నెల గరిష్ఠానికి రూపాయి

ABN , First Publish Date - 2022-08-03T09:41:05+05:30 IST

దేశీయ కరెన్సీ నెల రోజులకు పైగా గరిష్ఠ స్థాయికి బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 53 పైసలు పుంజుకుంది.

నెల గరిష్ఠానికి రూపాయి

డాలర్‌తో మారకం విలువ 53 పైసలు అప్‌ 

గడిచిన 11 నెలల్లో ఇదే అతిపెద్ద లాభం 

 78.53 వద్ద స్థిరపడిన రూపీ 


ముంబై: దేశీయ కరెన్సీ నెల రోజులకు పైగా గరిష్ఠ స్థాయికి బలపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ఒక్కరోజే 53 పైసలు పుంజుకుంది. దాంతో డాలర్‌తో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.78.53కు దిగివచ్చింది. అంతర్జాతీయంగా డాలర్‌ బలహీనపడుతుండటం, దేశీయ క్యాపిటల్‌ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు మళ్లీ పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలు రూపాయి బలోపేతానికి దోహదపడ్డాయని ఫారెక్స్‌ విశ్లేషకులు తెలిపారు.  గత నెల 21న డాలర్‌-రూపాయి మారకం రేటు ఆల్‌టైం రికార్డు స్థాయి 80.06కు చేరిన విషయం తెలిసిందే. మున్ముందు సమీక్షల్లో వడ్డీ రేట్ల పెంపు తీవ్రతను తగ్గించనున్నట్లు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సంకేతాలివ్వడంతో డాలర్‌తో పాటు ఆ దేశ బాండ్‌ రేట్లు కాస్త క్రమంగా దిగివస్తుండటం రూపాయికి ఊరటనిస్తోంది. గడిచిన 4 ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి 138 పైసలు (1.73 శాతం) పుంజుకుంది. సోమవారం 79.06 వద్ద ముగిసిన ఎక్స్ఛేంజ్‌ రేటు.. మంగళవారం ట్రేడింగ్‌లో 78.96 వద్ద ప్రారంభమైంది.


ఒక దశలో 78.49 వద్దకు జారుకున్నప్పటికీ చివరికి జూన్‌ 27 నాటి స్థాయి 78.53 వద్ద స్థిరపడింది. సోమవారం ముగింపు స్థాయితో పోలిస్తే 53 పైసలు బలపడింది. ఆసియా మార్కెట్లలో భారత ఈక్విటీ, రూపాయే మెరుగైన పనితీరును కనబర్చాయని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ అన్నారు. దేశీయ ఈక్విటీ, డెట్‌ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) మళ్లీ కొనుగోళ్లు పెంచడం, డాలర్‌, క్రూడాయిల్‌ ధరలు కాస్త తగ్గడంతో పాటు సోమవారం విడుదలైన స్థూల ఆర్థికాంశాల డేటా కూడా ఆశాజనకంగా ఉండటం ఇందుకు దోహదపడిందన్నారు. మున్ముందు సెషన్లలో రూపాయి మరింత బలపడే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు 78.50 స్థాయి కంటే తగ్గితే, ఆ తర్వాత సెషన్లలో 77.60 వరకు జారుకోవచ్చని పర్మార్‌ అంచనా వేశారు.



స్వల్ప లాభాలతో సరి  

సెన్సెక్స్‌ 21 పాయింట్లు అప్‌ 

ముంబై: మంగళవారం నాడు నష్టాలతో ట్రేడింగ్‌ ఆరంభించి రోజంతా తీవ్ర ఊగిసలాటలకు లోనైన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.  దీంతో బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 20.86 పాయింట్లు పెరిగి 58,136.36 వద్ద స్థిరపడింది. నాలుగు రోజుల ర్యాలీ తర్వాత మదుపర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం ఇందుకు కారణమైంది. ఒక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 370 పాయింట్ల మేర క్షీణించింది. ఆఖరి గంటలో ఇన్వెస్టర్లు విద్యుత్‌, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఇంధన రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచడంతో సూచీలు వరుసగా ఐదో రోజూ లాభాల్లో ముగిశాయి. కాగా ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 5.40 పాయింట్ల లాభంతో 17,345.45 వద్ద నిలిచింది.

   

కాస్త తగ్గిన బంగారం 

విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర మంగళవారం నాడు రూ.289 తగ్గి రూ.51,877కు జారుకుంది. కాగా, కిలో వెండి రూ.841 తగ్గి రూ.58,480 ధర  పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాము లు) గోల్డ్‌ ఒకదశలో 1,771 డాలర్లు, సిల్వర్‌ 20.25 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. 

Updated Date - 2022-08-03T09:41:05+05:30 IST