భారీ వర్షంతో జనం కష్టాలు

ABN , First Publish Date - 2021-11-29T05:17:01+05:30 IST

మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని కొత్తబజారు, పాతబజారు, మెయిన్‌ రోడ్డు తదితర వీధి రోడ్లు జలమయం అయ్యాయి.

భారీ వర్షంతో జనం కష్టాలు
రైల్వేకోడూరు మండలంలో పొంగుతున్న వరద నీరు

వీధులు జలమయం, బాలపల్లి వద్ద కొండల నుంచి పొంగిన వరద నీరు

పరవళ్లు తొక్కిన గుంజననది, మూడు ఇళ్లు కూలిపోయిన వైనం  వాగేటికోన రిజర్వాయర్‌ పరిశీలన చేసిన అధికారులు

రైల్వేకోడూరు, నవంబరు 28: మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. పట్టణంలోని కొత్తబజారు, పాతబజారు, మెయిన్‌ రోడ్డు తదితర వీధి రోడ్లు జలమయం అయ్యాయి. అధిక వర్షంతో గుంజననది పరవళ్లు తొక్కింది. నరసరాంపురంలో రెండు ఇళ్లు, బలజవీధిలో ఒక్క ఇల్లు కూలిపోయింది. అధికారులు నదీపరివాహక ప్రాంతాలను పరిశీలించి సహాయక చర్యలు తీసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేశారు. గాంధీనగర్‌లో రెండు గుడిసెల్లో నివాసం ఉన్న వారిని సమీపం లోని ఒక చర్చి లోకి తరళించారు. అదే విధంగా నరసరాంపురంలో చూస్తుండగానే ఇళ్లు కళ్ల ఎదుటే కూలిపోయాయి. కానీ పది రోజుల క్రిందటే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం జరిగింది. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ముందస్తుగా రైల్వేకోడూరు తహసీల్దార్‌ బి. రామమోహన్‌, సీఐ కె. విశ్వనాథరెడ్డి తమ సిబ్బంది తో సహాయ చర్యలు తీసుకున్నారు. ముందస్తుగా రైల్వేకోడూరులోని గౌరీశంకర్‌, నారాయణ, హెచ్‌ఎంఎం, ఎంపీపీ క్యాంపస్‌ స్కూళ్లును తీసుకున్నారు. అందులోకి లోతట్టు ప్రాంతాల్లో నివస్తున్న ప్రజల్ని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్‌ వివరించారు. మండలంలోని వాగేటికోన రిజర్వాయర్‌ దగ్గర నీటి మట్టం పెరిగిందని రైతులు సమాచారం ఇవ్వడంతో సీఐ విశ్వనాథరెడ్డి తన సిబ్బందితో పరిశీలించారు. ఎక్కడా గండి పడలేదని అధికారులు వెల్లడించారు. చెరువుల వద్ద కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మండలంలోని బాలపల్లి వద్ద కొండల్లోంచి వరద నీరు పొంగి ప్రధానదారిలో ప్రవహించింది. ఇది ఇలా ఉండగా చిత్తూరు జిల్లా ఆంజనేయపురం వద్ద బ్రిడ్జిని రైల్వేకోడూరు సీఐ పరిశీలించారు. అక్కడ కొద్దిగా బ్రిడ్జి దెబ్బతినే అవకాశం ఉందని ముందుస్తుగా అధికారులు సహాయక చర్యలు తీసుకున్నారు. తిరుపతి- రైల్వేకోడూరు మధ్య రాకపోకలు సాగుతున్నాయి. రాత్రి వర్షం బలపడితే నదీపరివాహక ప్రాంతాలలో ఇళ్లు కొట్టుకునిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందుస్తుగా అధికారులు ఇళ్లు కూలిపోయే వారిని ఖాళీ చేయించారు. 

Updated Date - 2021-11-29T05:17:01+05:30 IST