వీడని ‘అంటరాని తనం’!

ABN , First Publish Date - 2022-05-10T18:04:31+05:30 IST

అంటరానితనాన్ని పారదోలుతున్నామంటూ ద్రావిడ పార్టీలు చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనా?.. సామాజిక అంతరాన్ని ఆమడదూరంలో

వీడని ‘అంటరాని తనం’!

ఇప్పటికీ 445 గ్రామాల్లో జాడ్యం?

మదురై జిల్లాలో ఎక్కువ.. చెన్నైలో తక్కువ

ఆర్టీఐ ద్వారా వెల్లడి


చెన్నై/పెరంబూర్‌: అంటరానితనాన్ని పారదోలుతున్నామంటూ ద్రావిడ పార్టీలు చెబుతున్న మాటలు ఉత్తుత్తివేనా?.. సామాజిక అంతరాన్ని ఆమడదూరంలో పెడతామంటూ ఆ పార్టీలు చేసే ప్రకటనలు ఒట్టి డొల్లేనా?.. ఇటీవల సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వెల్లడైన విషయాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికీ 445 గ్రామాల్లో అంటరానితనం, రెండు గ్లాసుల విధానం అమలులో వుండడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. అంటరానితనం అధికంగా ఉన్న గ్రామాలు మదురై జిల్లాలో అధికంగా ఉండగా, రాజధాని చెన్నై జిల్లాలో తక్కువగా వున్నాయి. మదురైకి చెందిన సమాజసేవకుడు ఎస్‌.కార్తీ ఆర్టీఐ ద్వారా పోలీసుశాఖలోని న్యాయ, మానవ హక్కుల విభాగాన్ని ఆశ్రయించగా, దిమ్మె తిరిగే వాస్తవాలు వెల్లడయ్యాయి. 


రాష్ట్రంలో 445 గ్రామాల్లో ఇప్పటికీ అంటరానితనం వుందని, అయితే వాటిల్లో 341 గ్రామాల్లో అంటరానితనం ఘటనలు నియంత్రణలో ఉన్నాయని పోలీసుశాఖ తెలిపింది. 2021 గణాంకాల ప్రకారం అంటరానితనానికి సంబంధించిన ఘటనలు ఏఏ జిల్లాల్లో ఎన్నెన్ని నమోదయ్యాయో కూడా వెల్లడైంది. మదురై-43, విల్లుపురం-25, తిరునల్వేలి-24, వేలూరు-19, తిరువణ్ణామలై-18, తిరుచ్చి, సేలం, దిండుగల్‌, తంజావూరు జిల్లాల్లో 16 చొప్పున, కోయంబత్తూర్‌, కడలూరుల్లో తలా 15, తెన్‌కాశి, తూత్తుకుడి, శివగంగల్లో తలా 14, ఈరోడ్‌లో 13, తిరుప్పూర్‌, తేని, విరుదునగర్‌ల్లో తలా 12, పెరంబలూరులో 11, రామనాధపురం జిల్లాలో 10 ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలో ఒకే ఒక గ్రామంతో చెన్నై జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇన్ని గ్రామాల్లో ఇప్పటికీ కనిపిస్తున్న అంటరానితం ఘటనలను అడ్డుకొనేలా చేపట్టిన చర్యలేంటి? అనే ప్రశ్నకు, 2021లో అత్యధికంగా 597, ప్రస్తుత 2022లో 212 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు సమాధానం వచ్చింది. 


అంటరానితనం నిర్మూలనకు పోలీసుశాఖలో న్యాయం, మానవ హక్కుల విభాగం ఏర్పాటుచేసినా ఎలాంటి నిధులు కేటాయించలేదని, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ప్రభుత్వానికి పంపి నిధులు పొంది సాయం అందజేస్తున్నట్లు మరో ప్రశ్నకు సమాధా నమిచ్చారు.. ఈ విషయమై సమాజసేవకుడు కార్తీ మాట్లాడుతూ.. నేషనల్‌ క్రిమినల్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం 2009 నుంచి 2018 వరకు ఎస్సీ, ఎస్టీ అంటరానితనం హింస నిరోధక చట్టం ప్రకారం నమోదయ్యే కేసుల సంఖ్య 27.3 శాతం పెరిగిందన్నారు. అలాగే, అంటరానితనం కనిపించే గ్రామాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అంటరానితనం నిర్మూలనకు చర్యలు చేప్టటడంతో పాటు బాధిత గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, బాధితులకు రూ.10 లక్షల ఆర్ధికసాయం అందించాలని కోరారు. అలాగే, అంటరానితనం నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలుచేయాలని కోరారు. 

Read more