‘చంపేస్తున్న’ కరోనా!

ABN , First Publish Date - 2020-03-29T09:23:06+05:30 IST

కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్‌డౌన్‌పై ప్రజల్లో అవగాహన కొరవడుతోంది. ఫలితంగా చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు...

‘చంపేస్తున్న’ కరోనా!

  • ఆర్థిక ఇబ్బందులతో ఒకరు
  • మద్యం దొరకక మరొకరు ఆత్మహత్య
  • పనుల్లేక కుటుంబాల్లో చిచ్చు 
  • లాక్‌డౌన్‌లో వింత సమస్యలు 

(ఆంధ్రజ్యోతి న్యూ్‌సనెట్‌వర్క్‌) : కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన లాక్‌డౌన్‌పై ప్రజల్లో అవగాహన కొరవడుతోంది. ఫలితంగా చిన్న చిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మద్యం దొరకలేదని ఒకరు, ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయని మరొకరు ఉసురు తీసుకున్నారు. మరో ఘటనలో భర్త పనికి వెళ్లడం లేదని భార్య ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. 


ఆర్థిక ఇబ్బందులు.. ఆపై భయం

ఆర్థిక ఇబ్బందులు.. ఆపై కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లికి చెందిన అక్కల వెంకటయ్య(56) బేల్‌దార్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారం కిందట హైదరాబాద్‌లో పని కుదుర్చుకొనేందుకు వెళ్లి 3రోజుల కిందట స్వగ్రామానికి చేరుకున్నాడు. ప్రభుత్వ సిబ్బంది కరోనా టెస్ట్‌ చేయించుకోవాలని వెంకటయ్యను కోరారు. అసలే ఆర్థిక ఇబ్బందులు.. దీనికితోడు భయం వెరసి ఆయన మానసికంగా కుంగిపోయాడు. శనివారం హైదరాబాద్‌లోని కుమారునికి ఫోన్‌చేసి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. ఉదయం 7గంటలకు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి రూ.14 లక్షల వరకు బాకీలు ఉన్నట్లు సమాచారం.  


మద్యం దొరక్క బలవన్మరణం

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దొరక్కపోవడంతో ఓ రిక్షా కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని గాంధీనగర్‌ రైతుబజార్‌ సమీపంలో ఉండే షేక్‌బాజీ ఖాన్‌(56) రిక్షా లాగుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. మద్యం దొరకడం లేదని భావించి మెయిన్‌రోడ్డులోని సామిల్లుషెడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.  


భర్తకు పనిలేదని చీమల మందు తాగిన భార్య 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం వరహాలయ్యపేటకు చెందిన వెంకటలక్ష్మి భర్త వారంరోజులుగా పనికి వెళ్లడం లేదు. దీంతో కుటుంబం తిండికి పడుతున్న అవస్థలు భార్య భర్తల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మి చీమలమందు తాగింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంది. 


కరోనా టెస్ట్‌ చేయించుకోలేదని

కరోనా అనుమానం భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి చెందిన ఆంజనేయులు తెలంగాణలోని మిరియాలగూడ సిమెంట్‌ పరిశ్రమలో పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలు మూతబడ్డాయి. రెండు రోజుల కిందట ఆంజనేయులు ఇంటికి వస్తున్నానని చెప్పడంతో.. గ్రామంలోకి ఎవరినీ అనుమతించడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకుని రావాలని ఆమె సూచించింది. అయితే, భార్య మాట వినకుండా ఆంజనేయులు ఇంటికి చేరాడు. కరోనా టెస్ట్‌ చేయించుకున్నాకే ఇంట్లోకి అడుగుపెట్టాలని ఆమె హెచ్చరించడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం మీడియాకు తెలియడంతో ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. ఆంజనేయులును వైద్యుడు పద్మకుమార్‌ క్వారంటైన్‌ కేంద్రానికి పంపారు.


Updated Date - 2020-03-29T09:23:06+05:30 IST