కశ్మీర్ పండిట్ Rahul Bhat భార్య సంచలన ఆరోపణ

ABN , First Publish Date - 2022-05-13T22:03:47+05:30 IST

కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదాలు కాల్చిచంపడంపై అతని భార్య మీనాక్షి భట్..

కశ్మీర్ పండిట్ Rahul Bhat భార్య సంచలన ఆరోపణ

శ్రీనగర్: కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదాలు కాల్చిచంపడంపై అతని భార్య మీనాక్షి భట్ సంచలన ఆరోపణ చేసింది. తన భర్తను చంపేందుకు అతని కార్యాలయ సిబ్బంది ఉగ్రవాదాలతో కలిసి కుట్ర సాగించి ఉండవచ్చనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేసింది. బుద్గాం కార్యాలయంలో తనకు భద్రత లేదని,  జిల్లా ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని తన భర్త పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు తెలిపింది. బుద్దాం కార్యాలయంలో గురువారంనాడు ఉగ్రవాదులు రాహుల్ భట్‌ను కాల్చిచంపడం సంచలనమైంది.


ఈ ఘటనపై మీనాక్షి భట్ మాట్లాడుతూ, ఎవరో తన భర్త గురించి అడిగినప్పుడు అవతల వాళ్లు చెప్పి ఉండకపోతే ఉగ్రవాదులకు రాహుల్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యాలయానికి తనను బదిలీ చేయాలని పలు సందర్భాల్లో స్థానిక యంత్రాగానికి తన భర్త విజ్ఞప్తి చేశాడని, అయినప్పటికీ అతన్ని బదిలీ చేయలేదని ఆమె వాపోయింది.


కాగా, ఈ ఘటనపై దర్యాప్తు జరపాలని రాహుల్ భట్ తండ్రి డిమాండ్ చేశారు. "వచ్చిన వాళ్లు మొదట రాహుల్ భట్ ఎవరని అడిగారు. ఆ తర్వాతే అతనిపై కాల్పులు జరిపారు. ఘటనా స్థలికి 100 అడుగుల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. ఆఫీసులోనూ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ , ఒక్కరు కూడా అక్కడ లేరు. సీసీటీవీ ఫుటేజ్‌ను చూస్తే అసలు విషయం తెలుస్తుంది'' అని ఆయన అన్నారు.


భగ్గుమన్న నిరసనలు

మరోవైపు, బుద్గాం జిల్లాలో కశ్మీర్ పండిట్ రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపడంపై నిరసనలు భగ్గుమన్నాయి. కశ్మీర్ పండిట్ ఉద్యోగులు ప్రదర్శనగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం వైపు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలు ప్రయోగించడంతో పాటు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.

Read more