ప్రజలకు వైద్యకళాశాలా అవసరమే

ABN , First Publish Date - 2021-10-29T14:35:13+05:30 IST

ప్రజలకు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎంత ముఖ్యమో..

ప్రజలకు వైద్యకళాశాలా అవసరమే

ప్రభుత్వ ప్రతీచర్యను సవాల్‌ చేయడానికి వీల్లేదు 

ప్రభుత్వం, వ్యవసాయ వర్సిటీకి హైకోర్టు నోటీసులు 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ప్రజలకు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఎంత ముఖ్యమో.. వైద్యకళాశాల కూడా అంతే ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వైద్య కళాశాల లేకపోతే ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రభుత్వ ప్రతీచర్యను ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో సవాల్‌ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని వైద్య కళాశాల నిర్మాణం కోసం బదలాయిస్తూ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి ఈ ఏడాది జూన్‌ 20న చేసిన తీర్మానాన్ని సవాల్‌ చేస్తూ బొజ్జా దశరథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఖాదర్‌ మస్తాన్‌ వలి వాదనలు వినిపించారు.


కాగా, ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరోచోట 50 ఎకరాల భూమి ఇస్తోంది కదా అని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, ఎన్జీరంగా వర్సిటీ రిజిస్ట్రార్‌, పాలకమండలి వీసీ, చైర్మన్‌, వర్సిటీ వీసీకి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. విచారణను నవంబరు 18కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

Updated Date - 2021-10-29T14:35:13+05:30 IST