పచ్చిబాలింతపై కనికరం కరువు.. ఊళ్లోకి రానివ్వకపోవడంతో చెట్టు కింద..

ABN , First Publish Date - 2020-05-21T15:25:58+05:30 IST

నెత్తుడి గుడ్డతో ఓ బాలింత వస్తే ఊర్లోకి ప్రవేశించకుండా పొలిమేరలోనే గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆమెకు కరోనా ఉందనే అనుమానంతో ఊరు బయటే ఉండాలని చెప్పారు. చేసేది లేక ఆమె, కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాటు గ్రామ శివార్లలోనే ఉండిపోయారు..

పచ్చిబాలింతపై కనికరం కరువు.. ఊళ్లోకి రానివ్వకపోవడంతో చెట్టు కింద..

కరోనా భయంతో ఊరిలోకి రానివ్వని గ్రామస్థులు

అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది

రాజులమడుగులో ఘటన 


ఉట్నూర్‌(అదిలాబాద్): నెత్తుడి గుడ్డతో ఓ బాలింత వస్తే ఊర్లోకి ప్రవేశించకుండా పొలిమేరలోనే గ్రామస్థులు అడ్డుకున్నారు. ఆమెకు కరోనా ఉందనే అనుమానంతో ఊరు బయటే ఉండాలని చెప్పారు. చేసేది లేక ఆమె, కుటుంబ సభ్యులు ఐదు రోజుల పాటు గ్రామ శివార్లలోనే ఉండిపోయారు.. పచ్చి బాలింతపై కనికరం చూపే వారే కరువయ్యారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన గిరిజన కుటుంబం సొంత ఊరికి రాగా.. గ్రామానికి వస్తే తమకు ఎక్కడ వైరస్‌ సోకుతుందోనన్న భయంతో పచ్చిబాలింతను సైతం రానివ్వని దైన్యమిది. చివరకు చేసేదే మీ లేక బాధిత కుటుంబం గ్రామ శివారులోనే డేరా వేసుకుని కాలం వెల్లదీస్తున్న ఘటన ఉట్నూర్‌ మండలం రాజులమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 


గ్రామానికి చెందిన కుడిమెత జైతు తన భార్య పిల్లలతో బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం కరీంనగర్‌ వెళ్లి.. అక్కడ కోళ్ల ఫారంలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబం తిరిగి గ్రామానికి నాలుగు రోజుల క్రితం స్వగ్రామమైన రాజులమడుగుకు చేరుకుంది. ఈ నెల 14న జైతు భార్య అనసూయ ప్రసవించగా.. మరుసటి రోజు కుటుంబమంతా గ్రామానికి వచ్చారు. కరీంనగర్‌ జిల్లాలో వైరస్‌ ప్రభావం ఉన్నందు వల్ల తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన గ్రామస్థులు వారిని ఊరిబయటే ఉండాలని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక జైతు తన కుటుంబంతో సహా గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలో చేలలో డేరా వేసుకొని జీవిస్తున్నారు. 


బుధవారం విషయం తెలుసుకున్న హస్నాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెర్కగూడ ఏఎన్‌ఎంలు సుశీల, సంగీత, హెల్త్‌ అసిస్టెంట్‌ అనిల్‌లు గ్రామానికి చేరుకొని డేరా వద్ద ఉన్న వలస కూలీలతో మాట్లాడారు. వారికి ఎలాంటి వైరస్‌ ప్రభావం లేనందువల్ల గ్రామంలోకి అనుమతించాలని గ్రామ పెద్దలు మెస్రం రాము, దేవ్‌రావులకు సూచించారు. పచ్చిబాలింతకు ఆరోగ్య పరీక్షలు చేసి చిన్నారికి ఇన్‌ఫెక్షన్లు సోకాయా!? అని తెలుసుకున్నారు. చిన్నారికి కాసింత ర్యాషెస్‌ రావడంతో మందులు అందించారు. దీంతో వారిని గ్రామంలోకి పెద్దలు అనుమతించడంతో.. జైతు కుటుంబీకులు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-05-21T15:25:58+05:30 IST