పెట్రోధరల పెంపుపై నిరసనల వెల్లువ

ABN , First Publish Date - 2021-02-27T05:15:29+05:30 IST

కేంద్రప్రభుత్వ తీరుపై విభిన్నవర్గాల ప్రజలు రోడ్డెక్కారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలు, అదుపులేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలపై మండిపడ్డారు. వామపక్ష పార్టీలు, కార్మిక, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొన్నిప్రాంతాల్లో యజమానులు లారీలను నిలివేసి బంద్‌ పాటించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పెట్రోధరల పెంపుపై  నిరసనల వెల్లువ
ఒంగోలుకర్నూల్‌ రోడ్డులోని సాగర్‌ హోటల్‌ సెంటర్లఓ రాస్తారోకో చేస్తున్న వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు

 జిల్లావ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు

బంద్‌ పాటించిన లారీ యజమానులు

కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల బైఠాయింపు

ఉక్కు ప్రైవేటీకరణ,  ధరల పెంపుపై ఆగ్రహం

ఒంగోలు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కేంద్రప్రభుత్వ తీరుపై విభిన్నవర్గాల ప్రజలు రోడ్డెక్కారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలు, అదుపులేకుండా పెరిగిపోతున్న పెట్రో ధరలపై మండిపడ్డారు. వామపక్ష పార్టీలు, కార్మిక, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. కొన్నిప్రాంతాల్లో యజమానులు లారీలను నిలివేసి బంద్‌ పాటించారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చర్యలపై వివిధ వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు లీటరు పెట్రోలు రూ.100కు చేరిన పరిస్థితి. ఈ రెండింటికి ప్రధాన బాధ్యత అయిన కేంద్రప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక, ఇతర ప్రజాసంఘాలు శుక్రవారం పెద్దఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చాయి. జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఒంగోలులోని సాగర్‌ హోటల్‌ సెంటర్‌లో సీపీఎం, సీపీఐ, ఇతర వామపక్షాలు, ఏఐటీయూసీ, సీఐటీయూ ఇతర కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం రాస్తారోకో జరిగింది. వామపక్ష పార్టీల నాయకులు పూనాటి ఆంజనేయులు, కొండారెడ్డి, యు.ప్రకాశరావు, ఎస్‌డీ సర్దార్‌, కార్మిక సంఘాల  నాయకులు పీవీఆర్‌చౌదరి, చీకటి శ్రీనివాసరావు, రైతుసంఘాల నాయకులు చుండూరి రంగారావు, హనుమారెడ్డి, పెంట్యాల హనుమంతరావు, రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. అలాగే చీరాల, అద్దంకి, పర్చూరు, కందుకూరు, కొండపి, కనిగిరి, పామూరు, పొదిలి, దర్శి, మార్కాపురం, కంభం, గిద్దలూరు ,యర్రగొండపాలెం వంటి ప్రధాన పట్టణాలతో పాటు వివిధ మండలకేంద్రాల్లోనూ ధర్నాలు, రాస్తారోకోలను నిర్వహించారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చర్యలను తక్షణం ప్రభుత్వం నిలిపివేయాలని, అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న పెట్రో ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్‌ చేశారు. మరోవైపు పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వివిధ రవాణా, వ్యాపారసంఘాల పిలుపు మేరకు జిల్లాలో లారీ యజమానులు బంద్‌ పాటించారు. ఒంగోలుతో పాటు పలు ఇతర ప్రాంతాల్లోనూ అధికశాతం లారీలు స్టాండ్లకే పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా అఖిల భారత రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద ఎన్‌జీవో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. మధ్యాహ్న భోజన విరామ సమయంలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే.శరత్‌బాబు, ఆర్‌సీహెచ్‌ కృష్ణారెడ్డిల నేతృత్వంలో ఈ నిరసన జరగ్గా పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిలిపేయాలని, పెండింగ్‌ ఉన్న డీఏలు విడుదల, ఐదేళ్లకు ఒకసారి పీఆర్‌సీ అమలు విధిగా చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్‌ చేశారు. 


పెట్రో బంద్‌

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి కేంద్రప్రభుత్వం రవాణారంగంపై తీవ్రభారం మోపిందని దేశవాప్తంగా లారీ యూనియన్‌ పిలుపుమేరకు ఒంగోలులో శుక్రవారం బంద్‌ నిర్వహించారు. స్థానిక లారీ యూనియన్‌ కార్యాలయం వద్ద ఒకరోజు బంద్‌లో భాగంగా అన్ని లారీలను నిలిపివేశారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని లారీ యజమానులు డిమాండ్‌ చేశారు.

 


Updated Date - 2021-02-27T05:15:29+05:30 IST