బాబోయ్‌...

ABN , First Publish Date - 2020-07-12T09:36:43+05:30 IST

జిల్లాలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూ జరుగుతున్న కొవిడ్‌ పరీక్షలు... వస్తున్న

బాబోయ్‌...

గత పది రోజుల్లో గణనీయం పెరిగిన పాజిటివ్‌ కేసుల శాతం

15,029 మందికి కొవిడ్‌ పరీక్షలు

1,055 పాజిటివ్‌ కేసులతో 7.02 శాతం మందికి వైరస్‌

మార్చిలో 2.55 శాతం... ఏప్రిల్‌లో 0.13, మేలో 0.46 శాతమే!

జూన్‌లో 1.75 శాతానికి పెరుగుదల

జిల్లాలో ఓవరాల్‌ పాజిటివ్‌ రేటు 2.11 శాతం

మొత్తంమీద 50.12 శాతంతో ఆశాజనకంగానే రికవరీ 

మరణాలు 0.76 శాతం


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) : జిల్లాలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా పాజిటివ్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూ జరుగుతున్న కొవిడ్‌ పరీక్షలు... వస్తున్న ఫలితాలతో పోలిస్తే పాజిటివ్‌ల శాతం పెరుగుతుండడం కరోనా వైరస్‌ తీవ్రతకు అద్దం పడుతున్నది. ముఖ్యంగా మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలలతో పోలిస్తే జూలైలో పాజిటివ్‌ శాతం భారీగా ఉండడం అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నది. దేశ పాజిటివ్‌ సగటుతో పోలిస్తే జిల్లాలో ఎక్కువ వుండడం గమనార్హం.

 

జిల్లాలో మొట్టమొదటి పాజిటివ్‌ కేసు మార్చి 19వ తేదీన నగరంలోని అల్లిపురంలో నమోదైంది. ఆ నెలలో మొత్తం ఆరు కేసులు బయటపడ్డాయి. మార్చిలో నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలతో పోలిస్తే పాజిటివ్‌ రేటు 2.55 శాతంగా ఉంది. ఏప్రిల్‌, మే నెలలో పాజిటివ్‌ రేటు ఒక శాతానికి లోపే వుండడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. అయితే జూన్‌ నెలలో లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించడంతో పాజిటివ్‌ కేసులు పెరిగాయి. ఆ నెలలో 787 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, రేటు 1.75 శాతంగా వుంది. జాతీయ, రాష్ట్రస్థాయి సగటులతో పోలిస్తే ఇది కొంత తక్కువే. అయితే జూలై ప్రారంభం నుంచి పాజిటివ్‌ కేసులు భారీగా నమోదు అవుతుండడంతో పాజిటివ్‌ రేటు కూడా అదే స్థాయిలో వుంది. జూలై 10వ తేదీనాటికి 15,029 మంది వైరస్‌ అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా 1,055 మందికి పాజిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి.  పాజిటివ్‌ రేటు 7.02 శాతంగా నమోదైంది. జిల్లాలో ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షలు(92,625), నమోదైన పాజిటివ్‌ కేసులతో(1,955) బేరీజు వేస్తే పాజిటివ్‌ రేటు 2.11 శాతంగా వుంది.  


మెరుగ్గా రికవరీ రేటు.. 

జిల్లాలో కరోనా వైరస్‌ బారినపడి, చికిత్స పొందుతూ కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంది. శుక్రవారంనాటికి వివిధ కొవిడ్‌ ఆస్పత్రుల నుంచి 980 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రికవరీ రేటు 50.12 శాతంగా నమోదైంది. డిశ్చార్జ్‌ రేటు 50 శాతం  దాటడం ఇదే మొదటిసారి. ఇదే సమయంలో 960 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 15 మంది మృతిచెందారు. మరణాల రేటు 0.76 శాతంగా ఉంది. 


నెల పరీక్షించిన పాజిటివ్‌ పాజిటివ్‌ 

నమూనాలు కేసులు శాతం

మార్చి 235 6 2.55

ఏప్రిల్‌ 13,560 18 0.13

మే 18,977 89 0.46

జూన్‌ 44,824 787 1.75

జూలై 15,029 1,055 7.02

(10వ తేదీనాటికి)

Updated Date - 2020-07-12T09:36:43+05:30 IST