అప్రమత్తత అవసరం!

ABN , First Publish Date - 2020-04-14T05:36:14+05:30 IST

కరోనా వైరస్‌ ప్రభావం కొందరి మీద అధికం. ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చికిత్స తదనంతరం సైతం క్రమం తప్పక వైద్యుల పర్యవేక్షణలో...

అప్రమత్తత అవసరం!

కరోనా వైరస్‌ ప్రభావం కొందరి మీద అధికం. ఊపిరితిత్తులు, గుండె సంబంధ సమస్యలు ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలి. చికిత్స తదనంతరం సైతం క్రమం తప్పక వైద్యుల పర్యవేక్షణలో మెలగుతూ ఉండాలి.


కొవిడ్‌ - 19 స్వభావం, తీవ్రత, చికిత్సకు స్పందించే గుణాల గురించి ఓ కొలిక్కి రాలేని పరిస్థితి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ గురించిన పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నప్పటికీ, వెలుగులోకి వస్తున్న పలు ఫలితాలతో కొన్ని విషయాలు స్పష్టం అవుతున్నాయి. అవేంటంటే...


ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం...

కొవిడ్‌ - 19 ఇన్‌ఫెక్షన్‌ సోకినంత మాత్రాన ప్రతి ఒక్కరికీ వెంటిలేటర్‌ అవసరం పడకపోవచ్చు. అయితే ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై న్యుమోనియా స్థితికి చేరుకున్న వారికి వెంటిలేటర్‌ తోడ్పాటు అందించడం అవసరం. అయితే కరోనాతో సహా ఇతర ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌లోనైనా వెంటిలేటర్‌ మీద ఆధారపడే స్థాయికి చేరుకున్నప్పుడు, ఊపిరితిత్తులు సాగే గుణాన్ని కొంత కోల్పోవడం సహజం. ఇలాంటివారికి ఊపిరితిత్తులు సున్నితంగా మారి, తేలికగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ముందు నుంచీ ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వారు కూడా కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత, క్రమం తప్పక వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. కరోనా ఒక్కటే కాదు, స్వైన్‌ ఫ్లూ బారిన పడిన వాళ్లకూ ఇలాంటి ఇబ్బందులు తప్పలేదు.


గుండె జబ్బులు ఉంటే?

గుండె జబ్బులు ఉన్న వారికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు గుండె చుట్టూ ఉండే రక్షణ పొర, మయోకార్డియమ్‌ బలహీనపడి ‘వైరల్‌ మయోకార్డయిటిస్‌’ అనే ఇబ్బంది తలెత్తుతుంది. గుండె కండరాలు కూడా ఇన్‌ఫెక్షన్‌కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కోవకు చెందిన వారు కరోనా చికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత క్రమం తప్పక గుండె వైద్యులను కలుస్తూ, సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. 


మరోసారి వచ్చినా తీవ్రత తక్కువే!

సాధారణంగా ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ సోకినా, దానికి వ్యతిరేకంగా శరీరంలో యాంటీబాడీస్‌ తయారవుతాయి. ఇవి వ్యాధికారక సూక్ష్మక్రిములతో పోరాడి వాటిని సంహరిస్తాయి. ఒకసారి ఇలా శరీరం తనంతట తానుగా ఇన్‌ఫెక్షన్‌తో పోరాడే శక్తి సమకూర్చుకున్న తర్వాత, అదే ఇన్‌ఫెక్షన్‌ రెండోసారి దాడి చేసినా, ప్రభావం అంతగా ఉండదు. కరోనా విషయంలోనూ ఇలాగే జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్ధృతంగా వ్యాప్తి చెందిన ఈ వైరస్‌ అంతరించిపోయి, భవిష్యత్తులో తిరిగి విజృంభించినా ఇంత ప్రభావం ఉండకపోవచ్చు. 


విండో పీరియడ్‌ ఎన్ని రోజులు?

కరోనా చికిత్స తర్వాత తిరిగి రెండోసారి పాజిటివ్‌ ఫలితం వస్తే, వైరస్‌ రెండోసారి సోకిందనుకుంటే పొరపాటు. అప్పటికే శరీరానికి సోకిన వైరస్‌ గనక చికిత్సతో పూర్తిగా అదుపులోకి రానప్పుడు, విండో పీరియడ్‌ అయిన 14 రోజుల వ్యవధి దాటిన తర్వాత కూడా పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఇలాంటి ఫలితాలను బట్టి ఇప్పటివరకూ భావిస్తున్న విండో పీరియడ్‌ పరిధి 14 రోజుల కంటే ఎక్కువ అని గ్రహించాలి. ప్రపంచంలో కరోనా తొలిసారిగా విజృంభించిన ఉహాన్‌ ప్రాంతంలో కూడా తాజాగా ఇన్‌ఫెక్షన్‌ నయమైన వ్యక్తులకే తిరిగి పాజిటివ్‌ ఫలితం వస్తున్న కొన్ని కేసులు బయల్పడుతున్నాయి. వీరిలో రెండవసారి లక్షణాలు కనిపించవు. దీన్ని బట్టి ఈ వైరస్‌ విండో పీరియడ్‌ను కచ్చితంగా నిర్థారించలేని పరిస్థితి. అయితే రెండవసారి ఈ వైరస్‌ బారిన పడినా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమవుతున్న సందర్భాలు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా నమోదు కాలేదు.


డాక్టర్‌ నాగరాజు బోయిళ్ల,

సీనియర్‌ పల్మనాలజిస్ట్‌


Updated Date - 2020-04-14T05:36:14+05:30 IST