Abn logo
Sep 19 2021 @ 00:48AM

పరిమళించిన మానవత్వం

ఆసుపత్రిలో యువతిని చేర్పించిన యువకులు

మతిస్థిమితం కోల్పోయిన యువతిని ఆసుపత్రిలో చేర్చిన యువకులు


చోడవరం, సెపెం్టబరు 18: ఒకప్పుడు బాగా బతికిన కుటుంబానికి చెందిన ఓ యువతి కాలక్రమంలో మానసిక కుంగుబాటుకు గురైంది. తండ్రిని కోల్పోవడం.. ఆర్థికంగా చితికిపోవడంతో మనోవ్యధ చెందింది. అండగా ఉండే తల్లికి కూడా అనారోగ్యం చేయడంతో మతిస్థిమితం కోల్పోయింది. ఆమె రహదారులపై సంచరించడాన్ని చూసి స్థానిక యువకులు ఆసుపత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్నారు.

మండల కేంద్రంలోని ఎడ్లవీధికి చెందిన చొప్పా సత్యమణి కొద్ది రోజులుగా మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై సంచరిస్తున్నది. ఆమె కుటుంబ పరిస్థితి గమనించిన ఎడ్లవీధికి చెందిన కొటాన ప్రసాద్‌, టాక్సీ డ్రైవర్‌ కర్రి శ్రీను శుక్రవారం సాయంత్రం సత్యమనితో పాటు ఆమె తల్లిని కూడా విశాఖ తీసుకుని వెళ్లి మానసిక వైద్యాలయంలో చేర్చించారు. ఆమెకు వైద్యం అందేలా ఏర్పాటు చేయడంతో పాటు ఆర్థిక సాయం అందించారు. యువతి కోలుకుని ఇంటికి వచ్చేవరకూ అన్ని విధాలుగా సహకరిస్తామని కొటాన ప్రసాద్‌ చెప్పారు. బంధువులు సైతం పట్టించుకోని పరిస్థితుల్లో యువతికి అండగా నిలబడిన వారిద్దరినీ స్థానికులు అభినందిస్తున్నారు.