పట్టపగలే చోరీ.. 30వేల విలువైన మామిడిపండ్లు కాజేసిన ప్రజలు!

ABN , First Publish Date - 2020-05-23T03:15:52+05:30 IST

పట్టపగలే ఓ మామిడిపండ్ల వ్యాపారిని ప్రజలంతా దోచుకున్నారు.

పట్టపగలే చోరీ.. 30వేల విలువైన మామిడిపండ్లు కాజేసిన ప్రజలు!

న్యూఢిల్లీ: పట్టపగలే ఓ మామిడిపండ్ల వ్యాపారిని ప్రజలంతా దోచుకున్నారు. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని జగత్‌పూరి ప్రాంతంలో ఓ వ్యక్తి మామిడి పండ్ల బండి పెట్టుకున్నాడు. కాసేపటికే కొందరు వ్యక్తులు వచ్చి తన బండిని తీసేయమన్నారని ఆ వ్యాపారి చెప్పాడు. దానికి తను నిరాకరించడంతో బలవంతంగా మామిడిపండ్లు దోచుకున్నారు. ఇది చూసిన చుట్టుపక్కలవాళ్లు సదరు వ్యాపారికి సాయం చేయాల్సిందిపోయి, వారు కూడా చేతికందినన్ని పండ్లు ఎత్తికెళ్లిపోయారు. ‘ఆటోడ్రైవర్లు, పనుల మీద బయటకు వచ్చిన వాళ్లు కూడా నా బండిపై ప్రతాపం చూపారు. మొత్తం రూ.30వేల విలువైన మామిడి పండ్లు వ్యాపారం కోసం తెచ్చుకున్నా. ఒక్కపండు కూడా లేకుండా మొత్తం జనాలు దోచుకెళ్లారు’ అంటూ ఆ వ్యాపారి వాపోయాడు.

Updated Date - 2020-05-23T03:15:52+05:30 IST