వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వ తీరుపై అసహనం

ABN , First Publish Date - 2021-05-18T05:02:24+05:30 IST

కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై ప్రజలు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వ్యాక్సినేషన్‌లో ప్రభుత్వ తీరుపై అసహనం

వెంకటగిరి, మే 17: కరోనా వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై ప్రజలు ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు వేసుకున్నాక రెండో డోసు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కాలపరిమితిని పెంచింది. ఆ విషయం తెలియని తొలి డోసు వేసుకున్న వారు ప్రభుత్వాసుపత్రులు చుట్టూ తిరుగుతూ విసిగి వేసా రిపోతున్నారు.    45 సంవత్సరాల వయస్సు పైబడిన వారు, దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న  ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కరోనా వ్యాక్సిన్‌ వేయంచుకోవాలని ప్రభుత్వం తొలుత ఆదేశాలు జారీ  చేసింది.   వ్యాక్సిన్‌ వేసుకుంటే ప్రాణాపాయం సంభవిస్తుందనే  అపోహ, భయంతో ఎక్కువ మంది ప్రజలు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ముందుకు రాలేదు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభించడంతో కేసులతోపాటు మరణాలు పెరుగుతున్నాయి.  దాంతో ప్రజలు వ్యాక్సిన్‌పై అవగాహన పెంచుకొని  వేయించు కునేందుకు ఆసక్తి చూపారు. అదే తరుణంలో 18-45 ఏళ్ల మధ్య వారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్‌ వేస్తామని ప్రభుత్వాలు ప్రకటించాయి. వ్యాక్సిన్‌ కొరతతో వారికి వేయడం లేదు. అంతేగాక 45 ఏళ్లు నిండిన వారికి కూడా మొదటి డోస్‌ లేదంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 కొవిషీల్డ్‌ తొలి డోసు వేసుకున్న వారు రెండో డోసు  తప్పని సరిగా 28 రోజుల తరువాత వేసుకోవాలన్నారు. అది కాస్త 42 రోజులకు మార్చేశారు. ప్రస్తుతం 84 రోజులకు పెంచేయడంతో మొదటి డోస్‌ దేసుకొన్న వారు  ఈలోపు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వెంకటగిరి పట్టణంలో ప్రస్తుతం మూడు వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 200 మంది నుంచి 300 మందికి వ్యాక్సినేషన్‌ చేయాల్సి ఉంది. ప్రభుత్వం రెండో డోస్‌ కాలపరిమితిని పెంచేయడంతో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా కేవలం 10 నుంచి 20 మందికి మాత్రం వ్యాక్సిన్‌ వేస్తున్నారు. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకొని 28 రోజలు పూర్తి చేసుకొన్న వారు పట్టణంలో సుమారు 1000 మందికి పైగా ఉన్నా కాలపరిమితిని పెంచడం వల్ల వారు వ్యాక్సినేషన్‌ కోసం కేంద్రాలకు వచ్చి వెనుతిరుగుతున్నారు. ఈ విషయమై మరింత ప్రచారం చేయడంతోపాటు చైతన్య కలిగిస్తే బాగుంటుందని వారు అంటున్నారు. రాజకీయ పలుకు బడి ఉన్న వారు మాత్రం వయస్సుతో నిమిత్తం లేకుండా తమ ఇళ్ల వద్దనే వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.  కరోనా పరీక్షలను వైద్యులు, టెక్నీషియన్లు నిర్వహించాల్సి ఉండగా ఏఎన్‌ఎమ్‌లతో చేయించడం వల్ల ఫలితాలు సక్రమంగా రావడంలేదని  బాధితులు ఆరోపిస్తున్నారు. ఉన్న తాధికారుల పర్యవేక్షణ కొరవడటమే ఇందుకు కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2021-05-18T05:02:24+05:30 IST