కొల్లేరు కనువిందు

ABN , First Publish Date - 2022-08-15T06:30:18+05:30 IST

కొల్లేరుకు జలకళ వచ్చింది. ఎటు చూసినా నీటితో కళకళలాడు తోంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురిచేస్తుంది.

కొల్లేరు కనువిందు
ఆదివారం కొల్లేరు పక్షుల కేంద్రం వీక్షించేందుకు వచ్చిన పర్యాటకులు

సందర్శకులతో పక్షుల కేంద్రం కిటకిట

భారీగా తరలివచ్చిన పర్యాటకులు

ఎటుచూసినా నీటితో పరవళ్లు..

ఎగువ నుంచి వేల క్యూసెక్కుల నీరు..

కైకలూరు, ఆగస్టు 14 : కొల్లేరుకు జలకళ వచ్చింది. ఎటు చూసినా నీటితో కళకళలాడు తోంది. పర్యాటకులను, కొల్లేరు గ్రామాల ప్రజలను పులకింతకు గురిచేస్తుంది. ఇటీవల వేసవిలో ఏడారిని తలపించేలా ఎండిపోయిన కొల్లేరుకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు వేల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరడంతో నీటితో నిండుగా ఉంది. పర్యాట కులను ఆకట్టుకునే పక్షుల కేంద్రం సైతం నీటితో నిండిపోయింది. సరస్సులోకి కొత్తనీరు రావడంతో పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది. వేసవిలో పక్షుల కేంద్రానికే పరిమితమైన విదేశీ వలస పక్షులు ఎటు చూసినా నీరు ఉండడంతో ఎక్కడ చూసినా విదేశీపక్షులతో పాటు స్వదేశీ పక్షులు కను విందు చేస్తున్నాయి. 77,136 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సులోకి సుమారు 61 చిన్న, పెద్ద డ్రెయిన్‌ల ద్వారా నీరు చేరుతోంది. పక్షుల కేంద్రానికి ఏలూరు రూరల్‌ మండలం కోమటిలంక గ్రామానికి మధ్యలో ఉన్న పోలరాజ్‌ డ్రెయిన్‌ ద్వారా వచ్చేనీరు కొల్లేరు సరస్సులో కలిసేచోట ఉరకలు వేస్తూ నీరు పరవళ్లు తొక్కుతోంది. .కైకలూరు నుంచి ఏలూరు వెళ్ళే ఆర్‌అండ్‌బీ రహదారిలో పెద్ద, చిన్న యడ్లగాడిలో రహదారి పొడవునా కొల్లేరు సరస్సు నీటితో కళకళలాడుతూ ప్రయాణి కులను ఆకర్షిస్తున్నది. కైకలూరు మండలం నత్తగుళ్ళ పాడు, చటాకాయ, సర్కార్‌ కాల్వ, పెంచికలమర్రు, వడ్లగూటితిప్ప గ్రామాల్లో ఎక్కడ చూసినా కొల్లేరు కనువిందు చేస్తోంది. కొల్లేరు సరస్సులోకి  అటవీశాఖ అధికారులు కైకలూరు మండలం ఆటపాక పక్షుల కేంద్రంలో బోటుషికారు ప్రారంభించడంతో ఆదివారం పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోటులో షికారు చేస్తూ పక్షులను, కొల్లేరు అందాలను తిలకించారు. అలల ఎగిసి పడుతుంటే పిల్లల ఆనందాలకు అవధుల్లేకుండా పోయియి. పక్షుల కేంద్రం గట్టుపై నుంచి కొల్లేరు అందాలను, పక్షులను ఆసక్తిగా తిలకించారు. 


 

Updated Date - 2022-08-15T06:30:18+05:30 IST