ప్రజల ప్రాణాలే ముఖ్యం

ABN , First Publish Date - 2021-04-21T07:05:48+05:30 IST

ప్రజల ప్రాణాలు కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొవిడ్‌ నియంత్రణపై మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డితో కలిసి సూర్యాపేట కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రజల ప్రాణాలే ముఖ్యం
సూర్యాపేటలో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్‌, పక్కన మంత్రి జగదీష్‌రెడ్డి

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ 

స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష : మంత్రి జగదీ్‌షరెడ్డి


సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 20: ప్రజల ప్రాణాలు కాపాడడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కొవిడ్‌ నియంత్రణపై మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డితో కలిసి సూర్యాపేట కలెక్టరేట్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా విషయంలో అపోహలతో గందరగోళం సృష్టిస్తున్నారని, ఈ విషయంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైరస్‌ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగానే ఉందన్నారు. హైదరాబాద్‌కు ఇతర ప్రాంతాల నుంచి రోజుకు లక్షల్లో ప్రజలు వచ్చి వెళ్తుండటం వల్ల పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 22 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ట్యాంక ర్లు ఏర్పాటుచేశామన్నారు. రెమ్‌డిసివిర్‌, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఐసీయూ, సాధారణ బెడ్లు, సరిపడా వైద్య సిబ్బంది అన్నీ అందుబాటులో ఉన్నాయని స్పష్టంచేశారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన విధానం ప్రకారం రోజుకు 10లక్షల మందికి పరీక్షలు చేసే అవకాశం ఏర్పడిందన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ను కట్టడి చేసేందుకే రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం మంత్రి జగదీ్‌షరెడ్డి మాట్లాడుతూ, కరోనాను నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. నిర్లక్ష్యంవల్లే వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, అవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేవని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. వైరస్‌ ప్రభావంకంటే భయంతోనే చాలామంది మృత్యువాత పడుతున్నారని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందాలని, అనవసరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లి డబ్బు ఖర్చు చేయవద్దన్నారు. నల్లగొండ జిల్లాలో 72,780 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు. 3,96,928 మందికి పరీక్షలు నిర్వహించగా, 3,301 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. సూర్యాపేట జిల్లాలో 73,550 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, 2,99,162 మందికి పరీక్షలు చేయగా, 2,122 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. అదేవిధంగా యాదాద్రి జిల్లాలో 1,27,154 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని, 1,12,223 మందికి పరీక్షలు నిర్వహించగా, 2,833 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, ఆరోగ్యశాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి, ఉమ్మడి జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T07:05:48+05:30 IST