Abn logo
May 29 2020 @ 00:00AM

అనంత ఫలానికి... ఆరు ఉపవాసాలు!

పవిత్రమైన రంజాన్‌ మాసం తరువాత... ఇప్పుడు నడుస్తున్న షవ్వాల్‌ మాసానికి సైతం గొప్ప విశిష్టత ఉంది. షవ్వాల్‌ మాసంలో ఆరు రోజుల పాటు ఉపవాసాలను పాటించే సంప్రదాయం ఉంది. ఇది తప్పనిసరి కాదు. తగిన కారణం ఉంటే మినహాయింపు ఉంటుంది. ఈ ఉపవాసాలను సాధారణంగా రంజాన్‌ పండుగ మరునాటి నుంచీ, లేదా ఆ తదుపరి రోజు నుంచీ పాటిస్తూ ఉంటారు. వరుసగా ఆరు రోజులు చేస్తూ ఉంటారు. కానీ ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడూ, వీలు కానప్పుడూ విరామం తీసుకొని కూడా ఈ ఉపవాసాలు చేయవచ్చు. అయితే షవ్వాల్‌ మాసం పూర్తయ్యే లోపున వీటిని ముగించాలి. 


‘‘ఎవరయితే, రంజాన్‌ ఉపవాసాలు చేసి, ఆ తరువాత షవ్వాల్‌ నెలలో ఆరు ఉపవాసాలు చేస్తారో, వారు ఏడాదంతా ఉపవాసంలో ఉన్నట్టే’’ అని దైవప్రవక్త మహమ్మద్‌ (హదీస్‌ గ్రంథం) స్పష్ట్టం చేశారు. 


సాయిమద్దహర్‌ (ఎల్లప్పుడూ ఉపవాసం పాటించడం) గురించి హజ్రత్‌ ముస్లిమ్‌ ఖురైషీ అడిగిన ప్రశ్నకు దైవ ప్రవక్త జవాబు ఇస్తూ, ‘‘రంజాన్‌ ఉపవాసాలతో పాటు తరువాత (షవ్వాల్‌) నెలలోని (ఆరు రోజుల) ఉపవాసాలు పాటించు. అలాగే బుధవారం, గురువారం కూడా ఉపవాసాలు చెయ్యి. ఇలా చేస్తే సదా ఉపవాసాలు పాటించేవాడిగా పరిగణన పొందుతావు’’ అని చెప్పారు. (హదీస్‌ గ్రంథం) 


దీని ప్రకారం, రంజాన్‌ మాసంలో అన్ని రోజులూ ఉపవాసం చేస్తే పది నెలల పుణ్యం వస్తుంది. తరువాత షవ్వాల్‌ మాసంలో ఆరు రోజులు ఉపవాసం ఉంటే పదింతలు, అంటే అరవై రోజుల పుణ్యం లభిస్తుంది. ఇవన్నీ కలిపితే, పన్నెండు మాసాలు... అంటే ఏడాది పాటు ఉపవాసం ఉన్న పుణ్య ఫలాన్ని పొందుతారు. అంతేకాకుండా, షవ్వాల్‌ మాసంలో ఉపవాసాలు ఎందుకు చేయాలో మత గురువులు (ఉలేమాలు) వివిధ సందర్భాలలో వివరణ ఇచ్చారు. దాని ప్రకారం... రంజాన్‌ మాసంలో చేసిన ఉపవాసాల్లో ఏవైనా పొరపాట్లు జరిగినట్టయితే, షవ్వాల్‌లో చేసే ఆరు ఉపవాసాల ద్వారా ఆ పొరపాట్లను అల్లాహ్‌ మన్నిస్తాడు. ‘ఫర్జ్‌’ నమాజులలో ఏర్పడిన లోపాలను భర్తీ చేస్తాడు. కాబట్టి, ఈ కొత్త నెలలో ఆరు ఉపవాసాలతో దైవానుగ్రహం పొందుదాం!

-మహమ్మద్‌ వహీదుద్దీన్‌


Advertisement
Advertisement
Advertisement