పక్కా. ప్లానింగ్‌

ABN , First Publish Date - 2022-09-21T05:44:53+05:30 IST

వరంగల్‌ మహానగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అవినీతి హద్దులు దాటుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. వివాదాస్పద భూములు, న్యాయస్థానాల్లో ఉన్న వాటికి కూడా ‘డోంట్‌ కేర్‌’ అంటున్నారు. డబ్బులు ముడితే అవినీతి దందాలో తగ్గేదేలే అంటున్నారు. కాసులు కొట్టు.. భవన నిర్మాణ అనుమతులు పట్టు.. అనే రీతిలో సాగుతోంది వారి వ్యవహారం.

పక్కా. ప్లానింగ్‌

అవినీతిమయంగా బల్దియా పట్టణ ప్రణాళిక విభాగం
కాసులు ముడితేనే నిర్మాణ అనుమతులు
పనికో రేటు.. రూ.30వేల పైన ఫిక్స్‌..
అపార్ట్‌మెంట్లు, కాంప్లెక్స్‌లకైతే లక్షల్లోనే వసూళ్లు
ఇస్తే ఒకే.. లేదంటే చుక్కలే..
చైన్‌మన్‌ నుంచి సీపీ వరకు వాటాలు
దందాపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే


జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), సెప్టెంబరు 20:
వరంగల్‌ మహానగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అవినీతి హద్దులు దాటుతోంది. కొందరు అధికారులు, సిబ్బంది బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. వివాదాస్పద భూములు, న్యాయస్థానాల్లో ఉన్న వాటికి కూడా ‘డోంట్‌ కేర్‌’ అంటున్నారు. డబ్బులు ముడితే అవినీతి దందాలో తగ్గేదేలే అంటున్నారు. కాసులు కొట్టు.. భవన నిర్మాణ అనుమతులు పట్టు.. అనే రీతిలో సాగుతోంది వారి వ్యవహారం. ఈ విషయంపై సాక్షాత్తూ ఎమ్మెల్యేనే బల్దియా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారంటే.. టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అక్రమ వసూళ్ల హవా ఎంతగా ఉందనేది స్పష్టం చేసింది.

పేరుకే టీఎస్‌-బీపాస్‌
భవన నిర్మాణ అనుమతుల్లో అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం టీఎ్‌స-బీపా్‌సను ప్రవేశపెట్టింది. అనుమతుల జారీ ప్రక్రియలో టౌన్‌ ప్లానింగ్‌తో పాటు పంచాయతీరా జ్‌, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌బీ, రెవెన్యూ శాఖలను కూడా స మన్వయం చేసింది. నిర్మాణ దరఖాస్తు పరిశీలనను క్షేత్రస్థాయిలో పీఆర్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ సిబ్బం ది బృందం స్థలానికి వెళ్లి పరిశీలిస్తుంది. టైటిల్‌ అండ్‌ టెక్నికల్‌ వెరిఫికేషన్‌ను టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు చేస్తారు. 21 రోజుల్లో ప్రక్రియ పూర్తయి అనుమతులు జారీ కావాల్సి ఉంది.

కానీ కొందరు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు అన్నీ తాము సర్దుబాటు చేస్తామని నిర్మాణదారుడికి చెబుతున్నారు. మిగతా శాఖల అధికారులకు వాటాలు పంచాల్సి ఉంటుందని చెప్పి రూ.30వేలకు పైగా వసూళ్లు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చైన్‌మెన్లు సంప్రదింపులు జరుపడం, వసూళ్లు చేయడం జరుగుతుంది. మిగతా శాఖలకు కూడా చెల్లించాలంటూ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు వసూలు రేట్లు పెంచడంతో నిర్మాణదారులు ఎంత అడిగినా చెల్లించక తప్పడం లేదు. టీఎస్‌ బీ-పాస్‌ వరం అనుకుంటే సిబ్బంది కక్కుర్తి మరో రకంగా నిర్మాణదారులకు శాపంగా మారింది. ఇక అపార్ట్‌మెంట్లు, బడా షాపింగ్‌ కాంప్లెక్స్‌లకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు లక్షల్లో రేట్లు ఫిక్స్‌ చేసి వసూళ్లకు పాల్పడుతున్నారు.

ఇవ్వకుంటే అంతే..
టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బందికి లంచాలు ముడితే 21 రోజులకు ముందే అనుమతులు జారీ అవుతాయి. లేదంటే నెలల తరబడి నిర్మాణదారుడు అధికారులు చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిందే. 2019 నూతన మునిసిపల్‌ చట్టం మేరకు టీఎ్‌స-బీపాస్‌ విధానంలో 21 రోజుల్లో అనుమతులు జారీ కావాలి. లేని పక్షంలో డీమ్ట్‌ టూ అప్రూవల్‌ ప్రకారం పర్మిషన్‌ లభించినట్లే. కానీ సిబ్బంది అనేక అడ్డంకులు స్పష్టించడం, చివరకు చేసేది లేక నిర్మాణదారుడు చెల్లించుకోని పరిస్థితి ఏర్పడుతుంది.

లక్షల్లో వసూళ్లు
కొందరు ఎలాంటి అనుమతులు పొందకుండానే అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నిర్మాణాలకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు లక్షల్లో వసూలు చేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారుల అవినీతి వల్ల చెరువు శిఖం భూములు, నాలా స్థలాలను అక్రమించి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక ఒక అంతస్థుకు మాత్రమే నిర్మాణదారుడు అనుమతులు తీసుకొని డబ్బులు ముట్టజెప్పి అక్రమంగా పైఅంతస్తులు నిర్మిస్తున్నారు.

కోర్టులో ఉన్నా..

టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది హద్దులు దాటి వసూళ్లకు పాల్పడుతున్నారు. వివాదాస్పదంగా ఉండి న్యాయస్థానాల్లో ఉన్న స్థలాల్లోనూ అనుమతులు జారీచేస్తున్నారు. వరంగల్‌ నాయుడు పెట్రోల్‌ పంపు వద్ద గల ఓ స్థలం కేసు న్యాయస్థానంలో ఉంది. కేసు ఇంకా తేలక ముందే టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు అనుమతులు జారీ చేశారు. దీనిపై బల్దియాకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయంపై బల్దియా టౌన్‌ ప్లానింగ్‌ ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు పెల్లుబికాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారులకు చేతులు తడిపితేనే అనుమతులు జారీ  అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఎమ్మెల్యే ఫిర్యాదు
టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది అవినీతిపై సాక్షాత్తు వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ బల్దియా ప్రధాన కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేశారు. మేయర్‌, కమిషనర్‌కు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్ల చేతి వాటాన్ని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ వ్యవహారంపై కమిషనర్‌ ప్రావీణ్య ఉన్నతాధికారిని నిలదీశారు. ఓ బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినీతి భాగోతం రచ్చకెక్కడంపై సిటీ ప్లానర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెను వెంటనే చైన్‌మెన్ల నుంచి బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆపై అధికారుల వరకు కమిషనర్‌ అంతర్గత బదిలీలు జరిపారు. అయినా వసూళ్ల పర్వం కొనసాగుతూనే ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2022-09-21T05:44:53+05:30 IST