నెలసరి సమయంలో అలాంటి ఫుడ్ తింటున్నారా? అయితే..

ABN , First Publish Date - 2022-04-26T17:16:40+05:30 IST

నెలసరి సమయంలో భావోద్వేగాల మీద నియంత్రణ తప్పుతుంది. మానసిక కుంగుబాటు,

నెలసరి సమయంలో అలాంటి ఫుడ్ తింటున్నారా? అయితే..

ఆంధ్రజ్యోతి(26-04-2022)

నెలసరి సమయంలో భావోద్వేగాల మీద నియంత్రణ తప్పుతుంది. మానసిక కుంగుబాటు, ఉద్వేగాలు, కోపోద్రేకాలూ మానసకి స్థితిని అతలాకుతలం చేస్తాయి. ఈ పరిస్థితి సద్దుమణగాలంటే అందుకు తోడ్పడే కారకాలకు అడ్డుకట్ట వేయాలి. అవేంటంటే...


ఉప్పు: ఉప్పు శరీరంలో నీరు నిల్వ ఉండిపోయేలా చేస్తుంది. నెలసరి సమయంలో ఉప్పటి చిరుతిళ్ల మీదకు మనసు మళ్లినా వాటి జోలికి వెళ్లకుండా ఉండాలి. సాల్టెడ్‌ చిప్స్‌, స్నాక్స్‌ తినడం వల్ల బ్లోటింగ్‌ పెరిగి, నెలసరి నొప్పులు రెట్టింపవుతాయి.


పాల ఉత్పత్తులు: ఈ సమయంలో పాలతో పొట్టలో వాయువులు పెరుగుతాయి. దాంతో ఉబ్బరం సమస్య వేధిస్తుంది. ఇర్రిటబుల్‌ బోవెల్‌ సిండ్రోమ్‌ను తలపించే ఈ సమస్యకు గురి కాకుండా ఉండాలంటే నెలసరి సమయంలో చీజ్‌, యోగర్ట్‌లకు దూరంగా ఉండాలి.


శారీరక సంపర్కం: సెక్స్‌తో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం దక్కుతుందనుకోవడం పొరపాటు. ఈ సమయంలో గర్భాశయ ముఖద్వారం వదులుగా మారి, వైరస్‌లు, బ్యాక్టీరియాలు తేలికగా గర్భాశయంలోకి చొరబడే వీలుంటుంది. కాబట్టి సెక్స్‌కు నో చెప్పడమే ఉత్తమం. 


రాత్రుళ్లు మేలుకోవడం: నెలసరి సమయంలో నిద్ర పట్టని మాట వాస్తవమే అయినా, టివి షోలు చూస్తూ జాగారం చేయకూడదు. ఇలా రాత్రుళ్లు మేలుకోవడం వల్ల శరీరంలో స్ట్రెస్‌ హార్మోన్‌, కార్టిసాల్‌ ఉత్పత్తి పెరిగిపోతుంది. దాంతో నెలసరి సమస్యలు మరింత ఎక్కువవుతాయి.


కెఫీన్‌: కాఫీలు తరచుగా తాగే అలవాటుంటే నెలసరి సమయంలో మానుకోవాలి. కెఫీన్‌ నెలసరి నొప్పులను పెంచుతుంది. అలాగే చీటికీ మాటికీ కోపం, చీకాకు కలగడం లాంటి లక్షణాలు కూడా కెఫీన్‌తో పెరుగుతాయి.


వ్యాక్సింగ్‌: నెలసరి సమయంలో పెయిన్‌ రిసెప్టార్లు సున్నితంగా మారతాయి. ఫలితంగా వ్యాక్సింగ్‌లో నొప్పి తీవ్రత పెరుగుతుంది. కాబట్టి నెలసరి సమయంలో వ్యాక్సింగ్‌ లాంటి వాటికి దూరంగా ఉండాలి.

Updated Date - 2022-04-26T17:16:40+05:30 IST