బ్యాక్ బెంచ్..!

ABN , First Publish Date - 2022-07-01T14:58:23+05:30 IST

పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా వెనుకంజలో నిలిచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరిస్థానానికి పరిమితం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు

బ్యాక్ బెంచ్..!

 79.63 శాతం విద్యార్థులు పాస్‌ 

 అత్తెసరు ఫలితాలతో ఆనవాయితీ చాటిన హైదరాబాద్‌

 మొత్తం 73,957 మందిలో 15,068 వేల మంది ఫెయిల్‌

  రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణత 90.04 శాతం

 86.31 శాతంతో మేడ్చల్‌ జిల్లా  

 పలు చోట్ల బాలికలు, మరికొన్ని చోట్ల బాలురు ముందంజ


హైదరాబాద్‌ సిటీ: పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా వెనుకంజలో నిలిచింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో చివరిస్థానానికి పరిమితం కావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం, ఉపాధ్యాయుల బాధ్యతా రాహిత్యంతో ఫలితాల్లో అట్టడుగుకు చేరడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కొంతకాలంగా అదే తీరు..

పదో తరగతి ఫలితాల విషయంలో హైదరాబాద్‌ జిల్లా కొంతకాలంగా కొనసాగిస్తున్న ఆనవాయితీ పునరావృతం కావడం చర్చనీయాంశంగా మారింది. కరోనాతో వరుసగా రెండేళ్లుగా పరీక్షలు రాయకుండా 8,9 తరగతులను దాటిన విద్యార్థులు ఈ ఏడాది రాశారు. దీంతోపాటు గతంలో ఒక్కో సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ను నిర్వహించారు.  కరోనాతో సకాలంలో సిలబస్‌ పూర్తికాకపోవడంతో ఒక్కో పేపర్‌కు  80మార్కుల చొప్పున, ఇంటర్నల్‌ కింద 20 మార్కులను కేటాయించారు. అయితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టులను ఎదుర్కొనే విషయంలో సంబంధిత ఉపాధ్యాయులు తగిన విధంగా శిక్షణ ఇవ్వకపోవడంతోపాటు పర్యవేక్షించే వారు కరువవడంతో ఫలితాలపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల కంటే అధ్వానంగా ఫలితాలు రావడంపై విద్యావేత్తలు ఆక్షేపిస్తున్నారు. కాగా, టెన్త్‌ ఫలితాలపై ఓ జిల్లా అధికారిని సంప్రదిస్తే జిల్లా వెనకబడడం కొత్తేమీ కాదని.. పదేళ్లుగా ఇది కొనసాగుతుందని, దీనిని తామేమీ మార్చలేమని చెప్పడం గమనార్హం.  రాష్ట్రంలో 11,000 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించగా.. మూడు జిల్లాల్లో 3,200 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.


ప్రభుత్వ పాఠశాలల్లో 10/10 

 మలక్‌పేటలోని ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్‌ హైస్కూల్‌కు చెందిన కె.నందిని, ఎం. శ్రావ్య 

  రాజభవన్‌ పాఠశాలకు చెందిన అరుణ, సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ రెసిడెన్షియల్‌కు చెందిన పులి అంజలి, అబ్దుల్లాపూర్‌మెట్‌ రంగన్నగూడ ప్రభుత్వ  పాఠశాలకు చెందిన శ్రావణి.

 మైలార్‌దేవ్‌పల్లి జడ్పీ హైస్కూల్‌కు చెందిన అఫ్సానా రహమాన్‌, మౌలాలిలోని సికింద్రాబాద్‌ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన జె.నవ్య, కె.కావ్య. హిమాయత్‌నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన డి.విష్ణుప్రియ  


సత్తా చాటిన రాజ్‌భవన్‌ స్కూల్‌ 

 పదిలో 76శాతం పాస్‌.. 

 18మంది విద్యార్థులకు.. 9 జీపీఏ కంటే అధికం..

బేగంపేట: పదో తరగతి ఫలితాల్లో రాజ్‌భవన్‌ స్కూల్‌ విద్యార్థులు సత్తా చాటారు. 18 మందికి పైగా విద్యార్థులు 9కి పైగా జీపీఏ సాధించారు. విద్యార్థిని కె.అరుణ 10 జీపీఏ సాధించి స్కూల్‌ టాపర్‌గా నిలిచారు. ఈ ఏడాది 127మంది పరీక్షలు రాయగా 97మంది ఉత్తీర్ణులయ్యారు. అరుణకుమార్‌, మౌనిక, కౌశిక్‌లు (9.7జీపీఏ) సాధించారు. 


ప్రతిభ చాటిన బధిరులు

చాంద్రాయణగుట్టలోని ఆశ్రయ్‌ ఆకృతి బధిరుల ప్రత్యేక పాఠశాల విద్యార్థులు టెన్త్‌ పరీక్షల్లో ప్రతిభను చాటారు. పది మంది పరీక్షలు రాయగా, ఆరుగురు ఉత్తీర్ణులయ్యారు. బధిరులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమించి విద్యాబోధన చేశారు. ఈ పాఠశాల మొదటి బ్యాచ్‌లోనే  మంచి ఫలితాలు సాధించారు. వారిలో మహీన్‌ అనే విద్యార్థిని 9 జీపీఏతోపాటు మరో ఇద్దరు 8.8 జీపీఏ, 8.5 జీపీఏ సాధించారు.

Updated Date - 2022-07-01T14:58:23+05:30 IST