మాట్లాడుతూన్న సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ
సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ
మధ్యాహ్నం 3 గంటలకు యాత్రకు శ్రీకారం
సమష్టి కృషితో విజయవంతం చేద్దామని పిలుపు
సింహాచలం, జూలై 1: వరాహలక్ష్మీనృసింహ స్వామి కొలువుదీరిన సింహ‘గిరి ప్రదక్షిణ’ ఈనెల 12న మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమ వుతుందని,ఇందుకు అవసరమైన పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో మల్లాది వెంకట సూర్యకళ తెలిపారు. దేవస్థానం పాలకమండలి సభ్యులు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులు, దేవస్థానం అధికారులతో స్థానిక కల్యాణ మండపం లో శుక్రవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్ ప్రభావం కారణంగా గడచిన రెండేళ్లుగా గిరి ప్రదక్షిణ జరగలేదన్నారు. అందువల్ల ఏడాది ఉత్స వానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళిక, సమష్టి కృషితో విజయవంతం చేద్దామని కోరారు. యాత్రసాగే 32 కిలోమీటర్ల దారిలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ శాఖల సమన్వయం తో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలి పారు. మధ్యాహ్నం 3 గంటలకు తొలిపావంచా వద్ద ప్రత్యేక పుష్పరథానికి అనువంశిక ధర్మకర్త జెండా ఊపి దేవస్థానం ప్రదక్షిణకు శ్రీకారం చుడతారని తెలిపారు.
ఉత్సవం సందర్భంగా 12, 13 తేదీలలో సింహగిరికి మెట్లమార్గంలో వెళ్లేందుకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. మార్గం పొడవునా 25 స్టాల్స్‌ను ఏర్పాటు చేసి వైద్యం, మంచినీటి సదుపాయం కల్పిస్తా మని తెలిపారు. మొత్తం 210 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుతోపాటు పారిశుధ్య నిర్వహణ చేపడతామన్నారు.
శాంతిభద్రతల ఏసీపీ శరత్‌కుమార్‌రాజు, ట్రాఫిక్ ఏసీపీ పి.పెంటారావులు మాట్లాడుతూ దారిపొడవునా భక్తుల భద్రత, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టి.పి.రాజగోపాల్ మాట్లాడుతూ ఈనెల 12, 13 తేదీలలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 12న సింహగిరికి రాత్రి చేరుకునే భక్తులకు 10గంటల వరకు దర్శనాలు కల్పిస్తామని తెలిపారు. 13న మధ్యాహ్నం 4గంటల వరకు దర్శనాలు కల్పించి ఢిల్లీ ఉత్సవాన్ని జరుపుతామని చెప్పారు. సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.