పెళ్లికి అనుమతి కఠినతరం

ABN , First Publish Date - 2021-05-06T06:13:13+05:30 IST

కరోనా కర్ఫ్యూ వేళ పెళ్లిళ్ల వంటి శుభ కార్యాలయాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పెళ్లికి అనుమతి కఠినతరం

20 మంది అతిథులతోనే వేడుక

ఆధార్‌ నెంబర్లతో దరఖాస్తులు: కలెక్టర్‌


చిత్తూరు కలెక్టరేట్‌, మే 5: కరోనా కర్ఫ్యూ వేళ పెళ్లిళ్ల వంటి శుభ కార్యాలయాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేస్తూ కలెక్టర్‌ ఎం. హరినారాయణన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంక్షలను కఠిన తరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తప్పనిసరైతేనే వివాహాలు చేయాలని సూచించారు. పెళ్ళిళ్లకు అనుమతుల జారీ ప్రక్రియను ఆయా మండలాల తహసీల్దార్లకు కలెక్టర్‌ అప్పగించారు.   ఈ నెలలో 6, 12, 13, 14, 22, 27, 28, 29, 30 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి.  డిసెంబరు తరువాత ఈ నెలలోనే ఎక్కువ ముహూర్తాలు ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలో ఇకపై పెళ్లిళ్ల   కోసం ముందుగా అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. పెళ్లి ఎవరెవరికీ, ఎక్కడ జరుగుతుందన్న విషయాన్ని ఇరు కుటుంబాలు వివరాలతో తహసీల్దార్లకు వినతిపత్రాన్ని అందించాలి. దీంతో పాటు పెళ్లి జరుగుతుందనే న్యాయవాది డిక్లరేషన్‌ను జత చేయాలి. పెళ్లి శుభలేఖ, వధూవరులతో పాటు పెళ్లికి వచ్చే 20 మంది ఆధార్‌ జిరాక్స్‌ కాపీలు, ఫోన్‌ నెంబర్లను జత చేయాలి.  తమ పరిధిలోని వీఆర్వో, వీఆర్‌ఏకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ మాస్కులు ధరించి వివాహానికి హాజరవుతామని డిక్లరేషన్‌ అందించాలి.


అధిక  ధరలకు ఆక్సిజన్‌, రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లు కొనొద్దు

ఆక్సిజన్‌ అందిస్తేనే, రెమ్‌డిసివిర్‌ ఇంజెక్షన్లను వేస్తేనే కరోనా నయమవుతుందన్న అపోహతో అధిక ధరలు చెల్లించి ఆక్సిజన్‌, రెమ్‌డిసివర్‌ ఇంజెక్షన్లను కొనుగోలు చేయొద్దని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని, కరోనా భయంతోనే ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోగ నిరోధక శక్తి కలిగిన ఆహారం తీసుకుంటూ యోగా, ప్రాణాయామం చేస్తే మంచిదన్నారు. జ్వరం తీవ్రమైన తర్వాత ఆస్పత్రులకు వెళ్లడం కంటే ముందే కొవిడ్‌ లక్షణాలను గుర్తించి హోమ్‌ ఐసోలేషన్‌ లేదా కొవిడ్‌ సెంటర్లకు వెళ్లాలన్నారు.

Updated Date - 2021-05-06T06:13:13+05:30 IST