కొవిడ్‌ పరీక్షల పేరుతో..కాసుల వేట

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

కడపలోని ఓం శాంతినగర్‌కు చెందిన ప్రదీప్‌ (పేరు మార్చాం) గత మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు

కొవిడ్‌ పరీక్షల పేరుతో..కాసుల వేట

ప్రజల్లో కరోనా భయం

తుమ్మినా, దగ్గినా చెస్ట్‌ సీటీ స్కానింగే

రూ.5,500 నుంచి రూ.6500 వసూలు

వైద్యులు, ల్యాబ్‌ నిర్వాహకులకు చెరీ సగం


(కడప -ఆంధ్రజ్యోతి) : 

కడపలోని ఓం శాంతినగర్‌కు చెందిన ప్రదీప్‌ (పేరు మార్చాం) గత మూడు రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి గురించి ప్రదీప్‌ వైద్యుడికి వివరించాడు. చెస్ట్‌ సీటీ  స్కానింగ్‌ చేయించుకుని వస్తేనే నాడి పట్టుకుని వైద్యం చేస్తాం. ఆ రిపోర్టు లేకుండా చికిత్స అందించలేమని వైద్యులు నిర్మోహమాటంగా చెప్పేశారు. 


పోరుమామిళ్లకు చెందిన చలపతి (పేరు మార్చాం) శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతుండేవాడు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటే కరోనా లక్షణాలు అని అంటుండడంతో ఇరుగు పొరుగు వారు ఎందుకైనా మంచిది కడపకు వెళ్లి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఓ ప్రైవేటు వాహనాన్ని తీసుకుని కడపలోని ఓ ఆసుపత్రికి వచ్చాడు. చెస్ట్‌ సీటీ స్కానింగ్‌ ఉంటేనే ఆసుపత్రుల్లో అడ్మిట్‌  చేయించుకుంటామని సిబ్బంది బయటే తెగేసి చెప్పేశారు. కరోనా నేపధ్యంలో తుమ్మినా దగ్గినా చెస్ట్‌, సీటీ స్కానింగ్‌ ఉంటేనే వైద్యం అందిస్తామని ప్రైవేటు వైద్యులు చెబుతున్న మాటలకు పై రెండూ ఉదాహరణ మాత్రమే. 


ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కొందరు వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను అనుసరిస్తూ ప్రజల భయాన్ని నగదు రూపంలో దోచుకోవాలని చూస్తున్నారు. ముందస్తుగానే కొంతమంది వైద్యులు, ల్యాబ్‌ నిర్వాహకుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు స్కానింగ్‌ రేట్లను కూడా భారీగా పెంచేశారు. ప్రభుత్వాసుపత్రులన్నీ కరోనా పరీక్షలతో నిండిపోతున్నాయి.


అక్కడ సాధారణ జబ్బులకు కూడా చికిత్స చేసే పరిస్థితి లేదు. సాధారణ జబ్బులతో ప్రైవేటు ఆసుపత్రి గడప తొక్కితే చాలు.. నాడి పట్టుకోకుండానే టెస్టుల పేరుతో రూ.5,500 నుంచి రూ.6500 వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దగ్గినా, తుమ్మినా సరే చెస్ట్‌ సిటీ స్కానింగ్‌ చేయించుకుంటేనే ట్రీట్‌మెంట్‌ చేస్తామని చెబుతుండడంతో ప్రజలు భయంతో ల్యాబ్‌ల వద్దకు పరుగెడుతున్నారు. అక్కడ స్కానింగ్‌ రేట్లను చూసి జనం బెంబేలెత్తుతున్నారు.


జిల్లాలో కోవిడ్‌ వ్యాధి శరవేగంగా విస్తరిస్తోంది. 11,074 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఈ సీజన్‌లో దగ్గు, జలుబు, జ్వరం వస్తుంటుంది. గతంలో వైద్యులు కూడా వాటికి చికిత్స చేసేవారు. అయితే కరోనా మహమ్మారి రాకతో సీన్‌ రివర్స్‌ అయింది. దగ్గు, తుమ్ము, జ్వరం తదితర లక్షణాలు ఉంటే కరోనా ఏమోనని భయపడే స్థితికి జనం వచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం ట్రీట్‌మెంట్‌ కోసం ప్రైవేటు ఆసుపతుల్రకు వెళితే స్కానింగ్‌ అంటూ బాదేస్తున్నారు. 


చెరీ సగం

జనాల్లో ఉన్న భయాన్ని స్కానింగ్‌ పేరుతో కొందరు వైద్యులు, ల్యాబ్‌ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో చెస్ట్‌ సీటీ స్కానింగ్‌కు రూ.2500 వసూలు చేస్తుండగా, ఇప్పుడు ఏకంగా రూ.5500 నుంచి రూ.6500 వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో సగం డబ్బును రెఫర్‌ చేసిన డాక్టరుకు ఇస్తున్నట్లు సమాచారం. అందుకే ఆసుపత్రికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ట్రీట్‌మెంటు చేయాలంటే చెస్ట్‌ సీటీ స్కానింగ్‌ అని చెబుతుండడంతో భయాందోళనలతో జనం స్కానింగ్‌ చేయించుకుంటున్నారు. ఆసుపత్రికి వచ్చే వంద మందిలో కనీసం 50 నుంచి 60 మందికి చెస్ట్‌ సిటీ స్కానింగ్‌ తీయించుకోవాలని రెఫర్‌ చేస్తున్నట్లు ఓ ఆసుపత్రికి చెందిన చిరుద్యోగి వెల్లడించారు. స్కానింగ్‌, డాక్టరు ఫీజు, మందులు కలుపుకుంటూ దాదాపు రూ.10 వేల వరకు ఖర్చు వస్తున్నట్లు చెబుతున్నారు.


తుమ్మినా, దగ్గినా పది వేలు ఖర్చు పెట్టుకోవడాన్ని చూస్తే ఔరా.. వీళ్లు వైద్యులేనా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ల్యాబ్‌లపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవంగా ఆసుపత్రికి వచ్చే రోగికి కరోనా లక్షణాలు ఉంటే యాంటిజెన్‌, ర్యాపిడ్‌ టెస్టులు చేయించుకోవాలని సూచించవచ్చు. అయితే అలా రెఫర్‌ చేస్తే మాకేంటనే ఉద్దేశ్యంతోనే వైద్యులు స్కానింగ్‌కు సిఫార్సు చేస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఓ ల్యాబ్‌ నిర్వాహకులతో కడపలోని పేరొందిన డాక్టర్లు చాలా మంది ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 


స్కానింగ్‌ సెంటర్‌లలో అధిక ధరల వసూలుపై డీఎంహెచ్‌వో అరుణ్‌కుమార్‌ను ఫోన్‌లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST