కోహ్లీ కూడా మనిషేనన్న సంగతి మర్చిపోయినట్టున్నారు: కోచ్

ABN , First Publish Date - 2020-09-27T22:36:07+05:30 IST

టీమిండియా రన్ మెషీన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన

కోహ్లీ కూడా మనిషేనన్న సంగతి మర్చిపోయినట్టున్నారు: కోచ్

దుబాయ్: టీమిండియా రన్ మెషీన్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ కలిపి మొత్తం 15 పరుగులు మాత్రమే చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగులు చేసిన కోహ్లీ, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు మాత్రమే చేశాడు. దీంతో అభిమానులు కాస్తా విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. రన్ మెషీన్‌కు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీ ఆటపై వస్తున్న విమర్శలపై విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించారు.


కోహ్లీ కూడా మనిషేనన్న సంగతిని ప్రజలు మర్చిపోయినట్టున్నారని, అతడు కూడా మనిషేనని, మెషీన్ కాదని పేర్కొన్నారు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి గొప్పగా ఆడడం కష్టమన్నారు. కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలుసని, అతడు అద్భుతంగా ఆడడం చూస్తున్న అభిమానులు ఏదో ఒక్క మ్యాచ్‌లో ఆడలేకపోయినంత మాత్రాన విమర్శించడం సరికాదని అన్నారు.


క్రీడాకారుడి జీవితంతో ఇది సర్వసాధారణమైన విషయమేనని అన్నారు. కోహ్లీ ఆటకు అలవాటుపడిపోయిన అభిమానులు, అతడు సరిగా ఆడనప్పుడు నిరాశ పడడం సహజమేనని, అయితే సాంకేతికంగా కానీ, ఆలోచనా విధానంలో కానీ ఏదైనా సమస్య ఉంటే ఓకే కానీ, ఇలా ఒకటి, రెండు మ్యాచ్‌లు ఆడకపోతేనే విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు.


పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలివేయడంపై కోచ్ రాజ్‌కుమార్ శర్మ మాట్లాడుతూ.. దిగ్గజ ఫీల్డర్ అయిన జాంటీరోడ్స్ కూడా క్యాచ్‌లు విడిచిపెట్టాడని, అలాగే, జావెద్ మియాందాద్ కూడా ఒకటి, రెండుసార్లు ఇదే పనిచేసుంటాడని పేర్కొన్నారు. కాబట్టి ఎంతటి ఆటగాడికైనా ఇలాంటి అనుభవాలు తప్పవని, కోహ్లీ త్వరలోనే మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-27T22:36:07+05:30 IST