్యవహారంలో భారీ మొత్తంలో ఆ భవన నిర్మాణదారుడి నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. నగరంలోని వినాయక్‌నగర్‌ వంద ఫీట్ల రోడ్డులో ఓ భవన నిర్మాణదారుడు గృహ నిర్మాణం కోసం అనుమతి తీసుకుని అడ్డగోలుగా వ్యాపార సముదాయాన్ని నిర్మించాడు. ఈ విషయంలో స్థానిక కార్పొరేటర్‌ ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోడంలేదనే విమర్శలు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించవద్దని ప్రభుత్వం తెచ్చిన కొత్త మున్సిపల్‌ చట్టానికి అధికారులు తూట్లు పొడవడంపై విమర్శలు విన వస్తున్నాయి. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..

 ఫ రవిబాబు, నగర డిప్యూటీ కమిషనర్‌

భవన నిర్మాణాలు పూర్తికాకుండా మున్సిపల్‌ అధికారులు ట్యాక్స్‌లు వేస్తే దానిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అతిక్రమించి ఎవరు అక్రమాలకు పాల్పడినా వారిపై తప్పక చర్యలు ఉంటాయి.

Updated Date - 2022-01-29T07:12:52+05:30 IST