ప్రజా పోరాటమే అమరావతికి రక్ష

ABN , First Publish Date - 2020-07-04T06:32:33+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో 2019 డిసెంబర్‌ 17న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక పెద్ద కుదుపు. 2014–19 మధ్యకాలంలో తొలి ప్రభుత్వం...

ప్రజా పోరాటమే అమరావతికి రక్ష

ఆంధ్రప్రదేశ్‌ శాసన సభలో 2019 డిసెంబర్‌ 17న ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటన నవ్యాంధ్రప్రదేశ్‌కు ఒక పెద్ద కుదుపు. 2014–19 మధ్యకాలంలో తొలి ప్రభుత్వం వేసిన పునాదులపై అన్ని రంగాల్లో అభివృద్ధి వేగాన్ని పెంచి గత ప్రభుత్వం కన్నా మంచి పరిపాలన అందిచడం ద్వారా పాలనలో తనదైన ముద్ర వేసుకనే మంచి అవకాశం ఉన్నప్పటికీ,... దక్షిణాఫ్రికా నమూనా అని చెప్పి, పాలనా వికేంద్రికరణ ముసుగులో జగన్‌ చేసిన ప్రకటన ఆరున్నర నెలలుగా ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని అనాధను చేసింది. ముఖ్యమంత్రి ప్రకటనతో దిగ్భాంత్రికి గురైన రాజధాని గ్రామాల రైతులు మరుసటి రోజే వీధుల్లోకి వచ్చి ప్రారంభించిన ఉద్యమమే అమరావతి పరిరక్షణ ఉద్యమం.


తొలి రోజుల్లో రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారులపై వేలాది మంది కూర్చుని దీక్షలు చేశారు. తర్వాత పోలీసుల కఠిన వైఖరి కారణంగా ప్రవేటు స్థలాలో దీక్షలు కొనసాగించారు. ఆలా 96 రోజులు శిబిరాల్లో దీక్షల తర్వాత కరోనాతో, లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఉద్యమ రూపం మారి ‘ఇంటిం ట్లో అమరావతి’గా ప్రతి ఇంట్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కూడా రాజధాని తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి శాసనసభలో తనకున్న భారీ సంఖ్యా బలంతో సీఆర్‌డీఏ బిల్లును, వికేంద్రికరణ బిల్లును వాయువేగంతో ఆమోదించి శాసన మండలికి పంపినపుడు, శాసన మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఆ బిల్లుని సభా సంఘం పరిశీలనకు పంపుతూ నిర్ణయం తీసుకోవడం, ఆసందర్భంలో శాసన మండలిలో మంత్రులు అరాచకం సృష్టించటం అందరికి విదితమే.


దాంతో తాత్కాలికంగా ఆగిన రాజధాని తరలింపు ప్రక్రియ కరోనా రూపంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేసింది. అయినప్పటికీ కరోనా ప్రమాదం తొలగకముందే సచివాలయం ఉద్యోగులను విశాఖపట్నం వెళ్లటానికి అనధికారికంగా సిద్ధం చేస్తున్నారని తెలిసి అమరావతి ఐక్యకార్యచరణ సమితి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసినప్పుడు చట్టసభల్లో బిల్లులు ఆమోదించే ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు రాజధాని తరలించమని చెప్పి, ఆ బిల్లులను మళ్లీ మొన్నటి బడ్జెట్‌ సమావేశాలో వ్యూహాత్మకం గా ప్రవేశపెట్టి శాసన సభలో ఆమోదింపు చేసుకుని శాసనమండలికి పంపగా అక్కడ ఆ బిల్లులు ఆమోదించకుండానే శాసన మండలి నిరవధికంగా వాయిదా పడింది. 


ఈ నేపథ్యంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవలంటే అమరావతి కోసం పోరాడే వాళ్లు ఏం చేయాలి...? ఏ ప్రభుత్వం అయినా ఒక విధాన నిర్ణయాన్ని మార్చుకునే విధంగా చేయగలిగింది కేవలం ప్రజల ఉద్యమం మాత్రమే. బలమైన ఉద్యమాలు మాత్రమే జగన్‌మోహనరెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఆపగలవు. అమరావతి పరిరక్షణ ఉద్యమంలో వేలాది ప్రజలు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వివిధ రూపాల్లో ఆందోళన చేసినపుడు మాత్రమే ప్రభుత్వం నుంచి కొంత స్పందన కనిపించింది. కేవలం శిభిరాల్లో కూర్చుని ఎన్ని నెలలు దీక్ష చేసినా ఈ ప్రభుత్వం మనసు కరగదు. లాక్‌డౌన్‌ ముందు జరిగింది అదే... ఇక ఇప్పుడు అమరావతిని కాపాడగలిగినది ఒక్కటే గ్రామాల్లో అన్ని వర్గాల ప్రజలు వేలాదిగా రోడ్డెక్కాలి. ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలి.... ముఖ్యంగా అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల గృహాల ముట్టడి, రోడ్డుపై ముట్టడి లాంటి కార్యక్రమాలతో పాటు, ఉద్యమ కారులపై ఆక్రమంగా కేసులు పెట్టినపుడు గ్రామం మొత్తం పోలీసు స్టేషన్‌ ముందు కూర్చొని ఆ కేసులను రద్దు చేసేవరకు పోరాడాలి. అందరినీ సమాయత్త్తం చేసి జాతీయ రహదారులను స్తంబింపజేయాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితిని సృష్టించాలి.


– డాక్టర్‌ కొలికపూడి శ్రీనివాసరావు, అధ్యక్షుడు, అమరావతి పరిరక్షణ సమితి

Updated Date - 2020-07-04T06:32:33+05:30 IST