Abn logo
Sep 24 2021 @ 00:00AM

నిగ్రహంతోనే పరిపూర్ణత

ఆనందం కలిగితే ఉప్పొంగిపోయే మనుషులు ఏ చిన్న కష్టం ఎదురైనా... అది తనకు మాత్రమే వచ్చినట్టు బాధపడిపోతారు. కొందరిలో ఈ స్పందనలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు గుండె ఆగిపోయేంత ఉద్వేగాలకు వారు లోనవుతూ ఉంటారు. ఎక్కువగా సంతోషం వచ్చినా, తీవ్రమైన మానసిక వేదన కలిగినా ఇలాంటి భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి.


‘‘అతి తెలివితక్కువైన, అతి నీచమైన రెండు విషయాలను నేను బహిష్కరించాను. అవి ఏమిటంటే... నాకు ఏదైనా అనుకూలంగా జరిగినప్పుడు ఆనందించడం, ఏదైనా ఆపద ఎదురైనప్పుడు విచారించడం’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ చెప్పారు. ‘‘ఏ ఆపద వచ్చి పడినా బాధపడకుండా (సహనంతో) ఉండాలి. దేవుడు మీకు ఏ భాగ్యం అనుగ్రహించినా మిడిసి పడకూడదు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ ఉపదేశించారు. 


కాబట్టి ఎక్కువ ఆనందించే సందర్భాల్లో, ఎక్కువ విషాదం ఎదురైన సందర్భాల్లో మన ఉద్రేకాలను అదుపులో పెట్టుకోవాలి. ఈ రెండు సమయాల్లో నిగ్రహంగా ఉన్న వాడే పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలిగినవాడిగా పరిగణన పొందుతాడు. అలాంటి వ్యక్తే జీవితంలో శాంతిని, ప్రశాంతతను, సుఖ సంతోషాలనూ, సంతోషాన్ని, విజయోత్సాహాన్ని పొందగలడు. ఆత్మానందాన్ని అనుభవించగలడు. కానీ లోకంలో ఇలాంటివారు ఎక్కువగా కనిపించరు. సంతోషానికి పొంగిపోతూ, ఆడంబరాలను ప్రదర్శిస్తూ, ఉద్రేకాలకు లోనవుతూ, సంతృప్తి లేకుండా బతుకుతారు. సంపద ఉన్నప్పుడు లోభిగా ఉంటారు.


నిర్మలమైన, నిశ్చలమైన ధ్యానం కలిగినవారు వ్యసనాలకు దూరంగా ఉంటారు. సంతోష, విషాద సమయాల్లో మధ్యే మార్గాన్ని అనుసరిస్తారు. వారు సంతోష సమయాల్లో దైవానికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఆపత్సమయాల్లో సహనం ప్రదర్శిస్తారు. ‘‘మీతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారిని మితంగానే ప్రేమించండి. ఎందుకంటే, రాబోయే కాలంలో మీ మధ్య పొరపాట్లు జరగవచ్చేమో. అలాగే మీతో ద్వేషంగా ఉండేవారిని మితంగానే ద్వేషించండి. ఒకవేళ రేపు వారు మీకు సన్నిహితులు కావచ్చు’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. ‘‘ఓ అల్లాహ్‌! నన్ను ధర్మబద్ధుణ్ణి చెయ్యి. నేను కోపంలో ఉన్నా లేదా ఆనంద పరవశంలో ఉన్నా ఒకే విధంగా నడుచుకొనేలా చెయ్యి అని మరో సందర్భంలో ఆయన ప్రార్థించారు.


ఉద్రేకాలకు లోనైనప్పుడైనా, మనో నిగ్రహంతో ఉన్న సమయంలోనైనా, వేరే విధమైన విషయాలలో మునిగి ఉన్నప్పుడైనా ఆ విషయాల ప్రాధాన్యాన్ని బట్టి స్పందించాలి తప్ప అతిగా స్పందించకూడదు. అలా స్పందించినప్పుడే మానసిక శాంతి చేకూరుతుంది. తెలివితేటలు, అవగాహన లాంటివి అభివృద్ధి చెందుతాయి.


నమాజ్‌కు ఆహ్వానం... అజాన్‌

‘అజాన్‌’ అంటే నమాజ్‌కు ఆహ్వానం పలుకుతూ ఇచ్చే పిలుపు. అజాన్‌ అమలులోకి రావడానికి ముందు.. దైవ విశ్వాసులందరూ నిర్ణీత సమయానికి ఒక చోట చేరుకొనేవారు. నమాజ్‌ నిర్వహించేవారు. కానీ పధ్నాలుగు వందల ఏళ్ళ కిందట.. హిజ్రీ శకం ద్వితీయ సంవత్సరంలో అజాన్‌ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ‘అజాన్‌’ అనే పదానికి అర్థం ‘ప్రకటించడం’, ‘తెలియజేయడం’ అంటే... అనునిత్యం ఫర్జ్‌ నమాజ్‌లు మొదలు కావడానికి ముందు... ప్రారంభ సమయాన్ని సూచించే సమాచారాన్ని విశ్వాసులకు తెలియజేయడాన్ని, వారిని నమాజ్‌కు పిలవడాన్ని ‘అజన్‌’ అంటారు. నిర్వహించే సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అజాన్‌కు అనేక వ్యావహారిక నామాలు ఉన్నాయి. ఫర్జ్‌ నమాజ్‌కు ముందు చేసే అజాన్‌ను ‘సున్నెతే ముఅక్కిదా’ అని, పర్వదినాల్లో ప్రార్థనలు లేదా ఖనన కార్యక్రమాల తరువాత ప్రకటించే అజాన్‌ను ‘ముక్రుహె తహ్రీమి’ అని అంటారు. ఎక్కడ ఉన్నా, ఎందరు ఉన్నా, సమయానికి లేదా సమయం మించి పోయాక చేసినా... నమాజ్‌లకు ముందు చేసే అజాన్‌ను ‘సున్నత్‌’ అని పిలుస్తారు. అజాన్‌ను ఒక పవిత్రమైన కార్యంగా, విశిష్టమైన కర్తవ్యంగా మహా ప్రవక్త మహమ్మద్‌ అభివర్ణించారు. నిత్యం అజాన్‌ వినిపించే చోట అల్లాహ్‌ దయ వర్షిస్తుందనీ, ఆ ప్రదేశంలో విపత్తులు ఉండవనీ, అజాన్‌ చెప్పే వారికి స్వర్గంలో ప్రత్యేక గౌరవం లభిస్తుందనీ ఆయన వెల్లడించారు. 


 మహమ్మద్‌ వహీదుద్దీన్‌