జనం సొమ్ము బ్యాంకుల పాలు

ABN , First Publish Date - 2020-03-10T06:49:52+05:30 IST

ప్రైవేటురంగంలో ఓ పెద్ద బ్యాంకు కుప్పకూలిపోకుండా రక్షకుడి అవతారంలో ప్రభుత్వరంగంలోని మరో పెద్దబ్యాంకు ముందుకొచ్చింది. నష్టజాతక యస్‌బ్యాంకు మీద ప్రేమతోనో, అది బాగుపడుతుందన్న నమ్మకంతోనో స్టేట్‌బ్యాంక్‌...

జనం సొమ్ము బ్యాంకుల పాలు

ప్రైవేటురంగంలో ఓ పెద్ద బ్యాంకు కుప్పకూలిపోకుండా రక్షకుడి అవతారంలో ప్రభుత్వరంగంలోని మరో పెద్దబ్యాంకు ముందుకొచ్చింది. నష్టజాతక యస్‌బ్యాంకు మీద ప్రేమతోనో, అది బాగుపడుతుందన్న నమ్మకంతోనో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ పనిచేయడం లేదు. బలమైన బ్యాంకులనూ, ఎల్‌ఐసీ వంటి సంస్థలనూ ఆపదలో ఎలా వాడుకోవాలో మన పాలకులకు బాగా తెలుసు. ఇంత భారీ బెయిల్‌ ఔట్‌ ఇటీవలి కాలంలో చూడలేదని నిపుణులు ఆశ్చర్యపోతున్నారు. ప్రజల సొమ్మును చిత్తం వచ్చినట్టుగా అపరకుబేరులకు పంచి, కుప్పకూలిపోతున్న ఓ బ్యాంకును ఇప్పుడు పరోక్షంగా అదే ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నిలబెడుతున్నది. ఆర్థిక రంగం కుదేలైన ప్రస్తుత స్థితిలో సంక్షోభం నివారించడానికీ, డిపాజిటర్లను ఆదుకోవడానికీ ఇంతకుమించి చేయగలిగేదేమీ లేదన్నది నిజమే. కానీ, రెండులక్షలకోట్ల డిపాజిట్లతో, మూడులక్షలకోట్ల విలువ చేసే ఓ బ్యాంకు ఈ దుస్థితికి ఎలా దిగజారిందన్నది ప్రశ్న.


యస్‌బ్యాంకు ఒక్కసారిగా ఏమీ కూలిపోలేదు. బ్యాంకుల పనితీరుమీద రఘురామ్‌ రాజన్‌ ఓ కన్నేసి ఉంచినప్పుడే దానిమీద అనుమానాలు మొదలైనాయి. ఈ కారణంగానే, సహవ్యవస్థాపకుడు రాణా కపూర్‌ పదవీకాలం గత ఏడాది జనవరితో ముగిసిపోబోతున్న నేపథ్యంలో, మేనేజింగ్‌ డైరక్టర్‌ హోదాలో ఆయననే మరో మూడేళ్ళు కొనసాగించాల్సిందిగా చేసిన అభ్యర్థనను సైతం రిజర్వుబ్యాంకు తిరస్కరించింది. దీంతో ఆయన తన, కుటుంబీకుల వాటాలన్నీ ఆమ్మేసుకొని పోయాడు. ఆ తరువాత ఆర్బీఐ ప్రతినిధితో కూడిన పాలకమండలి బ్యాంకు అసలు బలాన్ని లెక్కకట్టి లోగుట్టు వెలికితీసింది. వ్యాపారం పెరగాలంటే దూకుడు అవసరమే కానీ, సంస్థను ముంచే స్థాయిలో కపూర్‌ డబ్బు పంచాడు. ముఖ్యంగా మిగతా బ్యాంకులు ముందుకురాని, అర్హతలేని సంస్థలకు, వ్యక్తులకు భారీ రుణాలు ఇచ్చాడు. నిర్మలా సీతారామన్‌ చెప్పిన ఆ సంస్థల జాబితా చూస్తే విషయం అర్థమవుతుంది. అవన్నీ ఇటీవలి కాలంలో వరుస పెట్టి కుదేలైనవే. కంపెనీలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై గత ఐదేళ్ళకాలంలో రిజర్వుబ్యాంకు పలు ఆంక్షలు విధిస్తూ వచ్చిన నేపథ్యంలో, చాలా బ్యాంకులు 9శాతానికి మించి కొత్త రుణాలు మంజూరు చేయలేదు. చివరకు స్టేట్‌బ్యాంకు రుణవితరణ కూడా పన్నెండుశాతానికి మించని స్థితిలో యస్‌బ్యాంకు ముప్పై ఐదుశాతాన్ని దాటింది. తీవ్ర సంక్షోభంలో ఉన్న బ్యాంకు కూలేంతవరకూ రిజర్వుబ్యాంకు ఎలా ఊరుకున్నదో అర్థం కాదు. వాటాలు కొనేందుకు మైక్రోసాఫ్ట్ వస్తున్నదనీ, కెనడా కుబేరుడు సిద్ధపడుతున్నాడనీ బ్యాంకు ఏవో మాటలు చెబుతూంటే ఆర్బీఐ విన్నది. ఆ ఆశలన్నీ ఆవిరై, సంక్షోభంలోకి జారిపోయాక ఇప్పుడు అనూహ్యమైన వేగంతో ఒక్కరోజులోనే రంగంలోకి దిగింది. 


ఎప్పటిలాగానే... గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ పాపానికీ కారణమని ఆర్థికమంత్రి అన్నారు. కానీ, 2014 తరువాతే ఈ బ్యాంకు రుణవితరణ భారీగా హెచ్చిన మాట విస్మరిస్తున్నారు. ఇలా నిందలు వేయడమంటే, అధికారంలో ఆరేళ్ళుగా ఉంటూ కూడా తాము ఏమీ చేయలేకపోయామని ఒప్పుకోవడమే. రిజర్వుబ్యాంకు ఆజమాయిషీ, నిఘా ఏ విధంగా ఉన్నాయో యస్‌బ్యాంకు ఘటన తెలియచెబుతున్నది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటాదారుగా, పెత్తందారుగా ఉన్న ప్రభుత్వం సైతం బ్యాంకుల వరుస విలీనాలు వినా బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించలేకపోతున్నది. యస్‌బ్యాంకు అధినేత బ్యాంకు వ్యాపారాభివృద్ధి లక్ష్యంకంటే, స్వప్రయోజనంతోనే చాలా రుణాలు ఇచ్చినట్టు దర్యాప్తులో తేలుతున్నది. సుదీర్ఘకాలం పాటు ఆయన ఇలా చిత్తంవచ్చిన రీతిలో వ్యవహరించడానికి కారణం మాత్రం ఆర్బీఐ. అంతిమంగా డిపాజిటర్లను ఆదుకొనే పేరిట ప్రభుత్వ రంగ బ్యాంకు ఒకటి ప్రైవేటురంగంలోని తన ప్రత్యర్థిని ప్రజల సొమ్ముతో కాపాడుకొస్తున్నది. ఇలా ఇతర బ్యాంకులను ముంచే బదులు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు గురించి ఇప్పటికైనా ఆలోచించడం అవసరం.

Updated Date - 2020-03-10T06:49:52+05:30 IST